పెద్ద విమానాలను, భారీ నౌకలను మాయం చేస్తున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ నిజంగా వీడిందా ? ఈ మిస్టరీ పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి పలు కారణాలున్నాయని ఆ మధ్య శాస్త్రవేత్తలు,పరిశోధకులు వివరించారు. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 లక్షల చ.కి.మీ. మేర విస్తరించిన ఈ ప్రాంతంలోకి ఓడలు వెళ్లగానే వాటి జాడ తెలియకుండా పోయిన వైనం గురించి మనం ఎన్నో వార్తలు విన్నాం.
ఆ ప్రాంతం మీదుగా ఎగిరే విమానాలు కూడా మాయమైనట్టు ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. చివరికి అదొక అంతు చిక్కని రహస్యంగా మిగిలిన సంగతి తెలిసిందే.ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసారు. ఈ మిస్టరీ వీడిందని 2016లో కొన్ని కథనాలు ప్రచారంలోకొచ్చాయి. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని పరిశోధకులు తేల్చిచెప్పినట్టు వార్తలు వచ్చాయి. గంటకు 170 మైళ్ల వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ తరహాలో విరుచుకుపడుతున్న కారణంగా నౌకలు, విమానాలు మాయమై పోతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్టు వాతావరణ పరిశోధకులు అప్పట్లో వివరించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి షడ్బుజాకార మేఘాలు ఏర్పడతాయని కూడా చెప్పారు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఇప్పటి వరకూ కనీసం 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతు అయ్యాయి . గత వందేళ్లలో కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేశారు.
అలాగే అంతకుముందు ఆ ప్రాంతంలో అగ్ని బిలాలు ఉన్నాయని .. ఏలియన్లే అటుగా వెళ్తోన్న నౌకలు, విమానాలను మాయం చేస్తున్నాయని ప్రచారం కూడా జరిగింది. సముద్ర మధ్యంలో పిరమిడ్లు ఉన్నాయని .. అందుకే అలా జరుగుతుందని.. ఆ ప్రాంతంలో భూమాకర్షణ శక్తి తక్కువని … ఆ కారణంగా ఇలా జరుగుతుందని.. పలు అభిప్రాయాలు ప్రచారంలో కొచ్చాయి.ఇక 2018 లో ప్రముఖ రీసెర్చర్ డాక్టర్ సిమన్ బాక్సల్ రాక్షస అలలే అందుకు కారణమని చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి.
ఈ రాక్షస అలలకు రోగ్ వేవ్స్ అని పేరు కూడా పెట్టారు. మామూలుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒక దానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. వీటికి తోడు సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లు కూడా కారణమని తేల్చి చెప్పారు. అసలు సముద్ర వాతావరణమే భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఏ తుఫాన్ చుట్టుముడుతుందో ఎవరికి తెలీదు. ఇందులో మిస్టరీ ఏమి లేదు. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్‌లో ఇన్ని ఓడలు .. విమానాలు మునిగాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వాదన లో కొంత ఔచిత్యం ఉంది అంటే అంతకు ముందు జరిగినవన్నీ కేవలం ప్రచారాలనే అర్ధం చేసుకోవాలి కదా. ముందు ముందు ఇంకా ఏ వివరణలు వస్తాయో చూద్దాం.
———– K.N.MURTHY