జో బైడెన్ భారత్ కి అనుకూలమేనా ?

Sharing is Caring...

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్‌ భారత్‌ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానాలనే బైడెన్ కొనసాగిస్తారా? లేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుడతారా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ఇప్పటికైతే బైడెన్ వ్యవహారశైలి తెలిసినవారు చెప్పేదాని ప్రకారం బైడెన్‌ భారత్‌ కు అనుకూలంగానే ఉండవచ్చు. ట్రంప్ తరహాలో తెంపరి తనంతో బైడెన్ నిర్ణయాలు తీసుకోరు కాబట్టి భారత్ తో సంబంధాలు బాగానే ఉండొచ్చు అంటున్నారు. ఇప్పటివరకు ట్రంప్‌ ప్రధాని మోదీల మధ్య సుహృద్భావ సంబంధాలే ఉన్నాయి . అదే తీరున ముందు ముందు కూడా బైడెన్ తో మోదీ సంబంధాలు కొనసాగవచ్చు . ప్రభుత్వాలు అధినేతలు ఎవరున్నప్పటికీ భారత్ అమెరికా సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయి. ట్రంప్ లాగా బైడెన్ బెదిరింపు ధోరణితో మాట్లాడే రకం కాదు.దుడుకు స్వబావం కాదు. కాబట్టి ఆయన హయాంలో విదేశీ సంబంధాలు మెరుగుపడవచ్చు.

ట్రంప్‌ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో భారత్ … అమెరికా ల మధ్య ఇమిగ్రేషన్‌, వాణిజ్య అంశాల్లో తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో సంబంధాలు మెరుగైన స్థాయిలో ఉన్నాయి . ఇప్పుడు కూడా విధానపరమైన మార్పు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు..గత ఇరవయ్యేళ్లుగా బైడెన్‌ భారత్‌ అనుకూల వైఖరిని ప్రదర్శించారనడంలో సందేహం లేదు.భారత్‌పై అణుపరీక్షల అనంతరం విధించిన ఆంక్షలను ఎత్తేయాలని 2001లో సెనెట్‌ విదేశాంగ కమిటీ చైర్మన్‌ హోదాలో నాడు బుష్‌ ప్రభుత్వానికి బైడెన్ సూచించన సంగతిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే 2008లో భారత్‌-అమెరికా అణు ఒప్పందం సెనెట్‌ ఆమోదం పొందే విషయంలోబైడెన్ కీలకపాత్ర పోషించారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే అమెరికాకు భారత్‌ కీలక, ప్రధాన రక్షణరంగ భాగస్వామిగా మారింది. ఆ హోదా కల్పించినదీ ఆయనే. ఇక భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని బైడెన్ వాదిస్తూనే ఉన్నారు. అవన్నీ బైడెన్ భారత్ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని చెప్పడానికి ఉదాహరణలే. కాకపోతే భారత్ కూడా అదే స్థాయిలో సంబంధాలను నిర్వహించాలి.

బైడెన్ చైనా కు అనుకూలంగా ఉండొచ్చు అన్న ఊహాగానాలను నమ్మి వెంటనే ఒక స్థిర అభిప్రాయానికి రాలేం. ఏదైనా కొద్దీ రోజులు జరిగితే గానీ బైడెన్ వ్యవహారశైలి ఏమిటో బయట పడదు. ఇప్పటికైతే బైడెన్ ఇండియా పట్ల సానుకూల దృక్పధంతోనే ఉన్నారని అంటున్నారు.ట్రంప్‌ తెచ్చిన ఇమిగ్రేషన్‌ విధానాల్ని రద్దు చేస్తానని బైడెన్‌ ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించడం పెద్ద ఊరట. ఇమిగ్రెంట్లయిన తలిదండ్రులకు జన్మించిన కమలా హారిస్‌ కూడా ఈ విషయంలో భారత అనుకూలతనే ప్రదర్శిస్తూ వచ్చినందున భారత టెకీలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక బైడెన్ ఉదార వలస విధానం మూలంగా 5 లక్షలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశాలున్నాయి. జోబైడెన్‌ ఎన్నికల్లో జారీ చేసిన విధాన పత్రం ప్రకారం.. ఏటా కనీసం 95 వేల మంది శరణార్ధులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తారు. ‘కుటుంబ ఆధారిత వలస విధానానికి బైడెన్‌ మద్దతు ఉంటుంది. ఈ దిశగా వలస సంస్కరణల కోసం చట్టం రూపొందించి, కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేయించేందుకు బైడెన్‌ కృషి చేస్తారని భావించవచ్చు. దీనివల్ల 5 లక్షల మంది భారతీయులు సహా 1.1 కోట్ల మందికి పౌరసత్వం లభిస్తుంది’ అని విధాన పత్రం లో స్పష్టంగా ఉంది. అత్యంత నిపుణులైన వారికి ఇచ్చే వర్క్‌ వీసాల సంఖ్యను పెంచేందుకు కొత్త అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారని కూడ ప్రచారం జరుగుతోంది. హెచ్‌1బీ వీసాల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేసే యోచనలో బైడెన్‌ ఉన్నట్టు కూడా చెబుతున్నారు.

ఇక బైడెన్ ”రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక విధానాల్లో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరే అనుసరించొచ్చు. చైనా విషయంలో బారత్ కు బైడెన్ మద్దతు ఉంటుందా ? ఆయన వైఖరి ఎలా ఉండొచ్చు అనేదాన్ని ఇప్పుడే చెప్పలేం.లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్ ప్రాంతాల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు చెక్‌ పెట్టడానికి ప్రయత్నిస్తున్న భారత్‌కు స్నేహ హస్తం అందించేందుకు ట్రంప్‌ హయాంలో అమెరికా ముందుకొచ్చింది. వాణిజ్య ఘర్షణలు, కొవిడ్‌కు కారణమయ్యారన్న అభిప్రాయాలు, ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ ఆధిపత్య ధోరణి.. మొదలైన వాటితో చైనా పట్ల ద్వేషం పెంచుకున్న ట్రంప్‌.. భారత్‌కు సన్నిహితమయ్యారు .అత్యున్నత సాంకేతిక, అంతరిక్ష సమాచారాన్ని పరస్పరం అందజేసుకునేందుకు అంగీకరించారు. బైడెన్ ఇదే శైలిని అనుసరిస్తూ పెద్దన్నగా వ్యవహరిస్తూ చైనా –భారత్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా చూడొచ్చు. అదే సమయంలో చైనాతో వాణిజ్య వ్యవహారాల్లో సానుకూలంగా ఉండొచ్చు. .ట్రంప్ లాగా ఒకరికే మద్దతు అన్నతీరులా కాకుండా పెద్దన్నలా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు.

కాగా ప్రభుత్వాధి నేతలుగా ఎవరు ఉన్నప్పటికీ భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు అద్భుతంగా ఏమీలేవు . కొన్ని వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి . భారత మార్కెట్లో కి సులభతర ప్రవేశాన్ని అమెరికా కోరుతోంది. ఈ అంశంపై చర్చలు జరగవచ్చు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!