Ntr first movie………………………………..
ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు వెండి తెరకు పరిచయమై ఇవాళ్టి కి సరిగ్గా 75 యేళ్లు అవుతోంది. ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ నవంబరు 24, 1949న విడుదలైంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించారు.
ఈ సినిమాను “విప్రదాస్” అనే బెంగాలీ సాంఘిక నవల ఆధారంగా నిర్మించారు. ఎల్.వి.ప్రసాద్. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శోభనాచల స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు.ఆనాటి ప్రసిద్ధ నటి కృష్ణవేణి కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఎన్.టి. రామారావు తరువాత కాలంలో ౩౦౦కి పైగా చిత్రాల్లో నటించారు.తెలుగు చలనచిత్ర రంగంలో మరే నటుడు పొందనంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. యాభైయేళ్ల పాటు చిత్రసీమలో ఎన్టీఆర్ నటుడిగా వివిధ పాత్రల్లో నటించడంతో పాటు నిర్మాతగా, దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు.
బీష్ముడు, రాముడు. కృష్ణుడు,అర్జునుడు,దుర్యోధనుడు,శివుడు, రావణాసురుడు,బ్రహన్నల వంటి విభిన్నపాత్రలు పోషించారు. శ్రీకృషుడిగా ఎంతమంది నటించినా ఎన్టీఆర్ స్టయిలే వేరు. అలాగే రావణాసురుడిగా, దుర్యోధనుడిగా తనదైన శైలి లో నటించి మెప్పించారు.
అలాగే ఈ సినిమా ద్వారా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం లోకి ప్రవేశించారు.
ఈ సినిమా లో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కూడా వాడుకున్నారు. అలాగే దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను ఉపయోగించారు. సినిమాలో పదహారు పాటలు ఉన్నాయి.
సీనియర్ సముద్రాల వారు స్క్రిప్ట్ సమకూర్చారు. ఈ సినిమాలో నాటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, రేలంగి వెంకట్రామయ్య, వంగర వెంకటసుబ్బయ్య ,రామనాథశాస్త్రి , మాస్టర్ విజయశంకర్, సి.కృష్ణవేణి తదితరులు నటించారు.
ఇది బెంగాలీ కథ ఆధారంగా నిర్మితమైన మొదటి తెలుగు సినిమా. తర్వాత కాలంలో దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమాలు గా రూపొందాయి. వాటిలో చాలావరకు విజయవంతమయ్యాయి.స్వాతంత్య్రం రాకముందు సినిమా మొదలైనప్పటికీ వివిధ కారణాలవల్ల స్వాతంత్య్రం వచ్చాక విడుదల అయింది. ఈ సినిమాలో నటించిన వారు .. సాంకేతిక నిపుణులు దాదాపుగా అందరూ స్వర్గస్తులైనారు.