ముక్కామల చక్రధర్……………………………………..
ఈ చదువుకున్నోళ్లతో ఇదే ఇబ్బంది. వీళ్ల చదువంతా సాయంత్రాలు గలాసుల్లో ఒంపేసి.. పగలు కాగితాల మీద కక్కేస్తారు. దాన్ని కడుక్కుని శుభ్రం చేసుకుని మనమంతా ఏడ్చేస్తాం. దశాబ్దాల క్రితం చుట్ట తిప్పుకుంటూ ఏలూరెళ్లాలి అంటూ రాసారు ప్రఖ్యాత రచయిత చా.సో. అప్పుడు తెలీదు ఏలూరెందుకెళ్లాలో. ఇదిగో ఇక్కడి దాకానే అంటూ ఏలూరు రోడ్డు ఆత్మగీతం వైపు తీసుకుపోయాడు ఈ తాడి ప్రకాష్ అనే అప్రయోజకుడు.
అవును, ఇతగాడు అప్రయోజకుడు. డబ్బులు లేవు. ఇల్లు లేదు. వొట్టిపోని ఆవూ లేదు. అందుకే అప్రయోజకుడు. కానీ, వీడి సిగతరగ… ఈ ప్రకాష్ వొళ్లంతా అక్షరాలే. ఇంద్రుడికి కళ్లలా.. ఏం చూస్తాడో, ఎక్కడ చూస్తాడో, ఎప్పుడు చూస్తాడో… ఎలా చూస్తాడో. రాసేస్తాడు. చదవండర్రా అంటూ ఫేస్‌బుక్‌లో అచ్చేసేస్తాడు.
ఇతగాడు అచ్చోసిన అక్షరం. ఈ ప్రకాష్‌ని అచ్చోసి బయటకు వదిలేసిన వాడు ఆర్టిస్టు మోహన్. ఆ మోహన్ తమ్ముడైన పాపానికి చాన్నాళ్లు అతని నీడ ఇతను. వీళ్లద్దరూ ఆర్టుకి కళ్లై కూర్చున్నారు. ఒకరు అక్షరంగాను, మరొకరు బొమ్మగానూ స్థిరపడిపోయారు.
ఇలా నీడ, క్రీనీడగా రికామీగా బతికేస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములూ హైదరాబాద్‌లో ఉన్న వారికి, అక్కడికి వెళ్లిన కవులు, రచయితలు, అనేకానేక మంది చిన్నాపెద్ద ఆర్టిస్టులకి కాన్వాస్ అయిపోయారు. మోహన్ ఉన్నంత వరకూ తాడి ప్రకాష్ అతని తమ్ముడే. మోహన్ అలా నడుచుకుంటూ వెళ్లిపోయిన తర్వాతే ప్రకాష్ రాయడం ప్రారంభించాడు. అదే ఇప్పుడు ఏలూరు రోడ్డు ఆత్మగీతం అయిపోయింది.
ఇంతకీ ఇందులో ఏం రాసాడయ్యా అని పుస్తకం తిరగేస్తే కవిత్వం కనపడుతుంది. శుద్ధ వచనం తాండవిస్తుంది. కొన్ని జీవితాలు తారపడతాయి. అందులో మహాకవి శ్రీశ్రీ నుంచి వాడికి మాత్రమే… ఒక్కోసారి వాడికీ అర్ధం కాని ఎం.ఎస్.నాయుడు వంటి వారు ఉంటారు. తన కళ్ల ముందే కథ రాసేసి ఫస్టు ప్రైజ్ కొట్టేసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటాడు. చిన్న ముడితో, ముడతలు పడిన దేహంతో సాక్షాత్కరించిన మల్లీశ్వరి భానుమతీ ఉంటుంది.
