జెండాపై కపిరాజు ………ఒన్స్ మోర్ ప్లీజ్!

Sharing is Caring...
Bhandaru Srinivas Rao       ……………………………………….. 

హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా రంగ స్థల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ వుంది.

ఓ పక్క ‘నాటకం ఎప్పుడు మొదలవుతుందా’ అని ప్రేక్షకులు ఎదురు చూపులు చూస్తుంటే, మరోపక్క ఇవేమీ పట్టించుకోకుండా సుదీర్ఘంగా సాగే సభలో పాల్గొనే వక్తలు ‘నాటకానికి పూర్వ వైభవం తేవాలంటూ’ అంటూ దీర్ఘోపన్యాసాలు దంచుతుంటారు. వారు కోరుకునే పూర్వవైభవం ఎప్పుడూ వస్తుందో తెలియని నాటకాభిమానులు అప్పటికే చాలా పొద్దుపోయిందనుకుని నిట్టూర్పులు విడుస్తూ బయటకు జారుకుంటూ వుంటారు. ఇక ఆడిటోరియంలో మిగిలేవారు పల్చబడుతుంటారు.

‘ఈ నాటకాలు చాలు. వాటిని కట్టిపెట్టు’ అని చాలా సార్లు నిజజీవితంలో అనుకుంటూ వుండడం కద్దు. నిజంగా జరుగుతున్నది కూడా అదే. నాటకానికి పూర్వ వైభవం మాటలతో రాదు. అలాగని చేతలు కూడా పని చెయ్యడం లేదు. పదిహేనేళ్ళ క్రితం, పరిచయం అవసరంలేని పెద్దమనిషి కే.వీ. రమణాచారి గారు ‘రసరంజని’ సంస్థ ద్వారా ‘నాటకానికి ప్రాణం పొయ్యాలి’ అని నానా తంటాలు పడ్డారు. బోల్డంత ఖర్చు పెట్టారు. విసుగెత్తి మానేశారు.

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. తెలుగు వారికి పద్య నాటకాలు ఎంతో ఇష్టం. ఎనభయ్యో దశకంలో కూడా నాటకాలు బాగా చూసే వారు. ‘ఉద్యోగ విజయాలు’ నాటకంలో ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’ ‘అలుగుటయే యెరుంగని’ పద్యాలు కంఠతా రానివారు, అవి తెలియని వారు తెలుగునాట అరుదు. పొద్దున్నే చద్దన్నం తిని, గొడ్లను మేపు కోవడానికి వెళ్ళిన పాలేర్లు, పశువులు మేస్తూ వుంటే చెట్టుకింద పడుకొని ఈ పద్యాలు పాడుకొంటూ, రాగాలు తీస్తూ రోజంతా హుషారుగా గడిపేవారు. అలా గాలివాటంగా పద్యాలు పాడేవారే తదనంతర కాలంలో రంగస్థల నటులుగా మారిన ఉదాహరణలు కూడా వున్నాయి.
తెలుగు నాటక బావుటా 
‘పౌరాణిక నాటకాలు అంటే చెవి కోసుకొంటాము’ అనేవాళ్ళు పాతికేళ్ళ క్రితం దాకా. ఇది పూర్తిగా నిజం. ఆ నాటకాల్లో పాత్రధారి ఎలా వున్నా పద్యం పాడడానికే ప్రాధాన్యం. ఎంత రాగం తీస్తే అంతగా తలలూపేవాళ్ళు. ‘ఒన్స్ మోర్’ అనే ఇంగ్లీష్ మాట పల్లెపట్టులలోని నిరక్షరాస్యులకు కూడా తెలుసు. ఓ పద్యం పాడగానే ‘ఒన్స్ మోర్’ అని అరిచే వారు. ఆ పద్యం మళ్ళీ పాడే వరకు నాటకాన్ని ముందుకు సాగనిచ్చేవారు కాదు.

