సుదర్శన్ టి …………………………… ………. A great man
ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది.
అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో కత్తి పట్టకుండా సమస్త భారతాన్ని ఒకత్రాటి మీదకు తెచ్చి దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు. ఆ సుస్థిరత కొనసాగడానికి దేశం నాలుగు దిశల్లో మఠాలు స్థాపించి ఆ పరంపర కొనసాగేలా ఏర్పాట్లు చేసిన రాజనీతిజ్ఞుడు.
కాలడి ఆది శంకరుని జన్మ స్థలం. ఈ గ్రామం పాత పేరు Sasalam. ఆది శంకరుని తల్లి వయసు మీరి నదీ స్నానానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నప్పుడు శంకరాచార్యులు కృష్ణుణ్ణి ప్రార్థిస్తే పెరియార్ నది తన దిశను మార్చుకుని శంకరుని తల్లి పాదాలను స్పృశిస్తూ ప్రవహించింది కాబట్టి ఆ ఊరు కాల్-అడి (కాళ్ళ కింద) అయింది.
ఇక శంకరాచార్యులు వారు స్థాపించిన మఠాలు ద్వారక (గుజరాత్), జోషిమఠ్ (ఉత్తరాఖండ్), పూరి (ఒడిశా), శృంగేరి (కర్ణాటక) లలో ఉన్నాయి.. 1910లో ఆదిశంకర ఆలయాన్ని ప్రతిష్టించిన తర్వాత కాలడి ప్రాముఖ్యతను సంతరించుకుంది. మే 2010 లో కాలడి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి.
కాలడిలో శృంగేరి మఠం ఆధ్వర్యంలో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శారదాంబ మరొకటి శివాలయం.. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ శృంగేరి మఠం .. కంచి మఠం శాఖలు ఉన్నాయి. 45 మీ (148 అడుగులు) ఎత్తైన ఆదిశంకర కీర్తి స్తంభ మండపాన్ని కంచి మఠం పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్మించారు.
ఆది శంకరుని పాదుకలకు నమస్కరించుకుని ఆరు అంతస్తుల స్థూపం పైకి వెళ్లొచ్చు. లోపల శంకరుని జననంతో ప్రారంభమై ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించిన పయనం చక్కగా బొమ్మలతో ప్రదర్శించారు. ఆయన దర్శించిన ఆలయాలు, ప్రతిష్ఠించిన ఆలయాల వర్ణన కూడా ఉంది. శ్రీశైలం, త్రయంబకేశ్వర, చిదంబర, రామేశ్వర ఆలయాలు ఆది శంకరుని కంటే ముందు నుండే ఎంత వైభవాన్ని సంతరించుకున్నాయో చూస్తే అవి ఎంత పురాతన ఆలయాలో తెలుస్తుంది.
శృంగేరి మఠం ఆలయ సముదాయానికి పశ్చిమాన కృష్ణుడి ఆలయం ఉంది. ప్రతి ఏటా జనవరిలో ఇక్కడ వేడుకలు జరుగుతాయి. శంకర జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే కనకధార యజ్ఞం నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
ఈ ప్రాంగణంలోనే చిన్న వినాయకుని మందిరం కూడా ఉంది. శంకరాచార్యులు వారి తల్లి సమాధి ని ఇక్కడ చూడవచ్చు. కాలడికి సమీప రైల్వే స్టేషన్ అలువా .. ఇది 18 కి.మీ దూరంలో ఉంది.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ముంబై వంటి అన్నిప్రధాన నగరాల నుండి వచ్చేరైళ్లు ఇక్కడ ఆగుతాయి.
అక్కడనుంచి రవాణా సదుపాయాలున్నాయి. అలాగే మరో సమీప రైల్వే స్టేషన్ అంగమలీ.. ఇక్కడ దిగినా కాలడికి చేరుకోవచ్చు.విమానం ద్వారా అయితే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా నెడుంబస్సేరి విమానాశ్రయం లో దిగి అక్కడ నుంచి టాక్సీ లో కాలడి కి చేరుకోవచ్చు. జీవితం లో ఒకసారైనా చూడాల్సిన క్షేత్రం.