వీరప్పన్ మరణం మిస్టరీ యేనా ?

Sharing is Caring...

How Veerappan was killed……………………………….

పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు. వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా  2,000 ఏనుగులను  వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు. చందనం చెక్కలను వివిధ రాష్ట్రాలకు పంపించాడు.

వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వీరప్పన్ 20 సంవత్సరాలకు పైగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. పశువుల కాపరి కుటుంబంలో జన్మించిన వీరప్పన్ పెద్ద గా చదువుకోలేదు. మేనమామ .. వేటగాడు సెవియా గౌండర్,  బందిపోటు మలయూర్ మమ్మట్టియాన్‌ లు అంటే వీరప్పన్ కి ఇష్టం.  వీరప్పన్ 14 సంవత్సరాల వయస్సులో  మొదటి సారి ఏనుగును వేటాడాడు. 17 సంవత్సరాల వయస్సులోమొదటి సారి హత్యకు పాల్పడ్డాడని అంటారు.

వీరప్పన్ బాధితుల్లో ఎక్కువ మంది పోలీసులు, అటవీ అధికారులు, స్థానికులు ఉన్నారు. ఇన్‌ఫార్మర్లుగా అనుమానిస్తే వెంటనే చంపేసేవాడు. 1986లో వీరప్పన్ ఒకసారి పోలీసులకు దొరికాడు. కానీ వెంటనే తప్పించుకున్నాడు.వీరప్పన్ అడవుల్లో రహస్య స్థావరం ఏర్పాటుచేసుకుని ఉండేవాడు.అలాంటివి నాలుగైదు స్థావరాలు ఉండేవి. అతగాడి చుట్టూ 15 మంది సాయుధ సిబ్బంది కాపలాగా ఉండేవారు. అటవీ గ్రామాల్లో కొందరిని తన మనుష్యులను నియమించుకున్నాడు.

పోలీస్ కదలికలు వారి ద్వారా వీరప్పన్ కి తెలిసేవి.ఎప్పుడు ఎక్కడ ఉండేవాడో ఎవరికి తెలిసేది కాదు. తరచుగా ఒకచోటు నుంచి మరో చోటుకి మారుతుండేవాడు. వీరప్పన్ ప్లాన్ చేసాడంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు. ఒకసారి మందు పాతర అమర్చి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండర్ ఎస్. గోపాలకృష్ణన్ ప్రయాణిస్తున్న వ్యాన్‌ను పేల్చివేశాడు.

ఈ ఘటనలో గాయాలతో  గోపాలకృష్ణన్ తప్పించుకోగా, వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 35 మందిలో 22 మంది స్పాట్ లో మరణించారు. వీరిలో నలుగురు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ గార్డులు, పోలీసులకు సహకరించిన 14 మంది కీలక ఇన్‌ఫార్మర్లు ఉన్నారు. 1990 లో వీరప్పన్ ను పట్టుకోవడానికి  ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి వీరప్పన్ మరింత చెలరేగిపోయాడు.  1991లో సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి పి శ్రీనివాస్ ను వీరప్పన్ దారుణంగా హతమార్చాడు. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది.

2000 సంవత్సరంలో కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసాడు. 108 రోజుల పాటు అడవుల్లోనే ఉంచాడు. పెద్ద నగదు మొత్తం అందాకనే రాజ్ కుమార్ ను వదిలాడు. 2004లో తమిళనాడు లోని పప్పరప్పట్టికి సమీపంలో అక్టోబర్ 18 న  స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో వీరప్పన్ హతమయ్యాడు. వీరప్పన్ తన గ్రూప్ లో ఉన్న ఒక పోలీసు ఇన్ఫార్మర్ తో కలిసి సేలం  ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకునేందుకు అంబులెన్స్ లో బయలు దేరాడు.

అటవీ మార్గంలో ఒక చోట అంబులెన్సు ఆగింది. ఇన్ఫార్మర్  బండి దిగారు. అంతే అంబులెన్సు పై బుల్లెట్ల వర్షం కురిసింది. 338 బుల్లెట్లు ఈ కాల్పుల్లో ఉపయోగించారు. అయితే ఇదంతా కట్టుకథ అనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నాడు జరిగిన  ఆపరేషన్ కోకూన్  కి పోలీసు అధికారి కె విజయ్ కుమార్ నాయకత్వం వహించారు. తర్వాత కాలంలో విజయకుమార్ వీరప్పన్ పై ఒక పుస్తకం కూడా రాశారు.

అప్పట్లో వీరప్పన్ మరణం తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కొన్ని మీడియా సంస్థలు . కొందరు మానవతా వాదులు వీరప్పన్  ను న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లకుండా  పోలీసు కస్టడీలో చిత్రహింసలకు  గురిచేసి చంపారనే వాదనలు కూడా వినిపించారు. వీరప్పన్ కన్ను పీకేశారు అని కూడా ప్రచారం జరిగింది. 

అప్పట్లో తెహెల్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ పత్రిక నక్కీరన్ సంపాదకుడు గోపాల్..  వీరప్పన్ ను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి .. హతమార్చారని చెప్పారు. ఆపరేషన్ కోకూన్‌  కట్టుకథ అన్నట్టుగా గోపాల్ మాట్లాడారు. నటుడు రాజ్‌కుమార్‌ను రక్షించడంలో ప్రభుత్వానికి  వీరప్పన్ ల నడుమ మధ్యవర్తిగా గోపాల్  వ్యవహరించారు.

పోలీసులు చెప్పినట్టు వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో మరణించలేదు.అతగాడిని సజీవంగా పట్టుకుని రెండు మూడు రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఫోటో తీయడానికి ముందు వారు శరీరానికి ఎంబాల్మ్ చేసారని .. అతని ముఖం ఉబ్బి ఉందని కూడా గోపాల్ వివరించారు. 

మొత్తం మీద వీరప్పన్ మరణం కూడా మిస్టరీయే. వీరప్పన్ పై ఆరు సినిమాలు .. టెలీ సీరియళ్లు రూపొందాయి. వాటిలో ఆర్జీవీ తీసిన కిల్లింగ్ వీరప్పన్ ఒకటి. 

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!