sk.zakeer..………………………………………
Need to rethink…………………. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) పంథా సరైనదేనా? భారత కాల మాన పరిస్థితులకు తగినట్టుగా ఆ పార్టీ తన పంథా మార్చుకోవలసిన అవసరం ఉన్నదా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా పని చేసిన ఆర్కే అనారోగ్యంతో మరణించడం ఒక విషాదం.”1947 ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి అధికార మార్పిడి మాత్రమే జరిగింది.దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు.
భారత దేశం వెనకబడిన అర్థవలస, అర్థఫ్యూడల్ దేశమే” అని 1970లో జరిగిన తొలి పార్టీ మహాసభలో రాజకీయ తీర్మానాన్ని చారు మజుందార్ ప్రవేశపెట్టారు.అంతేగాక,బూర్జువా పార్లమెంటరీ ఎన్నికల పంథాను CPIML పార్టీ తిరస్కరించింది.”మూడో ప్రపంచయుద్ధం వస్తుంది.దేశంలో 1975 కల్లా విప్లవం విజయవంతమవుతుంద”ని చారుమజుందార్ తన డాక్యుమెంట్ లో విశ్వాసం ప్రకటించాడు.నక్సల్బరీ విప్లవోద్యమాన్ని “వసంత మేఘ గర్జనగా నాటి సోషలిస్టు చైనా అభివర్ణించింది. తన నైతిక మద్దతు, అంతర్జాతీయ సంఘీ భావాన్ని తెలియజేసింది.
కానీ వాస్తవంగా ఏమి జరుగుతున్నది? ఏమి జరగవలసి ఉన్నది? ”కేవలం అడవులకు మాత్రమే మనం ఎందుకు పరిమితమయ్యామో ఆలోచించుకోవాలి” మావోయిస్టు పార్టీ సిద్దాంత కర్తలలో ఒకరైన కోబాడ్ గాంధీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.నిజమే! ఆయన మాటలను మావోయిస్టు పార్టీ నాయకులు తీవ్రంగా ఆలోచించవలసిందే.ఆత్మ విమర్శ చేసుకోవలసిందే. ఒక నాడు ప్రపంచ విప్లవ కేంద్రంగా ఉన్న చైనా నేడు సామ్రాజ్యవాద దేశంగా మారిపోయింది.ప్రజల్ని దోపిడీ చేయడంలో ఇతర సామ్రాజ్యవాద దేశాలతో పాటు చైనా కూడా పోటీ పడుతోంది.రష్యా, చైనాలలో విప్లవం విజయవంతమైన తీరు భిన్నమైనది.
లెనిన్, స్టాలిన్ నాయకత్వంలో 1917 అక్టోబర్ 25న సోషలిస్టు విప్లవం జయప్రదమైంది. రష్యాలో పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విప్లవం విస్తరించింది. చైనాలో ఇందుకు పూర్తిగా రివర్స్. మావో నాయకత్వంలో 1949 అక్టోబర్ 1న నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైంది. ముందుగా గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసి తర్వాత పట్టణాలను విముక్తి చేశాడు మావో. ఆ రెండు దేశాలలో విప్లవాలు సాయుధ పోరాటం ద్వారానే విజయవంతం కావడం గమనించవలసిన విషయం.
అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థలున్న వ్యవసాయక దేశాల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించగలమన్నది మావో చెప్పిన సూత్రం. మార్కిస్టు-లెనినిస్టు సిద్ధాంతానికి మావో ఆలోచనా విధానాన్ని జోడించినప్పుడే మావోయిజంగా మారింది. భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ద్వారా జరిగే విప్లవాన్ని “నూతన ప్రజాస్వామిక విప్లవం అంటున్నాం. చైనాలో అప్పట్లో నెలకొన్న నిర్దిష్ట పరిస్థితులు భారతదేశంలో కూడా ఉన్నందున సిపిఐ(ఎం-ఎల్) నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని చేపట్టింది.
నక్సల్బరీ విప్లవోద్యమ నిర్మాత, మార్క్సిస్టు -లెనినిస్టు పార్టీ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ చారుమజుందార్ 1972 జులై 28న మరణించారు. చారు మజుందార్ నిర్దేశించిన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి, ఆయన చూపించిన మార్గంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నది. విప్లవోద్యమాన్ని జయప్రదం చేయడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నది.
1969 ఏప్రిల్ 22న (లెనిన్ శత జయంతి ) చారు మజుందార్ ప్రధాన కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు-లెనినిస్టు) ఏర్పడింది.తరువాత కాలంలో సిపిఐ(ఎం-ఎల్), సి.ఓ.సి, సిపిఐ(ఎం-ఎల్) పీపుల్స్‌వార్, ప్రస్తుతం సిపిఐ(మావోయిస్టు)గా 2004 లో పేరు మార్చుకున్నది.దక్షిణ భారతదేశంలో పట్టున్న పీపుల్స్‌వార్, ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ), మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమయ్యాయి. 1993లో పీపుల్స్‌వార్ కార్యదర్శి పదవి నుంచి కొండపల్లి సీతారామయ్య వైదొలిగిన అనంతరం ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకు కార్యదర్శిగా కొనసాగారు..
Pl. read it also …………………మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ? (2)