Srinivasa Krishna Patil……………………………
శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి.ఆయన వినతుడు అనే చిన్నపాటి కొండను పోలి, మేఘగర్జన వంటి కంఠస్వరం కలిగిన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా తిరిగిరావలసింది అని ఆజ్ఞాపించాడు.
సరే అని వారు ఆ దిశగా వెళ్లారు. కాని సీతమ్మను కనుగొనలేక తిరిగివచ్చేశారు. అంతమాత్రాన వారు రామద్రోహులు కారు.అదే సమయంలో తనకు స్వయంగా మామగారైన శతవలి అనే వానరవీరుడిని సుగ్రీవుడు మరొక లక్ష మంది వానరులతో సహా ఉత్తరదిశగా పంపించాడు. ఆయన కూడా సీతమ్మ జాడను తెలుసుకొనలేక తిరిగి వచ్చాడు. అయినా కూడా వారిని ఎవరూ రామద్రోహులు అని అనలేదు.
అదే సమయంలో తారాదేవికి తండ్రి, అంగదునికి తాతగారు అయిన సుషేణుడు అనే మరొక మహావానరవీరుడిని, మరీచిమహర్షి పుత్రుడైన మారీచుడనే మహాతేజస్వి అయిన వానరుడిని రెండులక్షల వానరులతో పడమటిగా పంపాడు. వారు కూడా సీతమ్మ ఎక్కడుందో కనిపెట్టలేక తిరిగివచ్చారు. అయినప్పటికీ వారిని రామద్రోహులు అని నిందించలేదు.
అదే సమయంలో అగ్నిపుత్రుడైన నీలుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు, బ్రహ్మపుత్రుడైన జాంబవంతుడు, తారాపుత్రుడైన అంగదుడు మొదలైనవారిని అసంఖ్యాకవానరవీరులతో పాటు దక్షిణదిశగా పంపించాడు. వారు నెల రోజులు గడువు ముగిసినప్పటికీ తిరిగిరాలేదు. అయినప్పటికీ వారు రామద్రోహులంటూ ఎవరూ నోరు పారేసుకోలేదు.
అయితే నెల రోజుల గడువు గడచిపోయినప్పటికీ సీతమ్మ జాడను తెలిసికొనలేక వెనుదిరిగిపోతే సుగ్రీవుడు తనను దండిస్తాడని అంగదుడు భయపడి, నేను ఇక రాముని సన్నిధికి రాను, కావాలంటే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అంటూ మాట్లాడాడు. అయినా అతడిని ఎవరూ రామద్రోహి అనలేదు.సరే, తరువాత సీతమ్మవారు రావణాసురుని లంకలో ఉన్నారనే సమాచారం తెలుసుకున్నారు.
లంకకు వెళ్లాలంటే నూరు యోజనాల సముద్రాన్ని దాటి వెళ్లాలి. ఎవరు వెళ్లగలరు? చిన్నవానరులు ఎవరూ మాట్లాడలేదు. దానికి అర్థం వారికి రామకార్యం చేయడం ఇష్టం లేదని కాదు.గజుడు నేను పది యోజనాలు మాత్రమే దాటగలను. నూరు యోజనాల సముద్రం దాటడం నావల్ల కాదు అన్నాడు. దానికి అర్థం గజునికి రామకార్యం చేయాలనే ఉత్సాహం లేనట్లు కాదు. గవాక్షుడు నేను ఇరవై యోజనాలు మాత్రమే దాటగలను అన్నాడు.
గవయుడు నేను ముప్పై యోజనాలు మాత్రమే దాటగలను అన్నాడు. శరభుడు తాను నలబై యోజనాలు మాత్రమే దాటగలను అన్నాడు. గంధమాదనుడు నేను యాబై యోజనాలు మాత్రమే దాటగలను అన్నాడు. మైందుడు అరవై యోజనాలు అన్నాడు. ద్వివిదుడు డెబ్బై యోజనాలు అన్నాడు. సుషేణుడు ఎనబై యోజనాలు అన్నాడు. చివరకు జాంబవంతుడంతటి మహాత్ముడే తన శక్తి తొంబై యోజనాలు అన్నాడు.
అంగదుడు నేను నూరూ యోజనాలు దాటగలను, కాని మళ్లీ వెనుదిరిగి నూరు యోజనాలు రాగలనో లేనో అని సందేహం వ్యక్తం చేశాడు. వీరి మాటలకు అర్థం, వీరిలో ఎవ్వరికీ రామకార్యం చేయాలనే కుతూహలం లేదని కాదు. అసలు హనుమంతుడైతే అందరి మాటలూ వింటూ మౌనంగా ఉండిపోయాడు. అంటే అతడు రామకార్యం చేసేందుకు విముఖుడైనట్టు కాదు.సరే, జాంబవంతుడు హనుమంతునికి అతని స్వశక్తిని వివరించి చెప్పిన మీదట హనుమంతుడు సముద్రం దాటేందుకు బయలుదేరాడు.