ఎవరికైనా పుట్టిన రోజులుంటాయి. పుస్తకాలకుంటాయా. ఉంటాయంటున్నాడు ఫిల్టర్ సిగరెట్‌లా పోడువుగా ఉండే ప్రకాష్. అందుకే పతంజలి ఖాకీవనానికి 40 వ పుట్టిన రోజు చేశాడు. పనిలో పనిగా పతంజలితో కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడు. పాత చింతకాయ పచ్చడి జ్వరం వచ్చిన వాళ్ల నోటికి హితువుగా ఉంటుంది. ఈ మధ్య సాహిత్యానికి కాసింత జ్వరం తగిలింది.
మంచి సాహిత్యం రావడం లేదని బెంగటిల్లే వాళ్లకి 1985 సంవత్సరంలో ఉదయం పత్రికలో తాను చేసిన రోణంకి అప్పలస్వామి ఇంటర్య్వూని ఈ ఆత్మగీతంలో మళ్లీ అచ్చేశాడు. ఇది జ్వరం తగిలిన చాలా మంది సాహితీవేత్తలకు పాత చింతకాయ పచ్చడిలా అనిపించింది. అంటే జ్వర తీవ్రత కాసింత తగ్గించాడన్నమాట. ఏటి సేత్తున్నారా… ఎలా గున్నారేటి అంటూ ఉత్తరాంధ్ర యాసలో పలకరించే అట్టాడ అప్పల నాయుడ్ని.. ఇతగాడు ఇలా రాసాడు.
చదవకపోయారా… ఏటవుద్ది… ఏటీనేదు… మీరు వెందుకూ పనికిరారుస్మి. చదవడం వొగ్గేశారా.. ఆ తర్వాత సాలా పుర్రాకులు పడిపోతారు అంటూ బెదిరించాడు. విశాలాంధ్రకు నడిచొచ్చిన చండ్ర రాజేశ్వరరావు గారిని, ప్రకాష్ విశాలాంధ్రలో పని చేయక పోయినా… అక్కడే నాలుగక్షరాలు నేర్పించడమే కాదు.. చదవకపోతే పోతావురోయ్… ఎందుకు పనికి రాకుండా పోతావ్ అంటూ శపించిన రాంభట్లని, వీరాధివీరుల్ని కూడా ఈ ఏలూరు రోడ్డుకు మళ్లీ తీసుకొచ్చాడు ఈ ప్రకాష్ అనే కమ్యూనిస్టు.
ఈ రాతల్లో ఉప్మాలో అక్కడక్కడ తగిలే జీడిపప్పు పలుకులు లేవు. అసలు ఈ ఆత్మగీతమే జీడిపప్పుతో చేసిన ఓ కూర. చనిపోయిన వారి గురించి చాలా మంది రాస్తారు. అంతోడు, ఇంతోడు అని భుజకీర్తులు తొడుగుతారు. బతికి ఉన్న వాళ్ల గురించి వాళ్ల ముందే రాయడమే అసలు రాత. ఆ పని చేశాడీ తాడి ప్రకాష్. తప్పు రాస్తే ఆయా మనుషులు పిలకుచ్చుకుంటారని తెలిసినా… శుభ్రంగా కటింగ్ చేయించుకుని పిలక దొరక్కుండా మహ చమత్కారంగా రాశాడు.
వ్యక్తుల ప్రైవేట్ బతుకులు వారి వారి సొంతం… పబ్లిక్కులో నిలబడితే ఏమైనా అంటాం అని శ్రీశ్రీ అంటే… దాన్ని నిజం చేసి తాపిగా కూర్చున్నాడు ప్రకాష్. మీకు కూడా ఇతగాడి చేత ఏదైనా రాయించుకోవాలని ఉంది కదా… రాయడు… సత్త ప్రమాణంగా రాయడు. నచ్చాలి. గిచ్చాలి. దోస్టోయేన్ స్కీలా సముద్రమంత కాకపోయినా… ఏలూరు కాలువలా చిన్న ప్రవాహమైనా సరే ఓ చిన్న చేప పిల్లలా నీలో ఈదులాడుకుంటూ రాసేస్తాడు. ప్రవాహమయ్యేందుకు సిద్ధపడాల్సింది నువ్వే. మనమే.