Beliefs vs power………………………………………..
రాజశ్యామల యాగం …….. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం భారీ ఎత్తున చేయించారు.
దానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా స్వాముల వారు హాజరై దీవెనలు ఇచ్చి వెళ్లారు. ఆ తరువాత కేసీఆర్ రెండవ మారు సీఎం గా అధికారంలోకి రావడంతో రాజశ్యామల యాగం విశిష్టత అందరికి తెలిసి వచ్చింది.
మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి.
అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో ‘వేసినవి’ దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు . యుద్దాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. ఇప్పటి కాలంలో యుద్ధమంటే ఎన్నికలని చెప్పుకోవచ్చు.
ఇక యాగానికి సూక్ష్మ రూపమే హోమం. హోమం – కుటుంబ సభ్యుల కోసం గృహస్థులు చేయించుకునేది. సాధారణంగా ఒక్క రోజుకి పరిమితం అవుతాయి. యాగం , మహా యాగం భారీ స్థాయిలో జరుగుతాయి. కొన్ని రోజుల నుంచి నెలలపాటు కూడా జరుగుతాయి. సంకల్పం వ్యక్తిగతం కావచ్చు లేదా ఊరు, రాజ్యం,సంక్షేమం, విజయం కోసం కావచ్చు.
గతంలో ఉమ్మడి ఏపీని ఏలిన మాజీ ముఖ్యమంత్రులలో కూడా కొందరికి దైవ భక్తి విశేషంగా ఉండేది. ఎన్టీఆర్ తాను స్వయంగా కాషాయ వస్త్రధారిగా నిలిచి ఆకట్టుకున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ , అప్పటి కేంద్రమంత్రులు, సీఎంలు కూడా స్వాముల పట్ల తమ విశ్వాసాలను చాటుకున్నారని గత చరిత్ర చెబుతోంది.
ఆ మధ్య విశాఖలోని శారదాపీఠంలో రాజ శ్యామలా యాగం అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు.
రాజశ్యామల అమ్మవారి యాగం విజయవంతంగా పూర్తి అయిందని, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతోనే దీనిని నిర్వహించామని స్వరూపానందేంద్ర అప్పట్లో వివరించారు. తెలుగు రాజకీయాలలో భారీ మార్పులను తీసుకువచ్చిన ఘనత ఈ యాగానికి ఉందని అప్పట్లో ఆయన చెప్పడం విశేషం. మొత్తం మీద చూసుకుంటే రాజశ్యామల యాగానికి ఇంతటి ప్రాచుర్యం లభించడం నిజంగా ఆసక్తికరమైన అంశమే.
ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తున్నారు. కొత్తగా జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం కోసమే ఈ యాగం చేస్తున్నారని కథనాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా అంటే పెద్దగా తేడా లేదు. మొదటిది అధికారం శాశ్వతంగా ఉండటానికి .. రెండోది విజయ కాంక్షతో చేసేదని పండితులు చెబుతున్నారు.
‘సూయం’ అంటే శాశ్వతం… రాజ్యాన్ని, రాజునిశాశ్వతంగా ఉండేలా చేసేది కనుకే రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యూగం చేస్తే శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహాసించలేడని అంటారు.
పూర్వ కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారు. విజయాలు సాధించేవారు. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారం పదిలపరచుకునేందుకు ఆ చక్రవర్తి రాజశ్యామల యాగం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసిన దాఖలాలు లేవు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమకాలంలో అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించి దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలయ్యేలా చేశారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహిస్తారు కేసీఆర్.
దైవదర్శనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ దాదాపు దర్శించుకున్నారు. కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని 2019 ఎన్నికల ముందు వివిధ పార్టీల నేతలు కూడా యాగాలు చేయించారు. అయితే అవేవి వారికి సత్పలితాలను ఇవ్వలేదు.