సంజయ్ గాంధీ మరణం కూడా మిస్టరీయేనా ?

Sharing is Caring...

Things do not come out……………

చిన్నవయసులో మరణించిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. 33 సంవత్సరాల వయసులో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ మరణం పట్ల అప్పట్లో ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు.

ఎవరైనా కుట్ర చేశారా ? ఎందుకు చేశారు ? కారణాలేమిటి అనేది ఎవరికి తెలీదు. గాలి కబుర్లు అయితే చాలా ప్రచారంలో ఉన్నాయి. 1980 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఇందిరా గాంధీ మళ్ళీ ప్రధాని అయ్యారు. సమీప భవిష్యత్తులో సంజయ్ కాంగ్రెస్ సారధి అయి .. ఆ తర్వాత సింహాసనం ఆదిష్టిస్తారని అప్పట్లో చెప్పుకునే వారు.

రాజీవ్ మాదిరి సంజయ్ సహనశీలి కాదు. ఆయనకు దూకుడు ఎక్కువ. ఎమర్జెన్సీలో ఆయన దూకుడే 1977 ఎన్నికల్లో పార్టీ పతనానికి దారి తీసింది. కానీ ఇందిరాగాంధీకి ఆ దూకుడే బాగా నచ్చేది అని చెబుతారు. జూన్ 23, 1980న న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయానికి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ తలకు గాయాలై  మరణించారు.

ఆయన ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన కొత్త విమానాన్నినడుపుతూ ఏరోబాటిక్ విన్యాసాలు చేస్తుండగా అది అదుపు తప్పి కూలిపోయింది. సంజయ్‌కు పైలట్‌గా అంతగా అనుభవం లేదు కానీ డేర్‌డెవిల్‌ అంతే. ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు. సంజయ్ తో పాటు అందులో ఉన్న  ట్రైనర్ సక్సేనా కూడా ప్రమాదంలో మరణించాడు. అంతకు ముందు రోజు కూడా మేనకా గాంధీ తో ఒక విమానంలో రైడింగ్ కి వెళ్ళాడు. ఆయన విన్యాసాలు చూసి మేనకా భయపడింది. ఇంటికి వచ్చిన వెంటనే ఇందిరకు చెప్పింది. అయితే ఆ ఇద్దరూ అంత సీరియస్ గా తీసుకోలేదని అంటారు.

మరణించే నాటికి సంజయ్ వయసు 33 ఏళ్ళు మాత్రమే. అప్పటికే సంజయ్ కి  పెళ్లయింది. మేనకాగాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వారికి ఒక కుమారుడు. ఆయనే వరుణ్ గాంధీ. ప్రస్తుతం మేనకా , వరుణ్ గాంధీ లు బీజేపీ లో ఉన్నారు.  కుమారుని మరణం గురించి విన్నపుడు ఇందిరా గాంధీ షాక్ తిన్నారు. ఆమెను సన్నిహితులు ఓదార్చారు. ఆమె హుటాహుటిన విమానం కూలిన ప్రదేశానికి వెళ్లారు. సంజయ్ కీ రింగ్ .. చేతి గడియారం కోసం  వాకబు చేసారు. అవేవీ దొరక లేదని అంటారు. వాటిలో ఏదో రహస్య సమాచారం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. 

కాగా కాక్‌పిట్‌లో ఉన్నపుడు కొల్హాపురి చప్పల్స్ కాకుండా సరైన బూట్లు ధరించాలని రాజీవ్ గాంధీ సంజయ్ కి  అనేక సందర్భాలలో చెప్పినట్టు కూడా కథనాలు వచ్చాయి. సంజయ్ రాజీవ్ సలహాను పట్టించుకోలేదు అంటారు. ప్రమాదం జరిగిన రోజు సంజయ్ కుర్తా-పైజామా వేసుకుని కొల్హాపురి చప్పల్స్ తో  S-2A విమానంలోకి ఎక్కారని అంటారు.

ప్రమాదం లో ఛిద్రమైన సంజయ్ శరీరాన్ని కుట్టడానికి ఎనిమిది మంది సర్జన్లకు నాలుగు గంటల సమయం పట్టిందని చెబుతారు. సంజయ్ గాంధీ పై అంతకు ముందు కూడా హత్యాయత్నాలు జరిగాయని .. ఆ విషయాలు రహస్యంగా ఉంచారని చెబుతారు. సంజయ్ మరణం తర్వాత ఇందిర మానసికంగా దెబ్బతిన్నారు. మళ్ళీ మునుపటి మనిషి కాలేకపోయారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!