Is that asteroid dangerous? …………………..
డిసెంబర్ 22, 2032 న ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలున్నాయని కొద్దీ రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది..దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గతంలో కూడా గ్రహ శకలాలు, ఉల్కలు భూమిపై పడిన దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా సంభవించాయి.
ఇక భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం మామూలుది కాదని ముందు నాసా చెప్పింది. ఈ గ్రహశకలానికి ‘ఆస్టరాయిడ్ 2024 YR 4’ అని పేరు పెట్టింది. తొలుత ‘ఆస్టరాయిడ్ 2024 YR 4’ భూమిని ఢీ కొట్టడానికి అవకాశాలు చాలావరకు ఉన్నాయంటూ నాసా తేల్చి చెప్పింది.
తాజాగా తన అంచనాలను తగ్గించింది. ఇపుడు దాని ప్రభావ సంభావ్యతను కేవలం 0.004%కి నవీకరించింది.అంతకు ముందు భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయని నాసా చెప్పింది. అంతకంటే ముందు నాసా వెలువరించిన అంచనాల శాతం 2.6 మాత్రమే.
కాగా ‘2024 YR4 ‘గ్రహశకలం 40 నుండి 90 మీటర్లు (130 నుండి 300 అడుగులు) వెడల్పు ఉంటుందని అంచనా. దీనిని ఒక పెద్ద భవనం పరిమాణంతో పోల్చవచ్చు. 2024 YR 4 గ్రహశకలం భూమికి దగ్గరగా కక్ష్యలో తిరుగుతోంది. దీనిని డిసెంబర్ 27, 2024న చిలీలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు.
మొదటిసారి కనుగొన్నప్పుడు, డిసెంబర్ 22, 2032న భూమిని ఢీకొనే అవకాశం తక్కువగా ఉంది. తర్వాత కొంత పెరిగింది. ఆ గ్రహశకలం కదలికలను పరిశీలిస్తున్న క్రమంలో 2032 లేదా అంతకు ముందు భూమిని ఢీకొనే అవకాశం లేదని నాసా తేల్చింది. ఆ గ్రహశకలం టొరినో రేటింగ్ 0కి తగ్గించింది. ఇది భూమిని ఢీకొనే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశీలనలు చెబుతున్నాయి.
ఒకవేళ ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే, అది స్థానిక ప్రాంతానికి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. ఇది రాతి పదార్థంతో తయారైంది, అంటే అది భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే చిన్న ముక్కలుగా విరిగిపోవచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మైనర్ ప్లానెట్ సెంటర్కు ఈ గ్రహశకలం కదలికల తాలూకు పరిశీలనలు ఎప్పటికపుడు అందుతున్నాయి. NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL’s) సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిపుణులు ఆ గ్రహశకలం కదలికలను నిత్యం గమనిస్తున్నారు. పరిశీలనల అంచనాలు ఎప్పటికపుడు వెలువరిస్తున్నారు. ఇప్పటివరకైతే ప్రమాద సూచనలు లేనట్టే. ముందు ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.