ఇంటి పేర్ల తకరారు లో ఆ ఇద్దరు!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala  ………………………………… 

తెలుగు సినిమా పరిశ్రమలో ఇంటి పేర్ల తకరారు ఉన్న ఇద్దరు పాటల రచయితలు ఉండేవారు. చాలా సార్లు చాలా మంది వీరి పాట వారిదిగానూ వారి పాట వీరిదిగానూ అనుకునేవారు . అలాగని రాసేసిన వారూ ఉన్నారు. ప్రసారం చేసిన టీవీ ఛానళ్లూ ఉన్నాయి. వారిద్దరూ ఎవరయ్యా అంటే వీటూరి , వేటూరి. ఇంగ్లీష్ లో దాదాపు రెండూ ఒకటిగానే కనిపిస్తాయి.

“హలో మైడియర్ రాంగ్ నంబర్ ” పాటను …వేటూరి రాసిన డబ్బింగ్ చిత్రమాలిక లో వేసి రుబ్బేసిన స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు. అలాగే “గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను “లాంటి చారిత్రాత్మక రక్తి గీతాన్ని వేటూరి ఖాతాలో వేసి చుట్టేసిన వాళ్లూ ఉన్నారు.

గొడవంతా ఎక్కడొస్తుందంటే .. మన నిర్మాతలకు దర్శకులకూ పాటల మీద శ్రద్ధ లేకపోవడంలో ఉంది సమస్య అంతా. గీత రచన అని ఓ పది మంది పేర్లు వరుసగా వేసేస్తారు. అలా కాకుండా విడివిడిగా ఒక్కోపాట మొదటి లైను లో రెండు ముక్కలు రాసి .. ఓ గీత అఘోరించి దాని పక్కన ఆ యొక్క రాసిన వాడి పేరు వేసి ఉంటే … ఇంత కన్ఫూజను ఉండదు కదా .

అయితే వాళ్ల ఉద్దేశ్యం ఏమంటే … పాటల పుస్తకాలు వేస్తున్నాం రికార్డుల మీద వేస్తున్నాం… క్యాసెట్ల మీద వేస్తున్నాం ఇంకా టైటిల్స్ లో కూడా వేసేస్తే రచయితలకు బాగా డిమాండ్ ఎక్కువై పోతుందని అనుకుంటారు తప్ప అవన్నీ ఒకనాటికి కాలగర్భంలో కల్సిపోయి … యుట్యూబులో సినిమాలుగానే మిగులుతాయి అని తెలియదు ..

క్యాసెట్లు పోయాక వాటి కవర్లు కూడా పోతాయి కదా … పాటల పుస్తకాల అచ్చు వేత దాదాపు డెబ్బై ఐదు తర్వాత ఆగిపోయింది. ఇప్పుడేం దారి ? నిర్మాతలు వేసే అధికారిక పాటల పుస్తకాల ప్రచురణ నిల్చిపోయిన తర్వాత జరిగిన పాటల పుస్తకాల ప్రచురణ గురించి కూడా ఇక్కడే ఓ మాట చెప్తాను .

కొందరు ఔత్సాహిక దుస్సాహసిక ప్రచురణ కర్తలు … రెండు మూడు సినిమాల పాటలు కలిపి న్యూస్ ప్రింట్ మీద అచ్చేసి బ్లాక్ అండ్ వైట్ సేమ్ న్యూస్ ప్రింట్ మీదే కవర్ అచ్చేసి పిన్ను కొట్టి పావలా రేటు పెట్టి తోపుడు బళ్ల మీద పెట్టి నాలుగు రోడ్ల కూడళ్ల దగ్గర సినిమా పాటల పుస్తకాలో అని అమ్మించిన చరిత్ర కూడా ఉంది. ఇందుకోసం విజయవాడ ఒన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో రెండు ప్రెస్సులు చాలా బిజీగా ఉండేవి.

నాకు బాగా గుర్తు ఓ భారీ గడ్డం లో ఉన్న బక్కపలచటి విగ్రహుడొకడు .. అంటే గడ్డమే కనిపించేది మైలున్నర దూరానికి కూడా. అతని మొహం ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదనే నా నమ్మకం. అతను ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ దగ్గర బాంబే టీస్టాల్ ఎదురుగా రోజూ సాయంత్రం పూట ఈ బండి పెట్టుకుని పాటల పుస్తకాలు అమ్మేవాడు.

మలేరియా ఆఫీస్ వీధి మొదట్లో నిలబడి చూసి గడ్డం ఉందా లేదా అని తేల్చుకుని అప్పుడు అటు కదిలిన సందర్భాలు ఉండేవి. వాటిలో రచయితల పేర్లు వేసేవాళ్లు.. వాళ్లు రికార్డు కవర్ల నుంచీ క్యాసెట్ల కవర్ల నుంచీ ఈ పేర్ల వివరాలు తల్సుకునేవారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ తరహా పుస్తకాలతో పాటు ఆ గడ్డం తోపుడు బండబ్బాయి కూడా మాయం అయిపోయాడు.

