Biggest Dam……………………………………………………………
చైనా ఆ మధ్య నిర్మించిన ” త్రీ గోర్జెస్ ” ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఈ డ్యామ్ పొడవు 1.3 మైళ్ళు .. 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రిజర్వాయర్ యాంగ్జీ నది పరీవాహక ప్రాంతంలో వరద నీటిని నియంత్రిస్తుంది. విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ డ్యామ్ నిర్మాణానికి 59 బిలియన్ డాలర్లు వెచ్చించారు. 15 సంవత్సరాల కాలంలో నిర్మించారు. ఇది గ్రేట్ వాల్ తర్వాత చైనా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్.. 1953 నుంచే ఈ ప్రాజెక్టు ను నిర్మించాలని చైనా నేతలు కలలు కన్నారు. అలాంటి ఈ ప్రాజెక్టు ఇటీవల వార్తల్లో కెక్కింది.
ఈ డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణ వేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు.అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటే …. వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు.
త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావం పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.త్రీగార్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల్లో కదలికలు కూడా ఏర్పడ్డాయని చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ డ్యామ్ ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు.
కాగా 1979 లో డెంగ్ జియావోపింగ్ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి అధిక విద్యుత్తును ఉత్పత్తి చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. కొత్త నాయకుడి ఆమోదంతో త్రీ గోర్జెస్ ఆనకట్ట నిర్మాణం మొదలు పెట్టారు. ఈ డ్యామ్ కారణంగా కొన్ని పట్టణాలు కూడా మునిగిపోయాయి. ఫలితంగా 1.3 మిలియన్ల మంది పౌరులు ఇబ్బంది పడ్డారు. పునరావాస ప్రక్రియ చేపట్టారు. నష్ట పోయిన అందరికి భూములు ఇచ్చారు. ఈ భూముల్లో ఉత్పాదకత తక్కువ గా ఉందనే నిరసనలు కూడా వ్యక్తమైనాయి.