డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి ……………………………….
శరీరం లోనికి జబ్బుని కలిగించే సూక్ష్మక్రిమి ప్రవేశించాక, ఆ క్రిమిని అదుపు చేయడానికి శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ నిలువరించే ప్రయత్నంలో అనేక కణాలు…. అవి విడుదల చేసే రసాయనాలు చురుకుగా పని చేస్తాయి.
ఈ ఇమ్యూనిటీ పనితీరు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వ్యాధి నిరోధకత ప్రధానంగా రెండు భాగాలుంటాయి. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, యాంటీ బాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇవి రెండూ ఒకదానికొకటి సంపూరకాలుగానూ, పరస్పర ఆధారితంగానూ ఉంటాయి.
సొంతం కానిది, పరాయిది అయిన క్రిమికి వ్యతిరేకంగా క్రిమిని, క్రిమి సోకిన కణాలను నాశనం చేయడానికి ఇమ్యూనిటీ సిద్ధపడుతుంది. క్రిమి సోకిన వారి శరీరం, క్రిమికి సంబంధించిన భాగాలను గుర్తించి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తుందో వాటిని ఏంటిజెన్స్ – ఎపిటోప్స్ అంటారు.
వ్యాక్సిన్ – టీకా అంటే వ్యాధికారక క్రిమి సంబంధిత భాగాలను తక్కువ మోతాదులో శరీరానికి పరిచయం చేసి తేలికపాటి వ్యాధి వంటి పరిస్థితిని కలుగ చేస్తుంది. అందుకే టీకా తీసుకున్న తర్వాత, వ్యాధినిరోధక శక్తి ప్రేరేపితం కావడంతో ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలపోటు, కొద్దిపాటి నలత వంటి లక్షణాలు మనందరికీ అనుభవమే.
ఒక క్రిమి కలుగజేసే వ్యాధి లక్షణాలు ఆ క్రిమిలోని ఏ భాగం వల్ల వస్తుందో ఆ భాగానికి తక్కువ మోతాదులో టీకాగా ఇచ్చినప్పుడు ఆ దుష్పరిణామాలు ఉంటాయి. ఈ దుష్పరిణామాలు లేకుండా టీకాను తయారు చేయడానికి దీర్ఘకాలంపాటు విస్తృతమైన ప్రయోగాలు చేస్తారు. అయితే కరోనా వైరస్ విషయంలో దీర్ఘకాలం పాటు ప్రయోగాలు చేయకుండా టీకాలను ప్రవేశపెట్టారు.
దీని మూలంగా అరుదుగా రియాక్షన్స్ ఎదురయ్యాయి. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి క్రిమి ఉపరితలం… స్పైక్ ప్రొటీన్ ని ఉపయోగిస్తారు. దీనివల్ల, శరీర స్పందనగా సిద్ధమైన యాంటీబాడీస్, ఇతర రక్షక ఏర్పాట్లు తర్వాత కాలంలో వైరస్ ప్రవేశించే దశలోనే అడ్డుకుంటాయి. దీంతో వైరస్ వృద్ధి చెంది జబ్బును కలిగించడం కుదరదు. అయితే, ఈ టీకా రక్షణను అధిగమించి సంక్రమణ పాదుకున్నప్పుడు… వైరస్ వృద్ధి చెంది, జబ్బును కలుగజేస్తూ ముందుకు పోతుంది.
క్రిమి వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ప్రొటీన్లు, ఇతర భాగాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ లేకపోవడంతో వ్యాధి కారక క్రిమి వృద్ధి అదుపు లేకుండా జరుగుతుంది.క్రిమి సంక్రమణ సహజంగా జరిగినప్పుడు, దానిని గుర్తించి అదుపు చేసే ప్రయత్నాలను శరీరం చేస్తుంది. ఈ లోగానే క్రిమి శరీరంలో కొంత మేరకు వృద్ధి చెందుతుంది. క్రిమి అభివృద్ధి దశలో అన్ని నిర్మాణాలకు వ్యతిరేకంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్ తో పాటు ఇతర పోరాట ఏర్పాట్లను చేస్తుంది.
అనగా ప్రతి దశలోనూ శరీరం వైరస్ / క్రిమిని అడ్డుకుంటుంది. ఇలా సహజంగా వ్యాధి సంక్రమణ జరిగినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేలా శరీరం సిద్ధపడుతుంది. ముందుగా తయారయ్యే ఏంటిబాడీస్ ని IgM(ఐజిఎం) అంటారు. ఒక వారం తర్వాత IgG (ఐజిజి) యాంటిబాడీస్ ఏర్పడుతాయి. ఇవి రక్తంలో ఉంటాయి. ఇంకా శ్వాస వ్యవస్థలో రక్షణకు గాను, జిగురు పొర (మ్యూకోసా) లో IgA యాంటిబాడీస్ ఏర్పడతాయి.
వ్యాక్సిన్ వల్ల ఏర్పడే యాంటిబాడీస్ లో వ్యాక్సిన్ లో ఇచ్చిన భాగాన్ని ( ఎక్కువ సందర్భాలలో ఉపరితల ప్రొటీన్ ) కి వ్యతిరేకంగా మాత్రమే యాంటీ బాడీస్ ఏర్పడతాయి. టీకా మూలంగా IgA యాంటిబాడీస్ పెద్దగా ఏర్పడవు. ఈ కారణాల రీత్యా ఏదేని వ్యాధి కారక క్రిమి సోకిన వారికి అత్యధికమైన రక్షణ లభిస్తుంది.
అయితే, వాక్సిన్ వల్ల వచ్చిన రక్షణ… సహజంగా క్రిమి సోకడం వల్ల పుట్టుకొచ్చిన రోగ రక్షణతో ఎంత మాత్రమూ సరిపోలదు. అందువల్లనే, గతంలో రెండవ, మొదటి వేవ్ లలో కోవిడ్ బారిన పడిన వారికి తదుపరి జబ్బు సోకినప్పటికీ, పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వెళ్లిపోయింది. కాగా ఒమిక్రాన్ రకం కరోనా వైరస్ కేవలం తేలికపాటి జబ్బును మాత్రమే కలుగజేస్తూ సహజమైన టీకాగా ఉపయోగపడుతున్నది. శాస్త్ర ప్రపంచం అంతా తయారు చేయలేకపోయిన సమర్థవంతమైన టీకాను… ప్రకృతి మనకోసం సిద్ధపరచినది.
ఫోటో: కరోనావైరస్ ప్రధానమైన భాగాలు… క్రిమి సహజ సంక్రమణతో 20కి పైగా ఉన్న ప్రధాన భాగాలకు వ్యతిరేకంగా యాంటిబాడీస్, ఇతర రక్షణ ఏర్పాట్లు సిద్ధమవుతాయి.