ఆ తరువాత ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుదిరగలేదు.దారిలో ఎన్నెన్నో ఆటంకాలు ఎదురైనాయి. ఆటంకాలు కల్పించినవారిలో మైనాకుడు మిత్రుడైతే, సురస అతని దీక్షాశక్తులను పరీక్షించిన దేవదూత, సింహిక సహజక్రూరశక్తి. హనుమంతుడు ప్రేమతోను, ఓరిమితోను, యుక్తితోను, శక్తితోను ఆ ఆటంకాలను దాటి లంకకు చేరుకున్నాడు. అది, రామకార్యాన్ని చేపట్టిన తరువాత ఉండవలసిన ఏకాగ్రత, లక్ష్యైకదృష్టి.లంకకు చేరుకున్న తరువాత కూడా లంకాధిదేవత అడ్టుకుంది. బలంతో ఆమెను జయించాడు.
ఎంత వెదకినా సీతమ్మ జాడ కనబడకపోయేసరికి ఒకానొకసమయంలో తీవ్రమైన నిరాశానిఃస్పృహలకు లోనయ్యాడు. అయినప్పటికీ, జీవన్ భద్రాణి పశ్యతి (బ్రతికియుండిన శుభములు బడయవచ్చు) అని భావించి నిరాశను వదలి, మరల ఉత్సాహంతో పని ప్రారంభించి చివరకు సీతమ్మవారిని కనిపెట్టాడు.సీతమ్మతో మాట్లాడి, ఆమెకు రామసందేశాన్ని వినిపించాడు. రాముడు వస్తాడనే ఆశను ఆమెకు కల్పించి, జీవితంపై ఆమెకు కలిగిన విరక్తిని పోగొట్టాడు.
సీతమ్మ రావణాసురుని లంకలో ఉన్నది అని మాత్రం చెప్పి ఊరుకుంటే ఎలా, ఆ రావణాసురుని బలం ఎంత అని రాముడు అడిగితే నాకు తెలియదు అని ఎలా చెప్పగలను? అందువల్ల రావణాసురుడి బలమేమిటో కాస్త పరీక్షించి వెళ్లాలి అని భావించి, అశోకవనవిధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన రాక్షసులను మట్టుపెట్టాడు. రావణాసురుడికి చెందినప్రముఖవీరులతో పోట్లాడి గెలిచిన తరువాత హనుమంతుడికి అతడి బలం మీద ఒక అంచనా వచ్చేసింది.
రాముడు తప్పక గెలుస్తాడని నమ్మకం వచ్చేసింది.అయినప్పటికీ రావణాసురుడితో కాస్త మంచీచెడ్డా మాట్లాడి, సీతమ్మవారిని తిరిగి రామునికి ఇప్పిస్తే యుద్ధం తప్పుతుందని, ఉభయపక్షాలకు (వానరరాక్షసులకు) శ్రేయస్సు కలుగుతుందని అని భావించాడు. కాని, రావణాసురుడు తనకు దర్శనం ఇచ్చేందుకు ఎందుకు అంగీకరిస్తాడు? అందువల్ల ఇంద్రజిత్తు తనమీద ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి దానికి పట్టుబడ్డాడు.
అప్పుడు వెంటనే రావణదర్శనం దొరికింది. రావణునికి హితబోధ చేశాడు గాని, అది అతడి చెవికి తప్ప మనస్సుకు ఎక్కింది కాదు. పైగా హనుమంతుని తోకను కాల్చమని ఆజ్ఞ ఇచ్చాడు. హనుమంతుడు యుక్తిగా తప్పించుకుని ఏకంగా లంకనే కాల్చివేసి, రావణాసురగర్వభంగం చేసి, సీతమ్మ మాత్రం క్షేమంగా ఉండటం చూసి, ఆమెకు నమస్కరించి, తిరిగి రాముని చెంతకు తన సహచరులతో సహా చేరుకుని సీతమ్మవారి సమాచారాన్ని తెలియజేశాడు.
ఆ తరువాత రాముడేమి చేశాడో అందరకూ తెలుసు.అదీ రామకార్యదీక్షితుడు చేయవలసిన పని. అంతేగాని, వాళ్లేమన్నారు, వీళ్లేమన్నారు. ఆయన నాతో వస్తాడా లేదా, ఆయన నాపై అలుగుతాడేమో, ఈయన నాతో మాట్లాడడేమో, వీడు కూడా సుగ్రీవుడు పంపితే నాతో వచ్చినవాడే కదా, సముద్రాన్ని నేను మాత్రమే దాటాలా? వీడికి ఆ బాధ్యత లేదా? వాడికి అంత నిర్లక్ష్యం ఏమిటి?
వీడికి రాముడంటే భక్తి లేదు. వాడికి రామునికంటె శాస్త్రమే ఎక్కువా? మొత్తం పని నేనొక్కడినే చేయాలా? నేను మాత్రమే కష్టపడి మొత్తం చేస్తే పేరు బహుమతులు మాత్రం వీరందరూ పంచుకుంటున్నారే? ఈ విషయమై నేను రచ్చ చేయాలి.ఆ విషయంపై గొడవ చేయాలి.- ఇలాంటి పిచ్చి ఆలోచనలు, ఈర్ష్యాసూయలు, చిన్నబుద్ధులు ఇసుమంతైనా లేని మహాత్ముడు హనుమంతుడు.అటువంటి హనుమంతుడే మనకు ఈసమయంలోను, ఏ సమయంలోను, సర్వదా సర్వాత్మనా ఆదర్శవీరుడు.