ఆయన శైలి అనితర సాధ్యం !

Sharing is Caring...

“మనసున మల్లెల మాలలూగెనే” అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…”ఏడ తానున్నాడో బావ” అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…“కుశలమా నీకూ కుశలమేనా “అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి  దంపతులకు ప్రేమతో చెప్పినా…”తొందరపడి ఒక కోయిల” చేత కాస్తంత ముందే కూయించినా… అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
“సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే” అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..”పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా” అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…”పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం” సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా.. అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
“మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడని…గన్నేరులా  పూస్తే కలవాడొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ..  అతడే దిగి వొస్తాడం”టూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…”గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా” అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా… ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ధన్యజీవి గురించి  తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వారమైన మనకే ఎంతో అవమానం.
ఎన్నిసార్లు విన్నా.. ఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు  దేవులపల్లి కృష్ణశాస్త్రి . 
అటువంటి గొప్పవాడైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..
కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“ఈ గంగ కెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర ఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…
తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు.. గొల్లపూడి మారుతీ రావు కూడా మద్రాసులోనే వుండేవారు..ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు.. ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు.. కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి.. మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు . 
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు. (మిగతా భాగం పార్ట్ 2 లో చదవండి)

కర్టేసి …  un known writer ….  whatsapp గ్రూప్ ల్లో సర్క్యులేట్ అవుతోంది ఈ పోస్ట్. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!