ఆకట్టుకునే వేట !!

Sharing is Caring...

An impressive effort …………………

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్.

ఈ సిరీస్ సీరియస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. కాకపోతే కొంత నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.సిరీస్ మొత్తం ఆసక్తికరంగానే సాగుతుంది. నగేష్ కుకునూర్ పోలీస్ వ్యవస్థ పనితీరు ను అవగాహన చేసుకుని ఈ సిరీస్ తీశారు.

రాజీవ్ గాంధీకి దండ వేసే ఫొటోతో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.రాజీవ్ హత్య వెనుక LTTE సభ్యులు ఉన్నట్టు గుర్తిస్తారు.. ఫోటోల ఆధారంగా నేరస్తులను పట్టుకుని విచారిస్తారు.నేరానికి సంబంధించి ఆధారాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ 90 రోజుల పాటు సాగుతుంది. సిరీస్ మొత్తంలో ఎక్కువగా ఒక్క పాత్ర మాత్రమే చివరి వరకు కనిపిస్తుంది.ఆపాత్రే శివరాసన్. 

షఫీక్ ముస్తఫా శివరాసన్ పాత్రలో జీవించాడనే చెప్పాలి.అతని హావభావాలు, ఆహార్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.డీఆర్ కార్తికేయన్ పాత్రలో అమిత్ సియాల్ కూడా కూల్ గా చేశారు. పోలీసు అధికారులు పాత్రల్లో  అమిత్ వర్మగా షాహిల్ వేద్ , కె.రఘోత్తమ్ గా భగవతి పెరుమాళ్, రాధాగోవింద్ రాజు గా గిరీష్ శర్మ, డాక్టర్ పి. చంద్రశేఖరన్ గా అభిషేక్ శంకర్ బాగా నటించారు. 

రఘోత్తమ్ గా భగవతి పెరుమాళ్ నటన బాగుంది.ఆయన లుక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నటీనటులు పాత్రలకు కరెక్టుగా సూట్ అయ్యారు. సెలక్షన్ అద్భుతంగా ఉంది. అందరూ కూడా పాత్రలను అవగాహన చేసుకుని నటించారు. 

టీమ్ సభ్యుల మధ్య క్లాష్ వచ్చినపుడు …  దాన్నిఅమిత్  సియాల్ కూల్గా డీల్ చేసిన సన్నివేశం… స్మగ్లర్ షణ్ముగం ను హేండిల్ చేసిన సీన్. శివ రాసన్  పారిపోయే సన్నివేశాలు.. కేసులో కీలక నేరస్తులనుంచి నిజాలను చెప్పించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.హింసాత్మాక సన్నివేశాలు లేవు.  

స్మగ్లర్ షణ్ముఖం ను స్టేషన్ తీసుకెళ్లమని  సిట్ అధికారులు చెబితే ..పోలీసులు గెస్ట్ హౌస్ కి తీసుకెళతారు. ఒక పోలీస్ అధికారి గెస్ట్ హౌస్ తీసుకెళ్లమని ఆర్డర్ వేశారని  పోలీస్ అధికారి చెబుతాడు. వ్యవస్థలో అధికారుల మధ్య సమన్వయలోపం ఎలావుందో  క్లియర్ గా చూపారు. పోలీసులు తమకు దొరికన ఆధారాలను సిట్ కి ఇవ్వకుండా.. మీడియాకు లీక్ చేయడం వంటి లోపాలను కూడా ఎత్తి చూపారు.

క్లైమాక్స్  లో కూడా శివరాసన్ ను సజీవంగా పట్టుకునే అవకాశం ఉన్నాకూడా ఒక అధికారి వైఖరి కారణంగా సిట్ టీమ్ సైలెంట్ అయిపోతుంది. శివరాసన్ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది .. అందువల్ల కొంత బోర్ కొడుతోంది.  

90వ దశకం నాటి వాతావరణాన్ని .. పరిస్థితులను సహజంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ .. బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. జర్నలిస్ట్ అనిరుధ్య మిత్ర రాసిన ‘నైంటీ డేస్’ పుస్తకం ఆధారంగా సిరీస్ రూపొందింది.

రచయితలు రోహిత్, శ్రీరామ్ రాజన్లతో కలిసి దర్శకుడు నగేష్ కుకునూర్ రాసుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక వాటిని తెరపై కెక్కించిన విధానం బాగుంది.సీనిక్ ఆర్డర్ బాగుండం మూలానా ప్రేక్షకులు ఉత్కంఠ కు లోనవుతారు.సిరీస్ చూసాక సిట్ విచారణను సరైన రీతిలో సాగకుండా తెరవెనుక ఎవరో పావులు కదిపారని సందేహం కలుగుతుంది. అన్నట్టు ఈ నగేష్ మన తెలుగోడే.  

ఈ సిరీస్ sonyliv లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!