ఆకట్టుకునే ‘దాసరి’ మార్క్ సినిమా !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………….     family drama 

మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి.  పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే గుర్రాలయితే’  సినిమా.

1979 లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. నటీ నటులందరికి పేరు వచ్చింది. స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన దాసరి నారాయణరావుకు ప్రశంసలు లభించాయి. మూలకధ మాత్రం ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరిది అందించారు. 

ఓ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు. ఒక్క కూతురు మాత్రం బాధ్యతగా ఆలోచించే ఆమె . మిగిలిన ముగ్గురు వాళ్ళ గోలే వాళ్ళది. ఇద్దరు కూతుళ్ళలో ఒక కూతురు ఎప్పుడూ ఊహల్లో విహరిస్తూ ఉంటుంది.ప్రపంచంలో అందరూ సుఖపడి పోతున్నారు…  తానొక్కదానికే ఏమీ లేదు అని నిత్యం , ప్రతి క్షణం విలపిస్తూ ఉంటుంది. Thomas Harris భాషలో I’m not ok ; All are ok batch.

ఇలాంటి బడాయి బసవయ్య , బసవమ్మ సినిమాలు మనకు కుప్పలకుప్పలు. ఆల్మోస్ట్ అన్నింటినీ జనం చూసారు. ఎంత మంది మారారో తెలియదు. సావాసగాళ్ళు అనే సినిమాకు కాస్త దగ్గరగా ఉంటుందీ సినిమా. కుటుంబ పెద్దగా  కాంతారావు, ఆయనతో పాటు ఇంట్లోని తిక్కోళ్ళని భరించే గృహిణిగా నిర్మలమ్మ.. ఇద్దరు కూతుళ్ళుగా ప్రభ, ఫటాఫట్ జయలక్ష్మి , ఒక సుపుత్రుడిగా మోహన్ బాబు , మరో సుపుత్రుడి పేరు  తెలియదు.

ఆ ఇంటి రాంబంటుగా మురళీమోహన్ , అతని మిత్రుడిగా చంద్రమోహన్ నటించారు. ఇతర పాత్రల్లో రాజబాబు, కె విజయ, రమాప్రభ,జయమాలిని, రామ్మోహన్ ప్రభృతులు నటించారు.నటనాపరంగా ముందు ఫటాఫట్నే చెప్పుకోవాలి. తర్వాత ప్రభ , మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘చెప్పిచ్చుక్కొడతా’ ఊత పదం మోహన్ బాబుకి పెట్టారు.  

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి. కోరికలే గుర్రాలయితే పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్. సినిమాలో రెండు సార్లు వస్తుంది . ఒకసారి జయలక్ష్మి తన ఫ్రెండ్సుతో, మరోసారి చంద్రమోహన్ భార్యా బాధితుడు అయి పాడుతారు.ఆత్రేయ వ్రాయగా  బాలసుబ్రమణ్యం,సుశీలమ్మలు పాడారు .

ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాట ఉంది. లక్ష్మి నటించిన హిందీ బ్లాక్ బస్టర్ జూలీ సినిమాలోని ‘జూలీ ఐ లవ్ యూ’ పాట ట్యూనుతో ‘ఏమి వేషం ఏమి రూపం’ అని ఓ పాట ఉంది. మోహన్ బాబు , రమాప్రభల మీద ఉంటుంది . కొసరాజు వ్రాయగా  బాలసుబ్రమణ్యం, వసంతలు పాడారు. 

మరో శ్రావ్యమైన పాట ‘మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం’ ను మురళీమోహన్ , ప్రభల మీద తీశారు. సి నారాయణరెడ్డి వ్రాయగా బాలసుబ్రమణ్యం, సుశీలమ్మలు పాడారు. ‘ సలాములేకుం రాణీ నీ గులాంనౌతాను’ పాట చంద్రమోహన్ , జయలక్ష్మిల మీద తీశారు. జయమాలిని మీద ఓ డాన్స్ పాట ఉంది కానీ జయమాలిని లెవెల్లో ఉండదు. దాసం గోపాలకృష్ణ వ్రాసారు. రేరే రేక్కాయలో అనే పాట.యస్ జానకి పాడింది. 

దాసరి సినిమాల్లో ఏదో ఒక సందేశం డైరెక్టుగానో , ఇండైరెక్టుగా ఉంటుంది . సినిమా ఆఖర్లో తన వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులను బాదుతాడు . ఈ సినిమాలో కూడా ఆ బాదుడు ఉంది . ప్రతి ఒక్కరూ తప్పక చూడతగ్గ , చూడవలసిన సినిమా. ముఖ్యంగా యువతీయువకులు , మధ్య వయస్కులు తప్పక చూడాలి. ఈ సినిమా యూట్యూబులో ఉంది.చూసి ఉండకపోతే తప్పక చూడండి . మరో సారి చూసినా నష్టం ఏం లేదు.ఓ అలర్ట్ లాగా ఉంటుంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!