అర్గొసీ 1960 లలో అమెరికాలో వెలువడిన ఒక వారపత్రిక. ఇది కాలక్షేపం బఠానీల పత్రిక.మసాలా బాగా దట్టించి రిలీజ్ చేసే వారు.పాఠకులకు ఉపయోగపడే సంగతులకన్నా సంచలనాత్మక విషయాలు … కథనాలు .. అభూత కల్పనలతో కథలు, ఇతర విశేషాలతో వండి వడ్డించే వినోద పత్రిక. తెలుగులో ఇలాంటి పత్రికలెన్నో వచ్చి పోయాయి.
ఈ అర్గోసీ కూడా ఆ దేశంలో అలాంటి పత్రికే. కేవలం సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం మసాలా కథనాలు ప్రచురించేది. అర్గొసీ (Argosy) లో ప్రచురితమయ్యే వార్తల్లో వాసి నాస్తి, వదంతులు జాస్తి. బస్టాండుల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ కొని చదివి అవతల పారేసే ‘టైం పాస్’ తరహా వీక్లీ గా ఈ పత్రిక కు పేరుంది.
ఇక కాలక్షేపం బఠానీలు వండి వార్చటంలో పెన్ను తిరిగిన అదే చేయి తిరిగిన విన్సెంట్ గాడిస్ (Vincent Gaddis) అనే రచయిత 1964 ఫిబ్రవరిలో అర్గొసీ కోసం ఒక కవర్ స్టోరీ రాశాడు. ‘ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్’ పేరుతో వచ్చిన ఆ కథనంలో ఆచూకీ తెలియకుండా పోయిన ఐదు అవెంజర్ విమానాల ఘటన గురించి రాసాడు.
ఇందులో కొన్ని ఊహాజనిత సంఘటనలు జోడించి అద్భుతమయిన మసాలా వంటకం తయారు చేసి జనంపై వదిలాడు..ఫ్లోరిడా రాష్ట్ర తీరం, బెర్ముడా దీవి, ప్యూర్టో రికో దీవుల మధ్యనుండే అట్లాంటిక్ సముద్ర ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరును ఈ విన్సెంట్ గాడిస్ మొదటగా వాడుకలోకి తెచ్చాడు.
ఆ విషయంలో అతనికే క్రెడిట్స్ ఇవ్వొచ్చు. బెర్ముడా ప్రాంతంలో అతీంద్రియ శక్తులేవో ఉన్నాయని, వాటి ధాటికి అటు నుండి వెళ్లే నౌకలూ విమానాలూ ఊహించని రీతిలో అదృశ్యమవుతున్నాయని రాసిన ఈ కాల్పనిక గాధ అద్భుతంగా పండింది. చదివిన ప్రతి ఒక్కరు ఇది నిజమేననుకున్నారు.ఇక్కడే బెర్ముడా మిస్టరీ కి బీజాలు పడ్డాయి.
వేసిన వాడు విన్సెంట్ గాడిస్. ఈ మిస్టరీ పై తన కథనాలు అన్ని సూపర్ హిట్ కావడంతో విన్సెంట్ గాడిస్ ఆ తర్వాత ఇదే కథని మరింత డెవలప్ చేసి ‘ఇన్విజిబుల్ హొరైజన్స్’ పేరుతో ఓ పుస్తకమే రాసి పారేసి బ్రహ్మాండంగా సొమ్ముచేసుకున్నాడు. దీంతో మరింతమంది రచయితలు బెర్ముడా ట్రయాంగిల్ ఇతివృత్తంతో ఎడాపెడా కథలు, కాకరగాయలు వండి జనంలోకి తీసుకెళ్లారు.
ఒక్కో రచయితా బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఒక్కో విధంగా రాసేశారు. పదేళ్లు గడిచేసరికి ప్రపంచమంతా బెర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీగా మారిపోయింది. ఇంతకీ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వెనుక ఏముంది? అసలక్కడ మిస్టరీయే లేదు.అంటే, అక్కడ నౌకలు, విమానాలు మాయమైపోవటంలో నిజం లేదా?అవెంజర్ విమానాలని మినహాయిస్తే అక్కడ మాయమయిన విమానాలు ఏవీ లేవు. అవెంజర్లు కూడా మానవ తప్పిదం వల్ల కూలిపోయాయనేది అమెరికన్ నౌకాదళం నివేదిక చెప్పేనిజం. పైగా అవి బెర్ముడా ట్రయాంగిల్ వల్ల మాయమైనాయి అనేందుకు ఆధారాల్లేవు.
ఇక నౌకల మాయం విషయానికొస్తే, ఆ ప్రాంతంలో గల్లంతైన నౌకలు ఎన్నో ఉన్నాయి. కానీ, మిగతా సముద్ర ప్రాంతాల్లో ఏ కారణాలతో నౌకలు గల్లంతయ్యాయో అవే కారణాలు: తుఫానులు, మానవ తప్పిదాలు, భీకరమైన అలలు, వగైరా. బెర్ముడా ప్రాంతంలో విరివిగా వచ్చే హరికేన్ల తాకిడికి మునిగిపోయిన నౌకలే వీటిలో ఎక్కువ.
మొత్తమ్మీద ఇక్కడ జరిగినవిగా ప్రచారంలో ఉన్న దుర్ఘటనల్లో మసిపూసిన మారేడుకాయలే ఎక్కువ. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అంతా కట్టుకథే అని ప్రచారంలో ఉన్న కథనమిది. మరి పరిశోధకులు ఏమంటున్నారు ? మరో కథనంలో చదువుదాం.
Pl.Read it also………………………………… ‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ ముడి వీడినట్టేనా ?
——–-K.N.MURTHY