ఆ హీరో మరణం మిస్టరీయేనా ?

Sharing is Caring...

Brucelee’s death was a tragedy …………………..

‘ఎంటర్ ది డ్రాగన్’  సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు.1973, జులై  26 న ఆ సినిమా విడుదలైంది. సినిమా హీరో బ్రూస్ లీ ఒక్క సారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు. తాను కోరుకున్న అంతర్జాతీయ స్టార్‌డమ్‌ని సాధించాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రూస్ లీ దాన్ని తెలుసుకుని… ఎంజాయ్ చేయడానికి ఆరోజు నాటికే జీవించి లేడు. అంతకన్నా విషాదం ఇంకేముంటుంది?

సరిగ్గా సినిమా విడుదలకు 6 రోజుల ముందు జూలై 20 న హాంగ్ కాంగ్‌లో బ్రూస్ లీ అకస్మాత్తుగా మరణించాడు. అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు… మరణించే నాటికి అతని వయసు 32 సంవత్సరాలు మాత్రమే. మరికొన్నాళ్లు బతికి ఉన్నట్లయితే మరి కొన్ని అద్భుత చిత్రాల్లో నటించేవాడేమో.

మార్షల్ ఆర్ట్స్ ను హైలైట్ చేస్తూ తీసిన ‘ఎంటర్ ది డ్రాగన్’  ప్రపంచం మొత్తం మీద $200 మిలియన్ల కంటే ఎక్కువగా వసూలు చేసిన చిత్రంగా అప్పట్లోనే చరిత్ర కెక్కింది. ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను నిర్మించింది.

ఇక బ్రూస్ లీ గురించి చెప్పుకోవాలంటే ..1940  నవంబర్ 27 న  శాన్ ఫ్రాన్సిస్కోలో అతను జన్మించాడు. చైనీస్ ఒపెరా స్టార్ అయిన అతని తండ్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు లీ పుట్టాడు.లీ కుటుంబం 1941లో తిరిగి హాంకాంగ్‌కు తరలి వెళ్లింది. చిన్న వయసు నుంచే బ్రూస్ లీ కి నటన పట్ల ఆసక్తి ఉండేది. దాదాపు 20 చైనీస్ చిత్రాలలో నటించిన బాలనటుడి గా పేరు సంపాదించాడు. డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నాడు.

యుక్త వయసులోనే గుంగ్ ఫూ (కుంగ్ ఫూ అని కూడా పిలుస్తారు) ను వింగ్ చున్ శైలిలో శిక్షణ పొందాడు. ఇప్ మన్ బ్రూస్ లీ గురువు. ఎన్నో పోరాటాల్లో కూడా తన సత్తా చాటుకున్నాడు. బ్రూస్ లీ 1959 లో అమెరికా తిరిగి వచ్చాడు. సీటెల్‌లో మార్షల్ ఆర్ట్స్ పాఠశాలను ప్రారంభించాడు. 1964లో బ్రూస్ లీ  లిండా ఎమెరీ ని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరికీ 1965లో బ్రాండన్ లీ అనే కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత ఒక కుమార్తె కూడా పుట్టారు. 

తర్వాత బ్రూస్ లీ లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చాడు. అక్కడికెళ్ళాక  బ్రూస్ లీ టెలివిజన్ ప్రోగ్రామ్ ‘ది గ్రీన్ హార్నెట్‌’లో నటించాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని కరాటే టోర్నమెంట్‌లలో కూడా పాల్గొన్నాడు.

అలా జీవనం సాగిస్తూనే నటుడు స్టీవ్ మెక్‌క్వీన్‌తో సహా ప్రైవేట్ క్లయింట్‌లకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చాడు. అక్కడే కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. హాలీవుడ్ లో కంటే మెరుగైన పాత్రల కోసం బ్రూస్లీ  1970  ప్రారంభంలో హాంకాంగ్‌కు తిరిగి వచ్చాడు. 

అపుడే ‘ది బిగ్ బాస్’ (1971)’ది వే ఆఫ్ ది డ్రాగన్’ (1972) అనే యాక్షన్  చిత్రాల్లో నటించాడు. అనూహ్యమైన గుర్తింపు రావడంతో  ఆసియాలోనే  సక్సెస్ ఫుల్ స్టార్‌ స్థాయికి ఎదిగాడు. ఆ సమయంలోనే వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ లో నటించాడు. ఈ సినిమా షూటింగ్ చేసేటపుడు ఎన్నోసార్లు గాయాలపాలయ్యాడు. ఒకసారి పాము కూడా కాటేసింది.

అన్నింటి నుంచి కోలుకుని సినిమా విడుదలకు ముందు అకస్మాత్తుగా మరణించాడు. గాయాలు తగిలినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉపయోగించిన క్రమంలో రియాక్షన్స్ వచ్చి.. ఫలితంగా బ్రెయిన్ ఎడెమా తో మరణించాడని అంటారు.తలనొప్పి తగ్గడానికి తీసుకున్నపెయిన్‌కిల్లర్ కారణంగా కోమాలోకి జారుకుని, తర్వాత మరణించారని అంటారు.  

తర్వాత కాలంలో స్పానిష్ వైద్య నిపుణులు బ్రూస్లీ మరణం అతని రక్తంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల సంభవించిందని చెప్పారు. బ్రూస్లీని చైనీస్ గ్యాంగ్‌స్టర్లు హత్య చేశారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పటికి బ్రూస్లీ మరణం మిస్టరీ గానే మిగిలి పోయింది.

మరో విషాదం ఏమిటంటే …బ్రూస్ లీ 28 ఏళ్ల కుమారుడు బ్రాండన్ 1993 లో మార్చి31 న ‘ది క్రో’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. తండ్రి బ్రూస్ లీ సమాధి పక్కనే బ్రాండన్ భౌతిక దేహాన్ని ఖననం చేశారు.’

బ్రూస్ లీ కుమార్తె షానన్ కూడా మార్షల్ ఆర్టిస్ట్, నటిగా మారింది. బ్రూస్ లీ ఫౌండేషన్ కి ఆమె అధ్యక్షురాలు. ‘ఎంటర్ ది డ్రాగన్’  సినిమా గురించి మరో సారి చెప్పుకుందాం. 

—–KNM  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!