Innovative campaign ………………
కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ వినూత్న ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.నియోజకవర్గంలో ఎక్కడా తన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా పోస్టర్లు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం కేవలం గోడలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చాందీ ఊమెన్ తన ప్రచారాన్ని పూర్తిగా పర్యావరణహితంగా (Eco-friendly) నిర్వహిస్తున్నారు.
అట్టహాసంగా జీపులు, కారులు వాడకుండా సింపుల్ గా నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్ (Electric Cycle)పై ప్రయాణిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. సైకిల్ పై అయితే ఇరుకైన సందుల్లోకి కూడా వెళ్లడానికి వీలవుతుందని, ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఎటువంటి భారీ కాన్వాయ్‌లు, శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లు లేకుండా నిశ్శబ్దంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఫ్లెక్స్ బోర్డులు, ప్రచార ఖర్చుల ద్వారా ఆదా అయిన డబ్బుతో నియోజకవర్గంలోని పేదలకు ఇళ్లు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తయ్యాయని, మరిన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఈ అంశం జనాల్లోకి బాగా వెళుతోంది. ఈ చాందీ ఊమెన్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు.
తన తండ్రి ఊమెన్ చాందీ 53 ఏళ్ల పాటు చేసిన సేవలను గుర్తు చేస్తూనే, తదుపరి స్థాయి అభివృద్ధి (క్రీడలు, పర్యాటకం వంటివి) తన లక్ష్యమని చెబుతున్నారు. పోస్టర్ల కంటే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు డిజిటల్ యాక్సెస్ ఉందని, అందుకే సోషల్ మీడియా, డిజిటల్ పద్ధతులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
చాందీ ఊమెన్”నో ఫ్లెక్స్ – నో లౌడ్ స్పీకర్” ప్రచార శైలి కేరళ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 2023 ఉప ఎన్నికల్లో ఆయన 37,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో చాందీ ఊమెన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా సిపిఐ(ఎం) తరపున కె.ఎస్. రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. గతంలో (2023 ఉప ఎన్నికల్లో) చాందీ ఊమెన్‌తో పోటీ పడిన జైక్ సి. థామస్‌కు బదులుగా ఈసారి సిపిఐ(ఎం) రాధాకృష్ణన్‌ను బరిలోకి దించింది. బిజెపి తరపున రవీంద్రనాథ్ పోటీ చేస్తున్నారు.
చాందీ ఊమెన్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి, సేవ ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు..పుతుపల్లి నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ 9, 2026న జరగనుండగా, ఫలితాలు మే 4, 2026న వెలువడనున్నాయి.
పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది కేరళలోని కోటయం జిల్లాలో ఉంది. 1957లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇది కోటయం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
ఈ నియోజకవర్గం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ. ఆయన 1970 నుండి 2023 వరకు వరుసగా 12 సార్లు (53 ఏళ్లు) ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.భారత రాజకీయాల్లో ఒకే నియోజకవర్గం నుండి ఇంత సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన అతికొద్ది మంది నాయకులలో ఆయన ఒకరు.
మొదటిసారి 1970లో సిపిఐ(ఎం) అభ్యర్థి ఇ.ఎం. జార్జ్‌ను ఓడించి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అప్పటి నుండి మరణించే వరకు ఆయన ఇక్కడ అజేయంగా నిలిచారు. ఊమెన్ చాందీ మరణం తర్వాత 2023లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు చాందీ ఊమెన్ కాంగ్రెస్ (UDF) అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆయన తన తండ్రి రికార్డులను సైతం అధిగమించి 37,719 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇది పుతుపల్లి చరిత్రలోనే అత్యధిక మెజారిటీ. పుతుపల్లి సాంప్రదాయకంగా కాంగ్రెస్ (UDF) కోటగా పరిగణించబడుతుంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సిపిఐ(ఎం) నేతృత్వంలోని LDF అభ్యర్థులు ఇక్కడ గట్టి పోటీని ఇస్తుంటారు.ఇక్కడ పోలింగ్ ఏప్రిల్ 9, 2026న జరుగుతుంది. ఫలితాలు మే 4, 2026న వెలువడనున్నాయి.