1979 -80కే ఆ కథ ముగిసింది. సో .. ఇక ఏ పాట ఎవరు రాశారు అని తెల్సుకోడానికి మిగిలిన ఏకైక ఆధారం … రికార్డులు , క్యాసెట్లు .. అవి రెండూ తొంభై దశకాంతానికి ముగిసిపోయి చరిత్రలో కల్సిపోయాయి. ఇటువంటి పరిస్ధితుల్లో టీవీ ఛానళ్లల్లో స్క్రిప్టులు రాసే కుర్రాళ్లకు ఉన్న ఏకైక సోర్స్ వెబ్ సైట్లూ .. యూ ట్యూబే కదా … పాపం … నిజానికి కొందరు రచయితల పాటలు విడిగా పుస్తకాలుగా వచ్చాయి.

అయితే అవి చాలా కొద్ది మందివే … కనుక అసలు ఆ నిర్మాతలే తమ సినిమాలో పాటలు రాసిన కవుల వివరాలతో వేసే ఒక్క కార్డూ … సవివరణాత్మకంగా ఉండేలా చూసుకునుంటే ఇలాంటి కుర్రాళ్లకి ఎంత హాయిగా ఉండేది ప్రాణాలకి … నెట్టునీ వెబ్ సైట్లని నమ్ముకుంటే … ఒక్కోసారి ఉద్యోగాలు ఊడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ పెద్ద పెద్ద గాయకుల పిల్లలూ వాళ్లూ వాళ్ల పెద్దల పట్ల చాలా సెంటిమెంటుతో ఉంటారు.. ఓ సారి ఏమైందంటే … శాంతి నివాసం అనే సినిమా సంగీత దర్శకుడు మాస్టర్ వేణు అని వికీపీడియాలో ఉంది … ఇది తర్వాత సవరించామనుకోండి … ఇది చూసి ఓ స్క్రిప్టు రైటరు .. మాస్టర్ వేణు స్మారక కార్యక్రమంలో శాంతి నివాసంలో పాటేసేసేరు.

ఆ మర్నాడు ఉదయం సదరు ఛానల్ చేరుమెన్నుగారు నన్ను లోపలికి పిల్చి … శాంతి నివాసం సినిమా సంగీతం ఎవరు అని అడిగారు .. ఘంటసాలండీ అన్నాను. మరి మన ఛానల్ లో వచ్చిన ప్రోగ్రామ్ లో మాస్టర్ వేణు అని వచ్చిందేమిటి? అని అడిగారు. తెలియదండీ … ఆ సినిమాకు సంగీతం అయితే ఘంటసాలే అన్నాను.

ఎలా చెప్పగలరు అంత గట్టిగా అని అడిగారు. అది సుందర్ లాల్ నెహతా పోతిన శ్రీనివాసరావు అండ్ కో తీసిన సినిమా అండీ వారు ఏదో ఒకటి రెండు సినిమాలకు తప్ప మాగ్జిమమ్ ఘంటసాలతోనూ తర్వాత రోజుల్లో సత్యంతోనూ కొనసాగారండీ వారూ వారి పిల్లలూనూ అన్నాను. సరే బయటకు వచ్చాను.

ఈ లోగా ఆ రాసిన కుర్రాడు వచ్చాడు. ఏం నాయనా ఇలా రాశావుట కదా అన్నా … అవును ఆల్రెడీ ఫోనొచ్చింది … నేను వికీపీడియాలో చూసి రాశాను … అని వాపోయాడు. అయ్యో నన్నడక్కపోయావా అన్నా … నాకేదో సర్వం తెలిసినట్టూ .. నేనూ చాలా సార్లు కన్ఫూజ్ అవుతూ ఉంటా .. తెల్సు అనుకునే … అదే పొరపాటైంది ఇప్పుడెలా అన్నాడు మళ్లీ .. ఫైనల్ గా అతని ఉద్యోగం పోయింది.

కారణం ఏమిటంటే సదరు ఛానల్ యాజమాన్యంతో ఘంటసాల గారి అబ్బాయికి సాన్నిహిత్యం ఉంది. వారు ఇంట్లో కూర్చుని ఈ ఛానల్ చూస్తుండగా ఇలా ప్రసారం అయ్యింది. దీంతో ఆయన హృదయం దారుణంగా గాయపడి … వీరికి ఫోన్ చేసి బావురుమన్నారు. ఫైనల్ గా ఈ కుర్రాడు బావురుమన్నాడు … అయితే వేరే చోట ఓ నెల్రోజుల్లోపే కుదురుకున్నాడనుకోండి .

