చాలా కాలం నుంచి హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. దాదాపు పదేళ్ల నుంచి అడపాదడపా అవే కథనాలను తిప్పించి మళ్లించి మీడియా రాస్తోంది. ఈ మధ్య వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం తో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కథనాలు మళ్ళీ మొదలైనాయి. ఆ ఇంటర్వ్యూ లోనే కొడాలి నాని కొన్ని ఫీలర్లు వదిలారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కుటుంబం చేతుల్లోనే ఉంటే కొత్త పార్టీ పెట్టె అవకాశం ఉందన్నట్టుగా చెప్పారు. ఇదే అసలు కీలకమైన పాయింట్.
ఒక పార్టీ పెట్టడం అంటే మాటలు కాదు. దాన్ని నడపడం .. కార్యకర్తలను .. కార్యాలయాలను నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు. ఆర్ధికంగా సత్తా ఉండాలి. కోట్ల రూపాయలు ఉంటేనే ఇవాళ రాజకీయాలు సాధ్యం. అయినప్పటికీ అధికారంలోకి వచ్చే విషయంలో గ్యారంటీ లేదు. ఎన్నికల్లో గెలుపు అంటే కేవలం హీరో చరిష్మా ఒకటే చాలదు. ఎన్నికలనాటి పరిస్థితులు , వ్యూహాలు , బలమైన అభ్యర్థులు , కులపరమైన మద్దతు , వాగ్దానాలు , ప్రచారం, గట్టి క్యాడర్ తదితర అంశాల్లో దూసుకుపోవాలి. ఇప్పటి ఓటర్లు ఒకప్పటిలా లేరు.
రాజకీయ పార్టీలను పెట్టిన సినీ నటులను తీసుకుంటే 80వ దశకంలో ఎన్టీరామారావు కు ఓ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విముఖత తో ఉన్నారు. అప్పట్లో ఇతర అన్ని అంశాలు కలిసొచ్చి ఎన్టీఆర్ గద్దె నెక్కారు. తర్వాత ఆయనకు కూడా ఒకదశలో ఓటమి తప్పలేదు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా 1999లో చంద్రబాబుతో విబేధించి “అన్న తెలుగుదేశం ” పేరిట పార్టీ స్థాపించాడు. ఆ పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చేరారు. హరి చైతన్య రధం వేసుకుని రాష్ట్రమంతా తిరిగారు. వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చారు. చంద్రబాబును ఎన్నికల సభల్లో తూర్పారా పట్టారు. జనం హరి సభలకు పెద్ద ఎత్తున వచ్చారు. 191 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. హరికృష్ణ స్వయంగా గుడివాడలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా రాలేదు. ఎన్టీఆర్ కే కాదు హరికృష్ణ కు కూడా గుడివాడ సొంత నియోజకవర్గం. అప్పట్లో కొడాలి నాని పార్టీ కార్యకర్తగా పనిచేశారు. కానీ ఓటర్లు ఎన్టీఆర్ కొడుకు అని కూడా చూడకుండా ఓడించారు. తర్వాత పార్టీ మూసేసి మళ్ళీ చంద్రబాబు వద్దకు వెళ్లి తెలుగుదేశంలో చేరాడు. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో 180 సీట్లతో అధికారంలోకొచ్చింది.
ఇక ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యంపార్టీ పెట్టారు. 2009 నుంచి రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ కి బాగా తెలుసు. అప్పట్లో ఎన్టీఆర్ మహాకూటమి కి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ సంగతి కూడా ఎన్టీఆర్ కి తెలియంది కాదు. పదేళ్లు అధికారం లో లేకపోయినా టీడీపీని నడిపిన ఖ్యాతి చంద్రబాబుది. జగన్ కూడా పార్టీ పెట్టి అధికారం లేకపోయినా పదేళ్లు నడిపారు. 2014లో అధికారం అందలేదని ఆయన రాజకీయాలు వదిలిపెట్టలేదు.
ఇందరి అనుభవాలు చూసాక ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టే సాహసం చేస్తారా ? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి. ఇక తెలుగు దేశం పార్టీ చంద్రబాబు, లోకేష్ బాబు చేతుల్లోనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అవసరమైతే బాబు కోడలు బ్రాహ్మణి ని రంగం లోకి దించవచ్చు. ఇక బాబు పిలిస్తే ఎన్టీఆర్ ఆ పార్టీ లోకి వెళ్తారా ? ప్రచారం చేస్తారా ? చేయరా ? అనేవి ఊహజనిత అంశాలు. అప్పటి పరిస్థితులను బట్టి తారక్ నిర్ణయించుకోవచ్చు.
ఈ రోజు వరకు ఎన్టీఆర్ తన మనసులో మాట బయటికి చెప్పలేదు. నిజంగా తారక్ రాజకీయాల్లోకి వస్తానంటే సలహాలు ఇవ్వడానికి బోలెడు మంది ఉన్నారు.
అయినా తారక్ కి ఇంకా చాలా భవిష్యత్ ఉంది. ఇపుడాయన వయసు 37 ఏళ్ళే . 30 సినిమాలు కూడా చేయలేదు. మరో పది, పదిహేనేళ్ళు సినిమాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవచ్చు. తారక్ మనసులో కూడా అదే ఉండొచ్చు.
———- KNMURTHY