బీజేపీ కి గుడ్ బై చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తిరుపతి పార్లమెంట్ బరిలోకి పార్టీ అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతల వైఖరి పట్ల పవన్ విసిగిపోయారని అంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల రోజునే పవన్ తెరాస అభ్యర్థి ని గెలిపించాలని పిలుపునివ్వడం, ఖమ్మం మునిసిపల్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తాననడాన్నిబట్టి పవన్ బీజేపీ తో బంధాలను తెంచుకోబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.
అలాగే తిరుపతి లోక సభ సీటు విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకపోవడం .. చివరికి ఏకపక్షంగా బీజేపీ నే పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలు చులకనగా మాటాడుతున్నారని కూడా పవన్ విమర్శించారు. ఈవిషయంపై బీజేపీ నేతలు స్పందిస్తూ పొత్తు విషయం లో తాము ఎప్పుడూ పవన్ తో మాట్లాడలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వల్ల జనసేన నష్టపోయిందని ఆ పార్టీ కార్యదర్శి పోతిన మహేష్ కూడా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇదంతా పవన్ కి తెలియకుండా జరిగి ఉండదని అనుకుంటున్నారు.
బీజేపీ తో ఉంటే పార్టీ ఎదగదని .. స్వతంత్ర వైఖరిని కోల్పోవలసివస్తుందని పవన్ భావిస్తున్నారు. స్వేచ్ఛగా ఏ మాట మాట్లాడానికి .. ఏ విమర్శ చేయడానికి అవకాశం లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడటానికి ,పోట్లాడటానికి వీల్లేకుండా చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల ఏపీ లో బీజేపీ ఎదగడం చాల కష్టమని పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా హై కమాండ్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఉదాహరణలున్నాయి. ఏపీ అభివృద్ధి కి ఇచ్చిన ఏ హామీలను కూడా కేంద్రం పట్టించుకోవడంలేదు.
ఈ పరిస్థితుల్లో మర్రి చెట్టు లాంటి బీజేపీ నీడన పార్టీ ఎదగడం కష్టమని జనసేన నేతలకు అర్ధమైంది. కాకపోతే కొంచెం ఆలస్యమైంది.
అసలు బీజేపీ తత్వానికి .. పవన్ మనసత్వానికి పొంతనే కుదరదు. స్పష్టమైన ఐడియాలజీ లేకపోవడం మూలానా ఈ ఇబ్బందులని పార్టీ నేతలు గ్రహిస్తే … చిన్నగా అయినా పార్టీ బలపడుతుంది. నిన్నటి మునిసిపల్ ఎన్నికల్లో జనసేనకు 4.67 శతం ఓట్లు రాగా .. బీజేపీ కి కేవలం 2.41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే ఒంటరి పోరాటం చేసినట్టయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉండేవని పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి ఉపఎన్నికలోనైనా బరిలోకి దిగి సత్తా చాటుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో పార్టీనేతలతో కార్యకర్తలతో పవన్ సమావేశంమై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీనేతలు ఇప్పటికైతే పవన్ ను బుజ్జగించుదాం అన్న ధోరణిలో లేరు. ఏం జరుగుతుందో కొద్దీ రోజులు పోతేగానీ తేలదు.
—————–K.N.MURTHY