కుంభమేళాకు వారి రాక,పోక మిస్టరీయేనా ?

Sharing is Caring...

How they come and go ?

కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణ నాగ సాధువులు. వారు పెద్ద సంఖ్యలో సమూహాలుగా తరలి వస్తారు. వీరి రాజ స్నానం తోనే కుంభమేళా మొదలవుతుంది. ముందుగా స్నానం చేసే హక్కు వారిదే. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 

వారి తర్వాతనే ఇతరులను స్నానఘట్టాలకు అనుమతిస్తారు.నాగ సాధువులు కుంభ్ ముగిశాక వెళ్ళిపోతారు.కొందరు ముందే వెళ్ళిపోతారు.వీరి రాకపోక రహస్యంగానే ఉంటుంది.అయితే వారు ఎలా వస్తారు ?ఎలా వెళతారు ? వారి రవాణా సాధనం ఏమిటనేది పెద్ద ప్రశ్న. 

రైళ్లలో, బస్సుల్లో ఈ నాగ సాధువులు ప్రయాణించినట్టు ఎక్కడా ఫోటోలు కూడా రాలేదు.ప్రైవేట్ వెహికల్స్ లో ప్రయాణించినా ఎక్కడో ఒక చోట తెలిసిపోతుంది.ఈ క్రమంలో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు,ఎన్నోసమాధానాలు ప్రచారంలో ఉన్నాయి.

కొందరైతే నాగసాధువులకు మహిమలుంటాయని..వారికి సూక్ష్మయానం తెలుసు అంటారు. అదంతా ట్రాష్ అనే వారు కూడా లేకపోలేదు.నాగ సాధువులు అందరూ హిమాలయాల్లో నివసించరు. కానీ వారు సమాజంలో జీవించినప్పుడు వారు మామూలు దుస్తులు ధరిస్తారు. అందుకే మనం వారిని చూడలేము అనే వారు కూడా ఉన్నారు.

వీరంతా  కేవలం కుంభ్ వద్ద మాత్రమే నాగ సాధువులు గా కనిపిస్తారని అనే వారు కూడా ఉన్నారు.అఖడాలలో మహా పరినిర్వాణి అఖడా, పంచదష్నం జునా అఖడా అనేవి రెండు పెద్ద అఖడాలు. (అఖడా అంటే పెద్ద సమూహం) ఈ రెండూ వారణాసికి చెందినవే. వీటిలో నమోదైన నాగసాధువులు వారణాసి వెళ్ళాక మామూలు వస్త్రధారణ లోకి వెళ్ళిపోతారనే టాక్ కూడా ఉంది.

కొందరైతే వారణాసి సమీప ప్రాంతాల్లోని దేవాలయాల పరిసరాల్లోనే ఉంటారని కూడా అంటారు. కొందరు మాత్రం అడవుల్లోకి .. ఇతర ప్రాంతాల్లోకి  వెళ్ళిపోతారని చెబుతారు.వీరి ప్రయాణం కూడా రాత్రిళ్ళు సాగుతుందని  .. జన సమూహాల్లోకి వెళ్లకుండా.. వారి ప్రశాంతతకు భంగం కలిగించకుండా.. కొండలు, గుట్టలు, పుట్టల గుండా నడచి వెళుతుంటారని చెబుతారు.

కుంభ మేళా ముగియగానే వారణాసి, హరిద్వార్, రిషికేశ్,నాసిక్,ఉజ్జయిని తదితర ప్రాంతాలకు  వెళ్ళిపోతారని అంటారు. మరికొందరు హిమాలయాల ప్రాంతాల్లోని పుణ్య క్షేత్రాలకు వెళ్ళిపోతారని ప్రచారం ఉంది. అక్కడే  వారు ధ్యానం,తపస్సులో సంవత్సరాల పాటు గడుపుతారని మరల పుష్కరాల సమయంలో వస్తారని అంటారు.

మరికొందరు వారణాసి ప్రాంతంలో అఖడాలలో ఉంటారు.మొత్తం మీద వీరి రాక, పోక కొంత మిస్టరీ అనే చెప్పుకోవాలి. దూర ప్రాంతాలలో ఉండే నాగసాధువులు అఖడాలతో సంబంధాలు కలిగి ఉంటారు.అఖడాలలో కొత్వాల్ అనే హోదా గల సాధువు వీరితో కమ్యూనికేషన్ నిర్వహిస్తుంటారు.

ఈ కొత్వాల్ అన్ని అఖడాలతో సంబంధాలు కలిగి ఉంటారు. దూర ప్రాంతాలలో ఉండే సాధువులకు సమాచారం, అవసరమైన వనరులు సమకూరుస్తూ అఖడాల మధ్య సమన్వయం పెంచేందుకు కృషి చేస్తుంటారు.కొత్వాల్ హోదాలో ఉండే వారి దగ్గర సాధువుల సమాచారం అంతా ఉంటుంది. కుంభమేళా వంటి సందర్భాలకు ముందుగానే వీరికి సమాచారం పంపుతారు.

మొత్తం మీద వీరి రాకపోక అంత క్రమశిక్షణ మేరకే జరుగుతుంది.కుంభమేళా తర్వాత వీరిలో కొందరు వారు నివసిస్తున్న ప్రదేశాలకు వెళతారు.మరికొందరు దేశం అంతటా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళతారు. వివిధ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను సందర్శించడం, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తమ ఉనికిని చాటుకుంటారు.

చాలా మంది నాగ సాధువులు రహస్యంగా ఉంటూ సాధారణ సమాజానికి దూరంగా తమ జీవితాలను ప్రశాంతంగా గడుపుతారు. వీరి ఆధ్యాత్మికత, జీవనశైలి వీరిని విభిన్నంగా చూపిస్తుంది. 2025 మహా కుంభమేళాలో 4 లక్షలకు పైగా నమోదిత నాగ సాధువులు పాల్గొన్నారని సమాచారం.

——–KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!