నిజానికి ఆ కుర్రాడికి అప్పుడు నేను చెప్పిన సలహా ఏంటంటే .. కొన్ని సార్లు డౌట్ వచ్చినప్పుడు ఓపిగ్గా ట్యూబులోకెళ్లి ఆ సినిమా టైటిల్స్ దీక్షగా పరికించు … అప్పుడు రాయి అని కూడా చెప్పా … వీడి కర్మకాలి సంగీత దర్శకుడి వ్యవహారంలో అలా జరిగిందిగానీ … పాటల రచయితల విషయంలో తరచు జరుగుతూ ఉంటుంది.

కాకపోతే రచయితల పిల్లలు సంగీత దర్శకుల పిల్లలంత అటాచ్మెంటు ఉన్నోళ్లుకాదేమో అలా వాళ్ల పిల్లల నుంచీ పెద్దగా కంప్లైంట్స్ వచ్చినట్టు నాకు తెలియదు. ఈ కన్ఫూజనులన్నింటిలోకీ అతి పెద్ద కన్పూజను … వేటూరి వీటూరి … అసలు మన టాపిక్ ఇది … ఇంత సేపూ పొద చుట్టూ నరికాను చూశారా … ఇందాక మనం చెప్పుకున్న గుడివాడ వెళ్లాను గుంటూరు పొయ్యాను రాసింది వీటూరి. వేటూరి కాదు.

ఈ వీటూరి అసలు పేరు వీటూరి వేంకట సత్య సూర్యనారాయణమూర్తి. ఊరు విజయనగరం జిల్లా రెల్లివలస. స్ట్రెయిట్ సినిమాలు రాసినా … డబ్బింగ్ రైటర్ గానే ఆయన బాగా ప్రసిద్ది. దేవత సినిమాలోని ‘బొమ్మను చేసీ ప్రాణము పోసి’ సాకీ రాసింది వీరే. మిగిలినది మాత్రమే శ్రీశ్రీ రాశారు.

నిజానికి భీమ్లీలో టీచర్ ట్రైనింగ్ పొందినా ఆ ఉద్యోగం వైపు మనసు పోలేదు. ఏదో తూతూ మంత్రంగా నాల్రోజులు ఉద్యోగం చేసినా మనసు మద్రాసు లాగింది. అలా చలో మద్రాసు అని … 1957లో విడుదలైన శర్వాణీవారి అక్క చెల్లెలు సినిమాకు రచనా సహకారం అందించారు వీటూరి. ఆ సినిమాలో ఆయన పాటలేమీ రాయలేదు.

అన్ని పాటలు దాదాపు శ్రీశ్రీ ఆరుద్రలే రాశారు. వీటూరి గారి పేరు తొలిసారి తెర మీద కనిపించింది మాత్రం ఓ డబ్బింగ్ సినిమాలోనే. ఆ సినిమా పేరు శ్రీ కృష్ణ లీలలు. అందులో … మురళీధరా క్రిష్టయ్య నిన్నే నమ్ముకుంటినిరా అనే పాటను రాశారు. అలా మొదలైంది ఆయన కెరీరు.

డబ్బింగ్ గీతాలు రాయడంలో ఆయన చాలా సిద్దహస్తుడు. ఎర్ర గులాబీలు లో ఎదలో తొలి వలపే ఆయనే రాశారు. 78లో విడుదలైన మల్లెపూవులో చకచకలాడే చక్కని బుల్లెమ్మ పాట వీటూరి రాశారని … కాదు … నువ్వు వస్తావనీ బృందావని పాట ఆయన రాశారనీ వాదించేవారున్నారు. నువ్వు వస్తావనీ బృందావనే ఆయన రాశారని నా నమ్మకం.అది ఆరుద్ర రాశారనేవారూ లేకపోలేదు. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరికేది కదా …

సినిమా పేర్లలోనే అదే టైటిల్స్ అంటారులెండి .. మా చిన్నప్పుడు పేర్లు పడేప్పుడు అనే అనుకునేవాళ్లం. సినిమా మొదలైందా అని బుకింగ్ కాడ అడిగితే ఇప్పుడే పేర్లు పడుతున్నాయ్ అనేవాడు బుక్కింగు క్లర్కు. ఇట్టా పేర్లు పడేప్పుడే కనుక ఏ రచయిత ఏ పాట రాసాడో ఏసేత్తే … ఇప్పుడీ గొడవంతా ఉండేది కాదు కదా మారాజా ..అనేది నా బేసిక్ గొడవ.. అది జెప్పడానికే  ఇంత డొంక తిరిగాను.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. మోహన్ నిమ్మరాజు August 28, 2021
error: Content is protected !!