Taadi Prakash ………………………..
Why Patanjali was ignored…………….
అవి కుర్ర రచయిత పతంజలి, తన దారి తాను వెతుక్కుంటున్న రోజులు… తానేం చేయాలో,ఏం రాయాలో,తానే తర్కించుకొని,సణుక్కుని, తనలో తానే మాట్లాడుకుంటూ,సిగిరెట్లని తగలబెడుతున్న సమయం అది.
Discovery of the real pathanji అనే అంతర్మథనంలో ఒక 30సంవత్సరాల రచయిత, ధైర్యంతో,సాహసంతో, అసాధారణమైన కామన్ సెన్స్ తో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగిన వేళ అది! అప్పుడు మేం ఇద్దరం ఒన్ బై టూ చాయ్ తాగుతున్నాము.నేనాయన సిగిరెట్ వెలిగిస్తున్నాను,ఆయన చెయ్యి నా భుజంమీద ఉంది.
నామిని సుబ్రహ్మణ్యం నాయుడూ, మేర్లపాక మురళి,దాట్ల నారాయణ మూర్తి రాజు ముగ్గురు సాక్షులూ మాతోనే ఉన్నారు.ఆ సాయంకాలం… ఆకాశం లేత ఎరుపురంగులోకి మారుతోంది. చింతచెట్లమీద పిట్టలు అల్లరి చేస్తున్నాయి. దూరంగా రైలు వెళుతున్న చప్పుడు.
మహారచయిత కావడానికి ఇంకొద్ది దూరంలోనే ఉన్న,కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి అనే జర్నలిస్టు మిత్రుడు, నలిగిన లాల్చీతో,చేతిలో వెలుగుతున్న సిగరెట్ తో, ఒక పాత దిక్కుమాలిన సైకిల్ స్టాండ్ తీసి, “వెళ్తానండీ” అంటూ ముందుకి కదిలాడు.
పరిణతి చెందిన పతంజలి, తర్వాతి కాలంలో… “ఖాకీవనం, పెంపుడు జంతువులు నాకు తెలియని విషయాల్ని తెలుసుకుని రాసిన నవలలు.వాటికంత ప్రాధాన్యం లేదు” అని అనేకసార్లు చెప్పారు. తనకి బాగా తెలిసిన ఉత్తరాంధ్ర రాజుల జీవితాల గురించి చేసిన రచనలు కవుల్నీ,రచయితల్ని,జర్నలిస్టుల్నీ, పండితుల్నీ ఆశ్చర్యపరిచాయి.
రాజుగోరు,వీరబొబ్బిలి,గోపాత్రుడు,రాజుల లోగిళ్ళు(అసంపూర్తి నవల) పతంజలి లోతైన పరిశీలనకూ,హాస్యదృష్టికీ,రచనా నైపుణ్యానికీ నిలువుటద్దాలుగా ఎప్పటికీ నిలిచి వుంటాయి. రాజుల బేషజాలు,ఎకసెక్కాలు, వాళ్ళ జీవితాల్ని కుంగదీస్తున్న పేదరికం…ఐనా దర్జా వెలగబెట్టాలన్న తాపత్రయం… లోన లొటారపు ధ్వనుల్లోని విషాదసంగీతాన్ని తెలుగుసాహిత్యంలో ప్రతిభావంతంగా ‘ధ్వనిముద్రణ’ చేసినవాడు పతంజలి
అది 1992.హైదరాబాద్. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడు వాకాటి పాండురంగారావు. పతంజలి ఎప్పుడోరాసి,ఒక చిన్నపత్రికలో సగంవచ్చి ఆగిపోయిన ‘గోపాత్రుడు’ నవలిక వాకాటి చేతికి అందింది.స్వతహాగా మంచిరచయిత అయిన వాకాటి పతంజలి రచన చదివి తేరుకోలేకపోయారు.
పదాలవిరుపు,వాక్యవిన్యాసం,వ్యంగ్యం, ఫక్కున నవ్వించే హాస్యధోరణి,అధిక్షేపం, కన్నీటి బిందువులో మెరిసే జీవితపు చివరాఖరి ఆశ,భోరున కురిసే చికటిచినుకుల విషాదం… భూమి గుండ్రంగా ఉంటదా?బల్లపరుపుగాన అనే గొడవతో ఒక గ్రామం రెండు ముఠాలుగా చీలిపోతుంది.
సర్కిల్ ఇన్స్పెక్టర్ కి చిరాకెత్తుతుంది. “భూమి మా టోపీ లాగుంటుంది. భూమి పోలీసోడి లాఠీ లాగుంటాది తెలిసిందా?” అని గదమాయిస్తాడు. ఇక, ఈ జోడు గుర్రాల బండిని పతంజలి చివరాకరి దాకా దూకించి, పరిగెత్తించి, నవ్వుల దారుల్లో నడిపించి, ఆఖరికి మనం ఎంత పనికిమాలిన వాళ్లమో, చాచి కొట్టినట్టుగా చెబుతాడు.
ఆంధ్రప్రభ వీక్లీలో గోపాత్రుడు నాలుగైదు వారాలు సీరియల్ గా వచ్చింది, మోహన్ బొమ్మలతో. అప్పుడు విజయవాడలో ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ గా వున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గోపాత్రుడు చదివారు. ఒక సంపాదకుడు మరో వీక్లీ కి లెటర్ రాయడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది.
