Santaram. B …………………….
పత్రికాధిపతి రామోజీరావు వేరే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బహు అరుదు. తెలుగులో నాకు తెలిసి ఆయన వేరే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 1992 లో నేను రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నేను సుప్రభాతం మేగజైన్ లో ఇన్ ఛార్జి ఎడిటర్ గా ఉన్నాను.నేను 1983 నవంబర్ లో ఈనాడులో సబ్ ఎడిటర్ గా సెలెక్ట్ అయ్యాను. రాత పరీక్ష తర్వాత రామోజీరావు గారు స్వయంగా ఇంటర్యూ చేశారు.
ఆనాడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది.నన్ను ఇంటర్వూ చేసిన ఈ పెద్ద మనిషిని ఎప్పటికైనా ఇంటర్వ్యూ చేయాలని. ఒక సారి ఈనాడు లో పని చేసి వెళ్లిన వారికి సెక్యూరిటీలోనే చేదు అనుభవం ఎదురవుతుందని చెబుతారు. అపుడు సి . వనజ అనే డైనమిక్ రిపోర్టర్ సుప్రభాతం లో ఉండేది. నేను అడిగితే రామోజీరావు ఇంటర్వ్యూ ఇవ్వరేమో అనుకుని వనజ కు ఆ పని అప్పగించాను. ఆమె ఎంతో ఓర్పుతో కొన్ని రోజులు ప్రయత్నించి ఆయన ఇంటర్వ్యూకు అనుమతి సంపాదించారు.
ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సుప్రభాతం కోసం, వనజ కోసమే. ముందు పది ప్రశ్నలు ఇవ్వమన్నారు. ఉప ప్రశ్నలు ఉండ కూడదన్నారు. ఇంటర్వ్యూ సమయం ఆసన్నమైంది. మీరు కూడా వస్తే బాగుంటుందని వనజ గారు అడిగారు. నేను వస్తే ఆయన మాట్లాడడేమో అన్నాను. చివరికి నేను కూడా వెళ్లాను . నాటకీయ ఫక్కీలో లోపలికి దూరాను. వనజ ఒక్కరే వస్తారని ఆయన అభిప్రాయం కావచ్చు. రామోజీరావు అటెండర్ జబ్బార్ అనే వ్యక్తి ఉండేవాడు. నేను ఈనాడులో గతంలో పనిచేసినట్టు అతనికి తెలుసు.
రెండు మూడు సార్లు “సార్ పిలుస్తున్నారు’ అని చెప్పాడు. “సార్ పిలిచాడు అంటే జాబ్ పోయినట్టే ” అనుకునే వారు. కానీ అలా జరగలేదు. అయినా అదొక భయం ఉండేది. ఇంటర్వ్యూకి అపాయింట్ మెంట్ తీసుకున్నది వనజ అయినా నేను అనధికారికంగా లోపలికి వచ్చాను . జబ్బార్ రామోజీరావు కు చెవిలో చెప్పడం చూశాను. ఇతను ఇక్కడ పని చేసిన వాడని. అయినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. నన్ను బయటికి వెళ్లపోమని చెప్పలేదు. కానీ ఆయన వనజ అడిగే డైనమిక్ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.
ఈనాడు గ్రూపులో మహిళా జర్నలిస్టులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వరని అనుకుంటారు అని వనజ ప్రశ్నించారు. “అలా ఎందుకు అనుకుంటారు. శాంతారాం ఇక్కడే పని చేసి వెళ్ళాడు కదా, నీ పక్కనే ఉన్నాడు , ఆయనను అడుగు అన్నారు.నేను మౌనంగా ఉన్నాను. రామోజీకి అనుకూలంగా తల కూడా ఆడించలేదు.
ఇంటర్వ్యూ కొనసాగింది.రామోజీరావు గారు ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం అదే మొదటి సారి. బహుశా అదే చివరి సారి కావచ్చు. ఆ ఫోటో నావద్ద ఉందన్న విషయం ఈ మధ్య మా అమ్మాయి ఆల్బమ్ లు వెతుకుతుండగా బయటపడింది. ఆ సుప్రభాతం సంచిక కూడా నా వద్ద లేదు. అది కవర్ స్టోరీ. హెడింగ్ గుర్తు ఉంది.“నాడు విశాఖ వీచిక, నేడు పతాక శీర్షిక”
తర్వాత రామోజీ గారిని ఒక ప్రశ్న అడిగాను. మీరు ఎందుకు మీడియా రంగంలోకి వచ్చారని. ఆయన జవాబు ఇది ” మాది మధ్య తరగతి రైతు కుటుంబం. మాది పెద పారుపూడి (గుడివాడ దగ్గర). ఉన్నది మూడు ఎకరాల మాగాణి. అది అమ్ముకుని ఢిల్లీ వెళ్ళాను. నాకు ఎప్పుడు మా గ్రామం, మా పొలం గుర్తుకు వచ్చేది. వ్యవసాయంతో నా అనుబంధాన్ని లింక్ చేసుకోవాలని “అన్నదాత ” మాసపత్రికను పెట్టాను.
ఈ నాడు కంటే ముందు ఆ పత్రిక పెట్టాను , అది విజయవంత కావడంతో ఈనాడు ను మొదట విశాఖ పట్నంలో 1974 లో పెట్టాను ” అని చెప్పారు. మరోప్రశ్న … మీకు కమ్యూనిస్ట్ నేపధ్యం ఉందని అంటారు. కమ్యూనిస్ట్ పత్రికలు విశాలాంధ్ర, ప్రజాశక్తి,ఇంకా ఇతర వామపక్ష భావాలు గల పత్రికలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరుస్తున్న క్రమంలో మీరు కమర్షియల్ పంధాలో ఈనాడును ఎందుకు నడపాలనుకున్నారు.
జవాబు …. నేను కమ్యూనిస్ట్ భావాలను ఇప్పటికి గౌరవిస్తాను. కానీ దినపత్రిక అనేది అందరికి చేరాలి. వాళ్ళ పత్రికలు కొందరికే చేరేవి. ఆ పత్రికల్లో ప్రొఫెషనిజం తక్కువగా ఉండేది.
మరో ప్రశ్నకు జవాబుగా ……. ” ఎన్టీరామారావు గారికి ఈనాడు పూర్తి సహకారం అందించింది. ఆనాడు నామీద కులముద్ర పడింది. నేను మొదటినుంచి కాంగ్రెస్ కల్చర్ కి వ్యతిరేకిని. ఆనాడు నేనే కాదు అభ్యుదయ భావాలున్న వారంతా ఎన్టీఆర్ కి అండగా నిలిచారు. ఎన్టీఆర్ ఫోటోలు వేయడం వల్ల ఈనాడు సర్కులేషన్ పెరిగిందని అంటారు. అది ప్రజల నాడి గమనించి వేసామే తప్ప మా స్వార్ధ ప్రయోజనం లేదు.” అంటూ ఆయన ఇంటర్వ్యూ ముగించారు.