An unsolved death mystery…………………
టీనేజ్ స్టార్ గా ఆమె వేలాది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. 19 ఏళ్ళ ప్రాయంలోనే స్టార్ డమ్ అందుకుని విజయపధంలోపయనిస్తుండగా మృత్యువు ఆమెను పొట్టన బెట్టుకుంది. పై ఫోటో చూడగానే ఆమె ఎవరో ఈపాటికి గుర్తించే ఉంటారు. ఇక పేరు చెప్పనవసరం లేదనుకుంటా.
ఆమె మరణానికి కారణం ఏమిటి ? నిజంగా ప్రమాదవశాత్తు చనిపోయిందా ? కావాలనే పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా ? మరెవరైనా వెనుకనుంచి తోశారా ?తనకు తెలీకుండానే మద్యం మత్తులో పై నుంచి పడిపోయిందా ? మాఫియా వేధింపులు తట్టుకోలేక చనిపోయిందా ?అసలు ఏం జరిగింది ? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.
ఇప్పటికి దివ్యభారతి చనిపోయి 31 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికి ఆమె మృతి తేలని మిస్టరీగానే మిగిలిపోయింది. వ్యక్తిగతంగా ఆమె కు తెలిసినవారు చెప్పేది దివ్యకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని. మరయితే ఆమె మరణం ?? అది మాత్రం సస్పెన్సే.
ఆమె చనిపోయిన రోజు రాత్రి ఏంజరిగింది?
అప్పటికే దివ్యభారతికి పెళ్లయింది.కాలేదని కూడా కొందరు అంటారు. నిర్మాత సాజిద్ నదియాడ్ వాలా తో కలసి అంధేరి ప్రాంతంలో ఒక అపార్టుమెంట్లో ఉంటోంది. అంతకు ముందు రెండురోజుల క్రితం తల్లిదండ్రుల కోసం తన డబ్బుతో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.
ఆరోజు తాను ఇంట్లో ఉండగా ప్రముఖ డిజైనర్ నీతా , ఆమె భర్త శ్యామ్ వచ్చారు. వారంతా డ్రెస్సులు , డిజైన్లు గురించి మాట్లాడుతూనే మద్యం సేవించారు. ఇంట్లో ఉండే పనిమనిషి అమృత అన్ని సమకూర్చింది. ఆమె నమ్మకమైన మనిషే అంటారు. వారితో మాట్లాడుతూనే దివ్య బాల్కనీ లోకి వెళ్ళింది. కాసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. దాంతో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లి చూసారు.
అపార్ట్మెంట్ కింద రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దీ సేపట్లలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 1993 ఏప్రిల్ 5 న ఈ ఘటన జరిగింది. దివ్య బాడీలో ఆల్కహాల్ ద్రవాలు ఉన్నట్టు పోస్ట్ మార్టం లో తేలింది. దివ్య మరణంపై నీతా, శ్యాం లు ఏం మాట్లాడలేదు. సాజిద్ కూడా ఏమి చెప్పలేకపోయాడు.
ఇక పని మనిషి దివ్య మరణాన్ని తట్టుకోలేక నెలరోజుల తర్వాత గుండె ఆగి చనిపోయింది. సాజిద్ కావాలని భార్యను హత్య చేయించాడని కథనాలు కూడా వెలువడ్డాయి. పని మనిషి పై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దేనికి రుజువులు దొరకలేదు.
అయితే దివ్య తండ్రి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లోని బాల్కనీలకు గ్రిల్స్ ఉన్నాయి. కేవలం దివ్య ఫ్లాట్ బాల్కనీకే గ్రిల్ లేదు. అలాగే ఆ బాల్కనీ కింద కారు పార్కింగ్ ఉండేది. దివ్య చనిపోయిన రోజునే పార్కింగ్ లేదు. దాంతో 5వ ఫ్లోర్ నుంచి కిందపడిన దివ్య బాడీ నేరుగా నేలను బలంగా తాకింది. వెంటనే ఆమె ప్రాణాలు పోయాయి.
అయితే ఆ దిశగా విచారణ చేశారో లేదో తెలీదు. కాగా దివ్య తండ్రి ” దివ్యకు సాజిద్ కు అసలు పెళ్ళికాలేదని .. మరో 3నెలల్లో చేసుకుంటారని పోలీసులకు చెప్పినట్టు ఒక కథనం ప్రచారంలో ఉంది. అలాగే సాజిద్ దివ్య బాడీని చూసేందుకు ఆసుపత్రికి వచ్చినపుడు నురగ కక్కుకుని పడిపోయాడని కూడా అంటారు.
ఇంకా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి దివ్యభారతి మృతదేహానికి అంత్యక్రియలు ఎలా చేయాలనే అంశంపై కూడా గొడవలు జరిగాయట. సాజిద్ తో పెళ్లి తర్వాత ఆమె ముస్లిం మతం స్వీకరించిందట. దీనికి రుజువులు లేకపోవడంతో చివరికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
దివ్యభారతి మరణం పై పలు కథనాలు వెలువడ్డాయి వీటిలో ఏది వాస్తవమో కాదో తెలీదు. పోలీసులు ఈకథనాలను పరిశీలించారో లేదో తెలీదు. సాజిద్ ప్రవర్తన పై అయితే అనుమానాలు వ్యక్తమైనాయి. మొత్తం మీద ఐదేళ్లు విచారణ కొనసాగింది. పోలీసులు ఎలాంటి క్లూస్ సంపాదించలేకపోయారు.
కేసు క్లోజ్ చేసారు. ఒక అందాల నటి జీవితం విషాదకరంగా అలా ముగిసింది. ఆ సంఘటన తల్చుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. అభిమానులకైతే మనసు మెలి తిరుగుతుంది. జరిగిన ఘటన వెనుక మరేదో కోణం ఉంది . ఏదో జరిగింది అనే సందేహాలు ఎవరికైనా వస్తాయి కానీ వాటన్నింటికి సాక్ష్యాలు రుజువులు లేవు. కాగా దివ్య భారతి అనుమానాస్పద మృతి పై ‘ ఛార్జ్ షీట్’ పేరుతో హిందీలో ఒక సినిమాకూడా తీశారు.
——————- KNMURTHY