Govardhan Gande ……………………………………..
phone hacking …………………..హ్యాకింగ్/నిఘా ..ఏమిటి? ఎందుకు? ఎవరు? లక్ష్యం ఏమిటి?సాధారణంగా దేశాలు వాటి రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం,శత్రువులపై పెడతారు. పొరుగు/శత్రు దేశాల మిలటరీ కార్యక్రమాలు , గూఢచర్యాన్ని, కుట్రలను పసిగట్టి దేశాన్ని,తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా చాలా దేశాలు నిఘా పెడుతూ ఉంటాయి. ఇవన్నీ దేశం వెలుపల,దేశం కోసం జరిగేవి.
సీఐఏ, కేజీబీ, రా లాంటి నిఘా వ్యవస్థలు నిత్యం చేసే పని ఇదే.వాటి ఏర్పాటు లక్ష్యమే అది. కానీ ఇందుకు భిన్నంగా కూడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటాయి.అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వేసి వారి కార్యకలాపాలను తెలుసుకొని తమ అధికారానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి కూడా జరుగుతుంటాయి. గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
వెలుపలికి రావు కానీ అన్ని (చాలా) ఆధునిక ప్రభుత్వాలు చాలా వరకు చేస్తున్న పనే ఇదే మరి. ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారం బయట పడిన తరువాత మన దేశం లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయిన సంగతి కూడా మనకు తెలుసు కదా. సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందిన తరువాత నిఘా కోసం అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.వీటిని తయారు చేసే సంస్థల్లో అగ్రగామిగా ఎన్ఎస్ఓ/ పెగాసన్/ఇజ్రాయెల్ పేరొందింది. ఈ పరికరాలను 45 దేశాలు కొనుగోలు చేశాయి. ఈ సంస్థ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే తమ నిఘా ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఇది విశ్వసించిన చాలా దేశాలు ఈ పరికరాలను కొనుగోలు చేశాయి.
ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు విక్రయించబోనని బహిరంగంగా అనేక మార్లు ప్రకటించింది. అయితే ఇండియాలో కీలకమైన 300 మంది (ప్రపంచ వ్యాప్తంగా 50 వేల మంది) VVIP,VIP ల ఫోన్లు,కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ఓ విశ్వసనీయ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై ప్రముఖ వెబ్ సైట్ The Wire ఓ కథనాన్ని ప్రచురించింది.హ్యాక్ అయిన వారిలో రాహుల్ గాంధీ, పీకే గా ప్రచారం పొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఓ ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి,కీలక ప్రతిపక్ష నేతలు,హిందుస్థాన్ టైమ్స్,ది హిందూ, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, నెట్‌వర్క్18 సహా పలు వార్తా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులపై నిఘా ఉన్నట్టు సమాచారం. ఇంకా హక్కుల కార్యకర్తలు, వారి సంబంధీకులు ఉన్నారట.
ఇక ఇప్పటి ఐటీ శాఖ మంత్రి కూడా హ్యాకింగ్ కు గురైన వారిలో ఉండడం విచిత్రం. ప్రస్తుత ఐటీ చట్టం ప్రకారం హ్యాకింగ్ పెద్ద నేరం.ప్రైవేటు వారికి ఈ పరికరాలను విక్రయించనని పెగాసన్ చెప్పేసింది. ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తానని ప్రకటించింది. ఇది నిజమే అనుకుంటే అయితే ప్రైవేటు సంస్థలు,వ్యక్తుల వద్ద ఇలా హ్యాక్ చేసే పరికరాలు ఉండే అవకాశం లేదు కదా. ఆ పరికరాలు లేనప్పుడు నిఘాకు అవకాశమే లేదు కదా. అంటే ప్రభుత్వం వద్ద మాత్రమే ఈ నిఘా పరికారాలు ఉంటాయి అని కదా అర్ధం.అంటే ప్రభుత్వానికి మాత్రమే ఇలాంటి అవకాశం ఉందనుకోవాలి కదా. హ్యాక్ అయిన వారి వివరాల్లో ఎక్కువగా ప్రతిపక్షాలకు చెందిన వారివి, రాజ్యాంగ సంస్థల్లో ఉన్న కొందరు పెద్దలవి. ఈ హ్యాకింగ్ అవకాశం,అవసరం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉన్నట్లు అర్ధమవుతున్నది కదా.
మరొకరికి అవకాశమే లేనపుడు,హ్యాకింగ్ పరికరాలు మరొకరి వద్ద ఉండే అవకాశమే లేనపుడు ఆ పని చేసింది ప్రభుత్వమే అని అనుమానించడం సహజమే కదా.అంటే ఈ లెక్కన ప్రభుత్వమే ఐటీ చట్టం ప్రకారం నేరం చేసిందని భావించాలి కదా.
చట్ట విరుద్ధమైన ఇలాంటి నిఘా ఇండియాలో అసాధ్యమని ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ లోకసభలో వాదించారు. ఈయన ఫోన్ కూడా హ్యాక్ అయిన జాబితాలో ఉన్నది.వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఈ అంశంపై ఓ కథనాన్ని ప్రచురించింది. మొత్తం మీద ఈ ఫోన్ టాపింగ్ సంచనం సృష్టిస్తోంది.