వరంగల్ లో అడుగడుగునా జైనం !

Sharing is Caring...

Sheik Sadiq Ali…………  

వరంగల్ అనగానే మనకు కాకతీయులు, వారి పరిపాలనా దక్షత, వీరత్వం గుర్తుకొస్తాయి.అంతకన్నా కొంచెం వెనక్కిపోతే రాష్ట్రకూటులు ,చాళుక్యులు గుర్తుకొస్తారు. కానీ వరంగల్ కు అంతకన్నా గొప్ప నేపధ్యం ఉంది.రాజకీయాల కన్నా ముందు వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. మోక్ష సాధన కోసం జైనులు ధ్యానం చేసిన కేంద్రం. సత్యం, అహింస వంటి ధర్మాలను బోధించిన, అనుసరించిన కర్మభూమి. జ్ఞాన భూమి. జైన మతానికి కీలక స్థావరం. హనుమకొండ నడిబొడ్డున ఉన్న అగ్గులయ్య గుట్ట,పద్మాక్షి గుట్టల మీద చేసిన పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.ఈ పరిశోధనలో వరంగల్ నగరాన్ని ఆధ్యాత్మిక రంగంలో సమున్నత స్థానంలో నిలబెట్టే తిరుగులేని రుజువులు దొరికాయి. రెండువేల సంవత్సరాలకు పూర్వమే వరంగల్ లో జైనం విలసిల్లింది. హనుమకొండ చౌరస్తాలోని బస్టాప్ వెనుక భాగంలో ఎత్తైన కొండ కన్పిస్తుంది. దాన్ని స్థానికులు అగ్గులయ్య గుట్ట అని పిలుస్తారు.

దూరం నుంచి చూస్తే ఆ గుట్ట మీద ఒక పె….ద్ద బండరాయి, దాని మీద చెక్కిన దాదాపు 35-40 అడుగుల దిగంబర తీర్దంకరుడి విగ్రహం కన్పిస్తుంది. కొండ ఎక్కి దగ్గరికి వెళ్లి చూస్తే , ఆ విగ్రహం పక్కన చెట్ల చాటున అదే బండమీద మరో 13 అడుగుల మరో తీర్దంకరుడి విగ్రహం కన్పిస్తుంది. రెండూ చూడ్డానికి ఒకేలా ఉన్నా, రెండింటికీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ విగ్రహాలూ, వాటి చుట్టూ ఉన్న ఆనవాళ్లను బట్టి పెద్ద విగ్రహాన్ని మూడో తీర్దంకరుడైన సంభవ నాదుడి గానూ, చిన్న విగ్రహాన్ని 23 వ తీర్దంకరుడైన పార్శ్వనాదుడి గానూ భావించాల్సి ఉంటుంది. అదెలా అంటే, మొత్తం జైన తీర్దంకరులు 24 మంది. మొదటివాడు రిషభ నాధుడు,అతడినే ఆది నాధుడు అని కూడా వ్యవహరిస్తారు. చివరి వాడు మహావీరుడు. అందరి విగ్రహాలు ఒకేలా ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కో చిహ్నం ఉంటుంది. వాటిని బట్టి ఆ తీర్ధంకరులను గుర్తించవచ్చు. మూడో వాడైన సంభవ నాదుడి చిహ్నం గుర్రం. ఈ గుట్ట మీద ఉన్న పెద్ద విగ్రహం పాదాల చెంత ఉన్నది గుర్రం చిహ్నం . దాంతో ఆ విగ్రహం ఎవరిదో ఇట్టే తెలిసిపోతుంది. అలాగే… దేశంలోని వివిధ జైన ఆలయాల్లో ఉన్న సంభవ నాదుడి విగ్రహాల పాదాల చెంత ఈ గుర్రం చిహ్నం కన్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ తీర్దంకరుడు కాయోత్సర్గ భంగిమలో ధ్యానం చేసి మోక్షం పొందాడు అని ఆ మత గ్రంధాలు రాశాయి.

ఈ విగ్రహం కూడా అదే భంగిమలో ఉంది.ఇకపోతే చిన్న విగ్రహం పార్శ్వనాదుడి దే అని చెప్పటానికి చాలా స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. విగ్రహం తలపైన ఏడు పడగల సర్పం ఉంది. అతని చిహ్నం కూడా సర్పమే. అంతే కాక ప్రపంచంలోని ఏ జైన దేవాలయంలో నైనా అతని విగ్రహం అలాగే ఉంది. అలాగే, అది కూడా కాయత్సర్గ భంగిమలోనే ఉంది. తిరకొయిల్ ఆలయంలో ఉన్న 8 వ శతాబ్దపు విగ్రహం కూడా అచ్చం ఇలానే ఉంది. కొన్ని చోట్ల ఇదే తీర్దంకరుడి విగ్రహం పద్మాసన భంగిమలో కూడా కన్పిస్తుంది. కానీ రెండు భంగిమల్లోనూ కామన్ గా కన్పించే అంశం తలపై కన్పించే ఏడు పడగల సర్పం కావటం విశేషం. ఆ రకంగా ఈ విగ్రహాన్ని 23 వ తీర్దంకరుడిగా నిర్ధారించ వచ్చుఅగ్గులయ్య గుట్టమీద మరో విశేషం కంటపడింది. ఎత్తైన ఆ గుట్ట ఎక్కడానికి కిందకానీ, పైనకానీ మెట్లు లేవు. చిత్రంగా మధ్యలో ఒక పెద్ద బండరాయి మీద రెండు అంచెల్లో 55 మెట్లు రాతిలో తొలిచి ఉన్నాయి.(ఇలాంటివే మెట్లు మనం శ్రావణ బెలగోళ లో చూడొచ్చు. అదీ గొప్ప జైన క్షేత్రం).

వీటిలో ఐదు మెట్లకు ఒక ప్రత్యేకత కన్పించింది. ఆ మెట్ల మీద ఏనుగు, వరాహం,తాబేలు చిహ్నాలు చెక్కి ఉన్నాయి. ఇందులో ఏనుగు తీర్దంకరుల్లో రెండో వాడైన అజితనాధుడి చిహ్నం. పంది(వరాహం) 13 వ వాడైన విమల నాధుడి చిహ్నం. తాబేలు 20 వ వాడైన ముని సువ్రతుడిది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ కొండల మీద జైనుల ప్రాభవం ఎలా ఉండి ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. జైనులు తోలి నుంచీ గుహలనే తమ సాధనా కేంద్రాలుగా, బసదులుగా చేసుకునేవారు. ఆ విషయం మనకు పద్మాక్షి గుట్టను చూస్తే అర్ధం అవుతుంది. అక్కడ పార్స్వనాధుడు, మహావీరుడి విగ్రహాలు,ఇతర జైన విగ్రహాలు చెక్కి ఉన్నాయి. గుహాలయం ఉంది, బసది ఉంది. వాటిని నిర్ధారిస్తూ కాకతీయులు వేసిన శాసనం ఉంది.వరంగల్ కు 55కిలోమీటర్ల దూరంలో జైనగాం (జనగామ) ఉంది. అక్కడ జైన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. అలాగే వరంగల్ కు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకలో 2 వేల సంవత్సరాలకు పూర్వం నాటి జైన ఆలయం ఉంది.అందులో రిషభనాధుడు,నేమీనాధుడు,మహావీరుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ రెండింటి కన్నా ముందే వరంగల్ లో జైనం బలంగా ఉంది.

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>  కుంభమేళా సంస్కృతి ఇప్పటిది కాదా ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!