Power of Vishnu Maya………………………
త్రిలోక సంచారి నారదుడు ఎల్లవేళలా నారాయణ మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతుంటాడు. ఈయనను కలహ భోజనుడు అని కూడా అంటారు. నారద మహర్షి వాళ్ళకీ వీళ్ళకీ తగవులు పెట్టి … వాళ్ళు కలహించుకుంటూ ఉంటే చూసి ఈయన ఆనంద పడతాడని అంటారు.
కానీ నిజానికి నారదునికి ఎవరిమీదా ఈర్ష్యాద్వేషాలు లేవు. మనసులో ఎలాంటి కల్మషాలూ ఉండవు. సిసలైన ఋషిపుంగవుడు. అంతరంగం స్వచ్చంగా, నిర్మలంగా ఉంటుంది. మరి పురాణాల్లో ఎందరికో, ఎన్నోసార్లు తగవులు ఎందుకు పెట్టారంటే వాటి వెనుక మర్మం వేరే ఉంటుంది.
ప్రతిదానికీ కార్యా కారణ సంబంధం తప్పక ఉంటుంది. నారద ముని ఏ పని చేసినా అది జగత్ కల్యాణానికే ఉపయోగపడుతుంది. నారదమహర్షి వ్యంగ్యంగా మాట్లాడినా, పరస్పరం పుల్లలు పెట్టి యుద్ధాలు సృష్టించినా అదంతా లోక శ్రేయస్సు కోసమే. నారదుడు విదూషకుడి ని తలపిస్తాడు. కానీ నిజానికి ఆయనకు ఎలాంటి ఆశలూ ఆవేశాలూ ఉండవు.. ఆయన ఒక విరాగి.
ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదుడు విష్ణు భక్తుడు. పరమశివుని ప్రియశిష్యుడు. పధ్నాలుగు లోకాలను స్వేచ్ఛగా చుట్టిరాగలరు. ఆధ్యాత్మిక సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఎలాంటి సంసార సంబంధమైన సమస్యలు లేకుండా హాయిగా తిరుగుతుంటాడు. అలాంటి ఆయనకు ఓ రోజు విచిత్రమైన కోరిక కలిగింది. భూలోకంలో భవసాగరాన్ని దర్శించాలన్న ఆసక్తి కలిగి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు.
సంసారం ఒక మాయ అంటారు కదా! అదేంటో తెలుసుకోవాలని ఉందని తన కోరికను విష్ణుమూర్తికి తెలియజేశాడు. అంతట విష్ణువు నారదునికి భూలోకంలో ఒక కొలను చూపించి అందులో స్నా నం చేసి రమ్మంటాడు. ఈ కొలను కాకినాడ దగ్గర సర్పవరం భావనారాయణ గుడి ఎదురుగా ఉందని అంటారు.
సరేనంటూ నారదుడు వెళ్ళి కొలనులో దిగి స్నానం చేసి పైకి వచ్చేసరికి ఒక స్త్రీగా మారి పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంతలో అటుగా వచ్చిన ఒక రాజు స్త్రీ రూపంలో వున్న నారదుడిని చూసి మోహంచి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా నారదుడు సంసార బంధాల్లో చిక్కుకుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు.
కొన్నేళ్ళ తరువాత శత్రువులతో జరిగిన యుద్ధంలో, రాజు తన 60 మంది పుత్రులతో సహా మరణిస్తారు. స్త్రీ రూపంలో వున్న నారదుడు అంతు లేని దు:ఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తర క్రియలు జరిపించి తరువాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడంతో అతనికి స్త్రీ రూపం పోతుంది. అయినా భర్తా .. పుత్రులు యుద్ధంలో మరణించిన దు:ఖము నుంచి తేరుకోలేకపోతాడు.
అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెబుతాడు. ‘సంసార బంధం అంటే ఏమిటో అర్థమైందా నారదా’ ?అని అడుగుతాడు. నారదుడికి భవసాగరం అంటే ఏమిటో బోధ పడుతుంది. నారదుడి సంతానం పేర్లు శాశ్వతంగా నిలిచి పోయేలా విష్ణుమూర్తి వరమిస్తాడు.వారి పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా నిలిచిపోతాయని చెబుతాడు విష్ణువు.
అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల , ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర… ఇలా 60మంది పుత్రుల పేర్లే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సంవ త్సరాల పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి.