అంత చిన్నలాజిక్ ఎలా మిస్ అయ్యారు సారూ ?

Sharing is Caring...

మాఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి ఒక విధంగా స్వయంకృతమే. బహుభాషా నటుడిగా పేరున్న ప్రకాష్ అనవసరంగా టెంప్ట్ అయి మా ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు బాగా మాట్లాడతా .. నాలా ఆ ప్యానల్  లో ఒక్కరన్నా ఉన్నారా ? అంటూ సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్  పోలింగ్ ప్రారంభ సమయంలో ఎలాంటి భాష మాట్లాడారో ఛానల్స్ పదే పదే చూపుతూ ఊదర గొట్టాయి. 

అంతో ఇంతో పరిణితి ఉన్న నటుడుగా ప్రకాష్ రాజ్ కి ఒక పేరుంది. అయితే ఎన్నికల టెన్షన్ లో దాన్నికోల్పోయాడు. ఇక ప్రకాష్ కి మద్దతు గా నిలిచిన నాగబాబు అనవసరమైన విషయాలు మాట్లాడి ప్రకాష్ ను గబ్బు పట్టించారు. నరేష్ పై పదే పదే ఒంటి కాలిమీద లేచి ప్రకాష్ సినిమా విలన్ లాగానే  వ్యవహరించారనే పేరు తెచ్చుకున్నారు. మొదట్లో సంయమనం పాటించిన ప్రకాష్  పోలింగ్ దగ్గర పడే కొద్దీ సహనం కోల్పోయారు.

విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు సహజ స్వభావానికి భిన్నంగా చాలావరకు సహనం తో వ్యవహరించారు. ఆయన టెంపర్మెంట్ తెలిసిన వాళ్లు నిజంగా ఆశ్చర్యపోయారు. మీడియా తో మాట్లాడేటపుడు కూడా మోహన్ బాబు జాగ్రత్తగా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇచ్చిన నాగబాబు కోటా లాంటి సీనియర్ నటుడి గురించి మాట్లాడిన తీరు చాలా మందికి నచ్చలేదు.

అసలు మొదట్లో ప్రకాష్ కి చిరు గ్రూప్ మద్దతు లేదనుకున్నారు. ఎప్పుడైతే నాగబాబు రంగంలోకి దిగారో ఆయనపై  మెగా క్యాంప్ మనిషి అన్న ముద్ర పడింది. దీనికి తోడు మోడీ ని ఎదిరించిన ధీరుడిగా అనవసరంగా ప్రొజెక్ట్  చేశారు. మెగా క్యాంప్ అభ్యర్థిగా ముద్ర పడకపోతే గెలిచేవాడేమో ?  కుల సమీకరణాలు ఇంత ప్రభావం చూపేవి కావేమో ?

పరిశ్రమ పెద్ద కావాలనుకుంటున్న చిరు కూడా రెండు గ్రూపుల మధ్య రాజీ చేసినట్టయితే బాగుండేది. ఒక ఏడాది ఒకరు ప్రెసిడెంట్ గా .. మరొకరు వైస్ ప్రెసిడెంట్ గా .. రెండో ఏడాది పదవులు మార్చుకునేలా సర్దుబాటు చేస్తే బాగుండేది. బై లా లో మార్పులు చేస్తే అలా చేయవచ్చని శివాజీ రాజా స్వయంగా చెప్పారు. ఆ సూచనను ఎవరూ పట్టించుకోలేదు. 

ప్రకాష్ రాజ్ చిత్ర పరిశ్రమపై కమ్మ సామాజిక వర్గానికి ఉన్న పట్టును సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ముఖ్యంగా మోహన్ బాబు బలాన్ని తక్కువగా ఊహించారు. మద్దతు ఇచ్చే వర్గం బలం ఎంతో కూడా లెక్కవేసుకోలేదు. తన అనుభవం ..పాపులారిటీ .. గెలిపిస్తాయని భావించారు. సరిగ్గా అక్కడే ప్రకాష్ అక్కడే దెబ్బతిన్నారు. దానికి తోడు ముద్ర పడటం పెద్ద మైనస్ అయింది.

చిరంజీవి మద్దతుతో పాటు మోహన్ బాబు ,కృష్ణ ,కృష్ణంరాజు, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి హేమాహేమీల మద్దతు అడిగి ఉండాల్సింది. ఈ మైనస్ ల ఫలితమే విష్ణు లాంటి పిల్లోడి తో కలబడి ఓడిపోయారు.అన్ని తెలుసనుకుంటున్న ప్రకాష్ ముద్ర విషయంలో లాజిక్ మిస్ అయ్యారు అని విశ్లేషకులు చెబుతున్నారు.  మొత్తం మీద  ఈ ఎన్నికల ద్వారా పరిశ్రమలో రెండు గ్రూపులున్నాయని మరోసారి తేటతెల్లమైంది. మా సభ్యులంతా ఒకటే అని చెప్పుకోవడం కాదు .. ఆమాట ఆచరణలో కూడా చూపాలి . అలా చూపడానికి ఎవరూ చొరవ తీసుకోలేదు. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!