ఓ సీన్లో పద్యం పాడిన తర్వాత ఆ పాత్రధారి పాత్రోచితంగా కింద పడిపోవాల్సిన సందర్భంలో కూడా ప్రేక్షకులు ఎవరయినా ‘ఒన్స్ మోర్’ అంటే చాలు అతగాడు మళ్ళీ లేచి నిలబడి పద్యం పాడి రాగం తీసి మళ్ళీ పడిపోయేవాడు. ఔచిత్యమా కాదా అనేది అక్కడ అనవసరం. అలా సాగేవి నాటకాలు. జనం విరగబడి చూసే వారు. ఊళ్ళల్లో, ఉత్సవాలు అవీ జరిగినప్పుడు ‘టికెట్ నాటకాలు’ ఆడేవారు. ‘ఫలానా హాలులోనో లేక ఫలానా వారి దొడ్లోనో’ అని కర పత్రాలు వేసే వారు.

ఒకళ్ళవో ఇద్దరివో నటుల ఫోటోలు కూడా ఉండేవి, పాంఫ్లెట్ చివర్లో రేట్లు ఉండేవి. రిజర్వుడు, కుర్చీ, బెంచీ, నేల ఇలా విడివిడిగా టిక్కెట్లు వుండేవి. మహా అయితే టికెట్ ఖరీదు రూపాయి, అర్ధ, పావలా అలా వుండేది. ‘ప్యాట్రన్ టిక్కెట్లు కలవు’ అని రాసే వారు. ‘స్త్రీలకు ప్రత్యేక స్థలం. ఆలసించిన ఆశాభంగం, షరా మామూలే! త్వరపడండి. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోండి! ఏ కారణం చేతనయినా ప్రదర్శన నిలిపివేసినయెడల టికెట్ డబ్బు వాపసు ఇవ్వబడదు’ ఇలా ఏవేవో రాసేవారు.
మరపురాని కొందరు మహానటులు
నాటకాలు ఆడేవారిలో సూరిబాబు,రాజేశ్వరి నిజజీవితంలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా. స్టేజి మీద ఆయన ధర్మరాజు వేసేవారు . పాచికలు ఆడే సీనులో తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా పెట్టి వోడిపోతున్న ఘట్టంలో పద్యాలు గొప్పగా ఉండేవి. రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.

బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా రైలు పట్టాలకు ఆవతలి వయిపు ‘రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.సి.డి. కృష్ణమూర్తి అనే ఆయన కూడా ధర్మరాజు, కృష్ణుడు వేషాలు వేస్తూ వుండేవారు. జైహింద్ టాకీసు లక్ష్మీ టాకీసుల మధ్య సోమిదేవమ్మ గారింట్లో వెనుక పోర్షన్ లో అద్దెకు వుండేవారు. పుట్టుకతో అరవ వాడు అయినా తెలుగులో సుస్వరంతో రాగయుక్తంగా పద్యాలు పాడేవారు.

కిరీటం వెనుక గుండ్రటి వెలుగు ప్రసరిసున్నట్టుగా కృష్ణుడి వేషంలో ట్రిక్ ఫోతోగ్రఫీతో తీయించుకున్న అనేక ఫోటోలు సీడీ కృష్ణమూర్తి గారింట్లో గోడలమీద దర్శనమిచ్చేవి.దుర్యోధనుడుగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి పేరు అందరికీ తెలిసిందే. నాటకాల్లో ప్రారంభించి సినిమాలకు వెళ్లి అడపా తడపా మళ్ళీ నాటకాలు వేస్తూ వుండేవారు. చివరగా అవసాన దశలో గుంటూరులో వో పెద్ద ఆంజనేయ స్వామి గుడి కట్టించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రాముల వారిలో ఐక్యం పొందారు.

ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి , వెంట్రప్రగడ నారాయణరావు, దుర్యోధన వేషాలకు ఖ్యాతి గడించారు. కురుక్షేత్రంలో భీముడిదో మంచి పాత్ర. వేమవరపు శ్రీధరరావు గారు భీముడి పాత్రకి మరోపేరుగా నిలిచారు. ఈయనకూడా రేడియో స్టేషన్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు.

టి. శేషా రావు, విన్నకోట సాంబయ్య భీముడిగా గుర్తుండిపోయే పేర్లు. అబ్బూరి ఆదినారాయణ శర్మ, అబ్బూరి వర ప్రసాద రావు తమ్ముడు. ఈయన కర్ణుడిగా వేసేవారు. అలాగే అబ్బూరి వెంకటప్పయ్య. హెచ్. ఎం. వి. వారి గ్రామఫోను రికార్డుల్లో అబ్బూరితో కలసి పాడారు. 

(మార్చి 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!