Is America rethinking?………………..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా ? దౌత్యమార్గం ఎంచుకుని అయిదు రోజుల విరామం ప్రకటించారా ?అంటే కొంత మేరకు అవుననే చెప్పుకోవచ్చు. ట్రంప్ దౌత్య మార్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం ప్రపంచ దేశాల నేతల ఒత్తిడి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన తీవ్రమైన ఆర్థిక, భద్రతా పరిస్థితులు కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
రష్యా వంటి దేశాలు ఈ సంక్షోభానికి “రాజకీయ, దౌత్యపరమైన” పరిష్కారం కనుగొనాలని సూటిగా పిలుపు నిచ్చాయి. ఐరోపా మిత్రదేశాలు, మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాలు కూడా దాడులను నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగాన్ని కోరాయి.
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడం వల్ల ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీనివల్ల 1970ల నాటి చమురు సంక్షోభం వంటి పరిస్థితి వస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) హెచ్చరించింది. ఈ ఆర్థిక నష్టాన్ని తగ్గించడం ట్రంప్ ప్రధాన ఉద్దేశ్యం కావచ్చు.
చైనాకు మధ్యప్రాచ్యం నుండి అందే చమురు సరఫరాకు ముప్పు కలగకుండా ఉండాలని, వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా, ఒకవేళ తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు,ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలపై ప్రతిదాడి చేస్తామని హెచ్చరించింది.
యుద్ధం వల్ల కలిగే భారీ ఆర్థిక నష్టాలను, చమురు ధరల పెరుగుదలను అరికట్టడానికి, మిత్రదేశాల విజ్ఞప్తులను గౌరవిస్తూ ట్రంప్ ఈ ఐదు రోజుల విరామం ప్రకటించారు.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గాయి.
ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వెంటనే, బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర 11% నుండి 15% వరకు పడిపోయింది. ఒకానొక దశలో బ్యారెల్ ధర $114-$119 వద్ద ఉండగా, ట్రంప్ మాటల తర్వాత అది $100 కంటే తక్కువకు ($96-$97 పరిధిలోకి) చేరుకుంది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలు,ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపేయడం వల్ల,చమురు సరఫరాకు తక్షణమే ఎటువంటి ముప్పు ఉండదనే నమ్మకం మార్కెట్లో ఏర్పడింది. చమురు ధరలు తగ్గడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.
అయితే, అమెరికాతో తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసింది. చమురు ధరలను తగ్గించడానికి .. యుద్ధ తంత్రాల కోసం సమయం పొందడానికే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఇరాన్ మీడియా ఆరోపించింది.
ఇదంతా కేవలం సమయాన్ని వృథా చేయడానికి, చమురు ధరలను తగ్గించడానికి ట్రంప్ ఆడుతున్న నాటకమని ఇరాన్ అంటోంది. మొత్తానికి, ట్రంప్ ప్రకటించిన “ఐదు రోజుల విరామం” ప్రపంచ ఇంధన మార్కెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ట్రంప్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు..దాడులకు కొంత గ్యాప్ ఇచ్చాడు.ఈ ఐదు రోజుల సమయం ఒక సంధి లాంటిది. చర్చలు సానుకూలంగా కొనసాగితే, పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇదొక మంచి పరిణామమే అటు ఇరాన్ ఇటు అమెరికా కొంత తగ్గి రాజీ దిశగా అడుగులు వేయడం మంచిది.

