‘సుందర్‌ సౌరాష్ట్ర’ సందర్శన కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజ్ !

Sharing is Caring...

Sundar Saurashtra’ visit! ………………………………..

గుజరాత్‌ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశాన్ని  IRCTC   కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ ని IRCTC ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో  తీసుకొచ్చింది.

హైదరాబాద్‌ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ టూర్‌ కొనసాగుతుంది. సికింద్రాబాద్‌తో పాటు గుల్బర్గా, కళ్యాణ్‌, పుణె, సోలాపుర్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

అక్టోబరు 18 నుంచి మీ ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. రైలు ప్రయాణం ఇలా సాగుతుంది. 
సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరుతుంది.రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు.

కాసేపు సేద తీరాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. మూడో రోజు లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని వీక్షించి అహ్మదాబాద్ బయల్దేరుతారు. అక్కడ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.

నాలుగో రోజు సబర్మతీ ఆశ్రమాన్ని చూసి రాజ్‌కోట్‌కి పయనమవుతారు. మధ్యాహ్నం రాజ్‌కోట్ చేరుకోగానే హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రాత్రి రాజ్‌కోట్‌లో బస ఉంటుంది. ఐదోరోజు ద్వారక పయనమవుతారు. మార్గం మధ్యలో సమయం ఉంటే జామ్‌నగర్‌ సందర్శనకు తీసుకెళ్తారు.

హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక  ద్వారకను సందర్శిస్తారు. ఆ రాత్రి ద్వారకలోనే రాత్రి బస ఉంటుంది.ఆరో రోజు ద్వారకాదీశ్‌ ఆలయాన్ని, సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకొని పోర్‌బందర్‌ చేరుకుంటారు.ఏడో రోజు అర్ధరాత్రి 00:50 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ లో తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతారు. ఎనిమిదో రోజు ఉదయం 8:20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో  టూర్‌ పూర్తవుతుంది.

యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.  ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది. నాలుగు రోజులు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
టూర్‌ ప్యాకేజీలో ఉండే సందర్శనా ప్రదేశాల రుసుముల బాధ్యత ఐఆర్‌సీటీసీదే.

రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి. బోటింగ్‌, గుర్రపు స్వారీకి యాత్రికులే రుసుము వెచ్చించాలి.టూర్‌ గైడ్‌ సదుపాయం ఉండదు.  ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC Tourism  వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!