Arunachala has many names……………………..
అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త లు నిర్ధారించినట్టు పెద్దలు చెబుతారు.
ఇంతటి పరమ పవిత్రమైన అరుణాచలాన్ని సందర్శిస్తే రుణాలు తీరతాయని పెద్దలు అంటారు. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం అని అర్ధం..
కార్తీక పౌర్ణమి రోజు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. భగవాన్ రమణమహర్షి అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని పలు మార్లు శిష్యులకు వివరించారు.
ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ,వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, పాపకర్మలు మొత్తం పటా పంచలవుతాయని భక్తుల నమ్మకం.
ఎవరైనా మరణించి నరకానికి వెళ్తే … వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా ? అని యమధర్మరాజు ముందుగా ప్రశ్నిస్తాడట.
ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఉన్నట్లయితే .. వారి జీవితాన్నిగిరి ప్రదక్షిణకు ముందు, గిరి ప్రదక్షిణ తర్వాత అని విభజించి చూస్తారట. గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపాలను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో రాసినట్టు చెబుతారు. పౌర్ణమి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారు. వెన్నెలలో రాత్రివేళ గిరి ప్రదక్షిణ ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది.
53 ఏళ్ళ పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న రమణ మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణ మహర్షి ఒక శతకాన్ని రచించారు. ‘అరుణాచల అష్టకం’ ద్వారా గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను పుస్తకంలో ఆవిష్కరించారు.చిన్నతనంలోనే అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది.అక్కడే ఆయన చాలాకాలం తపస్సు చేశారు.
ఇక అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా కార్తీక జ్యోతిని దర్శించు కోవడం అత్యంత పుణ్యప్రదం. ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు అరుణాచలం చేరుకుంటారు. గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ ‘అరుణాచలం’ అనే పదాన్ని కూడా తలవలేమని.. అలాగే ఆ క్షేత్రంలో కాలు పెట్టలేమని అంటారు. ఈ అరుణ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవి . ఈ కొండపై ఉన్న మట్టిలో .. చుట్టూ ఉన్న వృక్షాలలో అనేక ఔషధీ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. అక్కడ గాలి పీలిస్తే చాలు .. ఎన్నో రోగాలు తగ్గుతాయని అంటారు.