పతంజలి గోపాత్రుడు గురించి ఒక పాఠకునిలా పురాణం రాసిన లేఖ ‘ఆంధ్రప్రభ’లో వచ్చింది. ఆ లెటర్ లో… “గోపాత్రుడు లాంటి చీమూనెత్తురూ, సిగ్గూశరమూ వున్న నవల రాయలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. తెలుగు సాహిత్యంలో గురజాడ మహాశయుని తర్వాత ఇంత హాస్యం రాయగలిగిన ప్రతిభాసంపన్నుడు పతంజలి మాత్రమే’ అని పురాణం రాసారు. పతంజలి గారికి సాహిత్య అకాడమీ అవార్డులూ, పద్మశ్రీలూ రాకపోయినా పురాణం గారి ప్రశంస చాలదూ!
పతంజలి జీవించి వున్నప్పుడు చాసో, రావిశాస్త్రి పురస్కారాలు పొందారు. ‘సిందూరం’ సినిమాకి మాటల రచయితగా ‘నంది’ అందుకున్నారు 2009లో. పతంజలి చనిపోయాక ఆయనకి రెండు చెప్పుకోదగ్గ గౌరవాలు దక్కాయి. ఒకటి : ‘మనసు’ ఫౌండేషన్ వారు పతంజలి రచనలు అన్నీ కలిపి రెండు సంపుటాలుగా తీసుకువచ్చారు. రెండు : ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ సిరీస్ లో భాగంగా పతంజలి monograph ని సాహిత్య అకాడమీ 2017 లో ప్రచురించింది. ఆసక్తికరమైన, సమగ్రమైన 125 పేజీల ఈ మోనోగ్రాఫ్ ని రచయిత, జర్నలిస్టు చింతకింది శ్రీనివాసరావు రాశారు.
ఒకటీ అరా తప్ప, పతంజలి అన్ని కథలకీ, నవలలకీ ఆర్టిస్ట్ మోహనే బొమ్మలు వేశాడు. 1995 ‘ఇండియాటుడే’ వార్షిక సాహిత్య సంచికలో వచ్చిన పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’కి మోహన్ వేసిన రంగుల బొమ్మలు గొప్ప వర్క్. పతంజలివి రెండు కేరికేచర్లు,రెండు పోర్ట్రైట్ లూ వేశాడు మోహన్. ఆయన కథలకి ‘ఓన్లీ పతంజలి’ శీర్షికతో మోహన్ ముందు మాటలో ఇలా అన్నాడు :“పతంజలిలా కనిపించిందీ, పతంజలిలా వినిపించిందీ, పతంజలీ చాలా వేరేమో!… ఎందుకంటే, పతంజలి లాంటి విస్తృతి గల, తలతిక్కగల, ఆలోచనగల, చదవగల, రాయగల పరమ అవకతవక పిచ్చోడు తెలుగు సాహిత్యానికి దొరకడు”
అవునూ, ఇన్ని రాసి, ఇంత చేసి, ఎంతోమందికి అభిమాన రచయితగా కీర్తితో, యశస్సుతో కాంతులీనే కె.ఎన్.వై.పతంజలి సాహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ విప్లవ రచయితల సంఘం ఒక్క సభ కూడా జరపదు. ఎందుకో? పతంజలి అంతటివాడి రచనల్ని సెలబ్రేట్ చేసుకోవడం మన విధి అని అభ్యుదయ రచయితల సంఘం సరదాకి కూడా అనుకోదు.
అదేమిటో? మన జర్నలిస్టు, మన సంపాదకుడు, మనతో ఉంటూనే మహా రచయితగా ఎదిగిన వాడంటూ జర్నలిస్టు సంఘాలు ఒక్క సభ కూడా పెట్టాలని ఎప్పుడూ అనుకోవెందుకో…? పోనీ, ఉదారంగా పతంజలిని ఉత్తరాంధ్ర రచయితగా కుదించి చూసినా, మా గురజాడ, మా రావిశాస్త్రి, మా పతంజలి అంటూ గుండెలు బాదుకునే విశాఖ రచయితల సంఘం లేదా విశాఖ సాహితి ఇన్నేళ్లలో పతంజలి కోసం ఒక్క సభ కూడా పెట్టకపోవడం ఏమిటో? ‘నా అభిమాన రచయిత పతంజలి’ అని రావిశాస్త్రి డిక్లేర్ చేసినా వీళ్ళకెందుకు పట్టదో?
“దెస్టోయ్! దైద్రవోయ్!!” ఏళ్లతరబడి ప్రతివారమూ సాహిత్యానికి పూర్తిపేజీ ఇస్తున్న సాక్షి,ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఏనాడూ పతంజలి సాహిత్యం మీద ఒక వ్యాసం వచ్చినట్టుగానీ,చర్చ జరిగినట్టుగానీ నాకైతే గుర్తులేదు.ఎందుకిలా జరిగింది? ఈ దారుణానికి కారణం? విషాదం అనేది, చావు… అనుకునేది.ఎక్కడో దాక్కొని వుండదు. మనం విసుక్కుంటున్న, మనం విస్మరిస్తున్న, మనమంతా నడుస్తున్న ఈ బల్లపరుపు భూమ్మీదే, మన చుట్టూనే, మనల్ని చూస్తూనే, మన నీడగానే ఉంటుందేమోననిపిస్తోంది!
Pl read it also ……………… “ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది ! (1)