లౌక్యం చూపిన షర్మిల !

Sharing is Caring...

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తెలంగాణ వైస్సార్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల చాలా తెలివిగా జవాబులు చెప్పారు. ఆర్కే కొన్ని ప్రశ్నలు నేరుగాను .. మరికొన్ని డొంక తిరుగుడు గా వేసినప్పటికీ షర్మిల ఎంత వరకు చెప్పాలో అంతవరకే జవాబులు చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే షర్మిల బాగా ప్రిపేర్ అయివచ్చిందా అనిపిస్తుంది.

గతం లో ఆర్కే రాసిన కథనాలను నిజమని చెప్పే విధంగా షర్మిల జవాబులు ఉంటాయేమోనని చాలామంది ఆశపడ్డారు. ప్రశ్నలు వేసిన ఆర్కేతో సహా. కానీ అలాంటివేవీ షర్మిల జవాబుల్లో కానరాలేదు.ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేసిన విషయం తెలుసా అని ఆర్కే అడిగినపుడు .. జగన్ అలా చేయలేదని షర్మిల స్పష్టంగా చెప్పింది.

అలాగే మరో ప్రశ్నకు జవాబు చెబుతూ వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని .. అది కేసీఆర్ వేసిన ముద్ర అంటూ పొత్తు ఉన్నపుడు కేసీఆర్ ఎలా ఉన్నారో ?లేనపుడు ఎలాంటి ముద్ర వేస్తారో సోదాహరణంగా వివరించింది. తెలంగాణ రాజకీయ శూన్యత గురించి క్లారిటీ ఇచ్చింది.

మీ అన్న జగన్‌ తో  విభేదాలు తారస్థాయికి చేరి, మీరు ఇక్కడికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. వాస్తవమేనా? అని ఆర్కే అడిగినపుడు కూడా చాలా సంయమనంతో జవాబు చెప్పింది. నాకు… అన్నకు మధ్య వంద ఉండవచ్చు. వెయ్యి ఉండవచ్చు. అవి కూర్చొని పరిష్కరించుకోలేనివైతే కావు.

మరో ప్రశ్నకు సమాధానం గా మాట్లాడుతూ అయినా ఏకుటుంబంలో విభేదాలు లేవు ? మీకు లేవా ? అంటూ ఎదురు ప్రశ్న వేసింది. దీంతో ఆర్కే జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది.ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి రోజున ఎదురు పడ్డారు కానీ పలుక్కోలేదట కదా అన్న ప్రశ్న కు కూల్ గానే ఆన్సర్ ఇచ్చారు. “ప్రేయర్ లో ఎపుడు మాట్లాడుకోము. బ్రేక్ ఫాస్ట్ లో మాట్లాడుకున్నాం.”  

“అలాగే రాఖీ పండుగ  రోజు కూడా ఫోన్ చేసి మాట్లాడుకున్నాం.”అందామె. దాన్ని బట్టి బయటి ప్రచారం అంతా నిజం కాదు అని పరోక్షంగా షర్మిల తేల్చేసింది. ఇక కేవీపీ గురించి కూడా పెద్దగా మాట్లాడకుండా కట్ చేసింది. మొత్తం ఇంటర్వ్యూ లో కొత్త పాయింట్లు ఏమీ లేవు. జనాలందరికి తెలిసినవే. కొన్ని చొప్పదంటు ప్రశ్నలున్నాయి. భారీగా హైప్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ కి అంతర్జాలంలో స్పందన బాగానే ఉంది. ఆర్కే తాను ఆశించిన విధంగా జవాబులు రాకపోయే సరికి ..  ఒక దశలో” చాలా లౌక్యంగా సమాధానాలిస్తున్నావ్‌” అని కూడా వ్యాఖ్యానించారు. ఇదేమీ చెప్పుకోదగిన ఇంటర్వ్యూ ఏమీ కాదు. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!