పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది.
చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు బలవుతున్నారు. బయటకు అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్లల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా పెరుగుతోంది. ప్రభుత్వ రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి.
దేశంలో ప్రతి ఏడాది లక్షల్లో పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదు అవుతున్నాయి. నమోదు అయ్యే కేసుల్లో వేలల్లోనే కనిపిస్తున్నాయి. ఇందులో అధిక శాతం మైనర్ బాలికలే ఉంటున్నారు. మిస్సింగ్ కేసులలో మహిళలు కూడా ఉంటున్నారు. మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్న బాలికలను వేశ్యాగృహాలకు అమ్మివేస్తున్నారు. అక్రమ రవాణా కేసులు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసులు బాగానే ఉంటున్నాయి.మిస్ అయిన అమ్మాయిల్లో కొందరిని ఢిల్లీలోని రెడ్లైట్ ఏరియాలకు అమ్మివేస్తున్నారు. అలాగే మనదేశం నుంచి ఉక్రేయిన్, ఖజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, థాయిలాండ్, మలేసియా తదితర దేశాలకు తరలి వెళుతున్నారు. అక్కడ వీరంతా బానిసత్వంలో మగ్గిపోతున్నారు.
కరవుతో అల్లాడుతున్న బుందేల్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక తదితర రాష్ట్రాలలో చిన్నారులను పోషించలేక వందలాది రూపాయలకే అమ్మేసుకున్న ఉదాహరణలున్నాయి. పోలీసులు పట్టుకుంటున్నపుడు అమ్మాయిల తరలింపు తగ్గుతోంది … ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆడపిల్ల కాలు బయటకు పెట్టిందంటే ట్రాప్ చేసేందుకు ప్రయత్నించేవాళ్లే ఎక్కువ.
అమ్మాయిల అక్రమ రవాణాదారులు సోషల్మీడియానే ఉపయోగించుకుంటూ డబ్బులు ఆర్జిస్తున్నారు. చట్టాలు బలహీనంగా ఉండటం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. వేలాది కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నాయి.అమ్మాయిల అక్రమ రవాణాను అరి కట్టేందుకు దాదాపు 335 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ (AHTU ) ను ఏర్పాటు చేయగా వాటిలో చాలావరకు చురుగ్గా పనిచేయడం లేదు.
మొత్తం ౩౦ రాష్ట్రాల్లో 27 శాతం AHTUs మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం లోపు AHTUs లకు మాత్రమే పోలీసు స్టేషన్ అధికారాలు కల్పిస్తూ నోటిఫై చేశారు.మిగతా వాటికి అధికారాలు ఇవ్వాల్సి ఉంది. ఇక 18ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు దాదాపు మూడు మిలియన్ల మంది పైగా సెక్స్ వర్కర్లుగా నమోదు కావటం దేశంలోని దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది.