హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందని నేపాల్, చైనా దేశాలే ప్రకటించాయి.
ఇటీవల కాలంలో చేసిన సర్వే ప్రకారం ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు కాగా 1954లో భారత్ సర్వే చేసిన నాటి కంటే స్వల్పంగా 86 సెంటీమీటర్లు పెరిగింది. నేపాల్‌లో 2015లో, అంతకుముందు వచ్చిన భూకంపాల తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిపోయి ఉంటుందని ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ శిఖరాన్ని కొలిచేందుకు నేపాల్ పూనుకుంది.
దీనికోసం చైనా సాయం తీసుకుంది. ఆ మేరకు రెండు దేశాలమధ్య ఒప్పందం కూడా కుదిరింది. అలా ఏడాది పాటు రెండు దేశాల ప్రభుత్వ సిబ్బంది చాలా కష్ట పడి సర్వే నిర్వహించారు. ఆ సర్వే లో ఎవరెస్ట్ ఎత్తు పెరిగిన సంగతి గమనించారు . ఆలా పెరిగిన ఎత్తును రెండు దేశాలు కలసి ప్రకటించాయి.
దాదాపు 66 ఏళ్ల క్రితం భారత సర్వే ఆఫ్ ఇండియా సంస్థ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా నిర్ధారించింది. నేపాల్, చైనా చేసిన ప్రకటనలో ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లుగా తేలింది. అంటే అప్పటి కొలతలతో పోలిస్తే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు స్వల్పంగా పెరిగింది.
ఎవరెస్ట్ పర్వతం నేపాల్ లోని హిమాలయాల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ బ్రాడ్ వాష్ బర్న్ , ఆయన టీం సభ్యులు చేసిన సర్వే లో ఎవరెస్ట్ ప్రతియేటా 2 అంగుళాలు చొప్పున పెరుగుతుందని చెప్పారు.
కాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి.ఇప్పటి వరకు హిమాలయ పర్వతాలు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తున్నాం. అయితే అది తప్పని… 139 నుంచి 144 లక్షల సంవత్సరాల కిందటే హిమాలయాలు పుట్టాయని పరిశోధనల్లో తేలింది.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు ఇప్పటిలాగా ఉండేవి కావు. అవన్నీ కలిసి దగ్గర దగ్గరగా ఒకేచోట ఉండేవి. అయితే అవి నెమ్మదిగా దూరం జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయాయి.వాటినే గోండ్వానాలాండ్, లారాసియా అని అంటారు. మన భారత భూభాగం అప్పట్లో గోండ్వానా లాండ్‌లో ఓ చిన్న ముక్కలాగా ఉండేదని అంటారు.
ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ… ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొన్న ప్రదేశంలోనే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు భూఫలకాలు ఢీకొనటం ఇంకా ఆగిపోలేదట.
భారత భూఫలకం ఉత్తరదిశ గా ఏడాదికి 67 మిల్లీమీటర్ల వంతున కదులుతూనే ఉందట. అందుకనే హిమాలయాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతూనే ఉన్నాయంటారు. కాబట్టి పర్వతాల ఎత్తు పెరుగుదల సహజమేనని భావించాలి.
———-KNM