Unique Style…………….
రజనీ కాంత్ ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆయన స్టైల్స్ ..డెబ్బయి నాలుగేండ్ల వయసు లో కూడా ఆయనలో ఎనర్జీ తగ్గలేదు .. ఆ స్టైల్స్ మారలేదు.ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయన్ను చూస్తూనే ఉన్నారు. హీరోయిజానికి రజనీ ని ఒక ఐకాన్‌గా చెప్పుకోవచ్చు.
తమిళనాడు వాళ్ళకు భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువైనప్పటికి తమ రాష్ట్రం వాడు, తమ భాష వాడు కాక పోయినా కూడా రజనీ కాంత్ కు బ్రహ్మరథం పట్టారు. ఆయనను ఒక దేవుడిగా ఆరాధిస్తారు. తమిళ నాటనే కాకుండా దేశవ్యాప్తంగా రజనీ కాంత్ కు అభిమానులు ఉన్నారు.
బాలీవుడ్ లో కూడా రజనీ కాంత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. షారూఖ్ ఖాన్ సినిమాలో ‘లుంగీ డాన్స్’ పెట్టడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.బ్లాక్ అండ్ వైట్ యుగం నుంచి కృత్రిమ టెక్నాలజీ యుగం వరకు రజనీ కాంత్ ప్రయాణం సాగుతూనే ఉంది.
ఇక తెలుగులో రజనీ కాంత్ డైరెక్ట్ గా చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా రజనీ కాంత్ సినిమా అంటే మన హీరో సినిమాల కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగే తలైవా సినిమాల కోసం కూడా ఎదురు చూస్తారు.
రజనీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. వీరి స్వస్థలం మహారాష్ట్ర.. పూణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి వీరి నాన్న రామోజీరావు ఉద్యోగరీత్యా కర్ణాటక కు వలస వచ్చారు. రామోజీరావు పోలిస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు.ఆయనకు నలుగురు సంతానం.. పెద్దవాడి పేరు సత్యనారాయణ,రెండవ వాడి పేరు నాగేశ్వరరావు, మూడవ సంతానం అశ్వత్ బాలూ భాయ్. నాలుగవ వాడు రజనీ కాంత్.
వీరు బయటకువచ్చినప్పుడు కన్నడ మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం వారి మాతృభాష మరాఠీ మాట్లాడుకునేవారు. రజనీ కాంత్ తండ్రి రామోజీ రావు 1956 లో పదవీ విరమణ తరువాత వారి కుటుంబం బెంగళూరు లోని హనుమంత నగర్ కు మారింది. రజనీకాంత్ బాల్యంలోనే అంటే అతనికి తొమ్మిదేండ్ల వయసప్పుడే తల్లి మరణించారు.
ప్రాధమిక విద్యను గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరి స్కూల్ లో చదువుకున్నారు. చిన్నతనంలో చురుకుగా ఉండే వాడు. అటు చదువు లోనూ ఇటు ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉండే వాడు. క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లు ఎక్కువగా ఆడుతుండే వాడు.
తల్లి మరణించిన తరువాత వారి సోదరులు రజనీకాంత్ ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆయన వేదాలు, భారతీయ సంప్రదాయాలు,చరిత్ర గురించి తెలుసుకున్నారు. దాంతో పాటు ఆధ్యాత్మిక బోధనలు ఆయనను ప్రభావితం చేశాయి.ఒక సారి మఠం వారు నాటకం వేస్తూ రజనీకాంత్ చేత ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రను వేయించారు.
ఆ నాటకంలో ఆయన నటనకు కన్నడ కవి డి.ఆర్.బెంద్రే నుండి ప్రశంసలు కూడా లభించాయి. ఆ సమయంలోనే ఆయనకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది.పాఠశాల విద్య ముగిసిన తరువాత రజనీ కాంత్ బ్రతకడం కోసం ఎన్నో పనులు చేసాడు.కొంత కాలం రైల్వేకూలీగానూ పనిచేశారు. ..తరువాత బెంగుళూరు బస్ ట్రాన్స్ పోర్టు లో కండక్టర్ గా చేరాడు. కండక్టర్ పని కూడా చాలా స్టైలిష్ గా చేస్తుంటే బస్ డ్రైవర్ అతనిలోని ప్రతిభను గుర్తించి సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు.
బస్ కండక్టర్ గా పని చేస్తూ నాటకాలు కూడా వేసేవాడు. బస్ లో రోజూ ప్రయాణించే నిర్మల అనే ఒక వైద్య విద్యార్థిని తో అతనికి పరిచయం అయింది. ఒకసారి తాను వేస్తున్న నాటకాన్ని చూడటానికి ఆమెను ఆహ్వానించాడు.ఆ నాటకంలో రజనీ కాంత్ నటించిన విధానం చూసి ఆమె కూడా రజనీకాంత్ ను సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించింది.
అంతే కాదు రజనీ కాంత్ కు తెలియకుండానే మద్రాసులోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు రజనీకాంత్ తరపున దరఖాస్తు పంపింది. అలా రజనీకాంత్ ఫిలిం ఇనిస్టిట్యూట్ యాక్టింగ్ కోర్సు లో చేరారు.రజనీకాంత్ నటుడు గా మంచి పేరు తెచ్చుకుని స్థిరపడ్డ తరువాత నిర్మల ఎందుకో అతనికి మరల కనిపించలేదు.
ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కోర్సు ముగిశాక ప్రముఖ దర్శకుడు బాలచందర్ రజనీకాంత్ నటించిన ఒక నాటకాన్ని చూసి తాను తీస్తున్న సినిమాకు ఆడిషన్ కు పిలిచాడు. ఆ ఆడిషన్ లో రజనీకాంత్ తమిళ కథానాయకుడు శివాజీ గణేషన్ ను అనుకరించి చూపాడు. కానీ బాలచందర్ కు అది నచ్చలేదు. ఒకరిని అనుకరించడం కాదు.. నువ్వు ఏమి చేయగలుగుతావో చేసి చూపించమని రెండు రోజులు సిద్దంగా ఉండు అని చెప్పాడు.
రెండు రోజుల తరువాత వెళ్ళినపుడు రజనీ కాంత్ పాకెట్ లోనుండి ఒక సిగరెట్టు తీసి స్టైల్ గా నోటిలో పడేట్లు విసిరేశాడు. ఆ ప్రక్రియ బాలచందర్ కు విపరీతంగా నచ్చింది. అప్పుడు బాలచందర్ రజనీకాంత్‌ను తమిళం నేర్చుకోమని చెప్పాడు.అప్పటి వరకు శివాజీ రావు గైక్వాడ్ గా పిలవబడుతున్న రజనీకాంత్ కు ఏ పేరు పెడితే బాగుంటుంది అని యోచించి.. ముందు చంద్రకాంత్, శ్రీ కాంత్, రజనీ కాంత్ అనే మూడు పేర్లను పరిశీలించి ఎట్టకేలకు రజనీ కాంత్ అని నామకరణం చేశాడు.
బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమా ద్వారా రజనీకాంత్ ను పరిచయం చేశారు. ఆ సినిమాలో సుజాత నటించిన భైరవి పాత్ర మాజీ భర్త క్యారెక్టర్ రజనీకి ఇచ్చారు. భైరవిని బెదిరిస్తూ.. బ్లాక్‌మెయిల్ చేసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ సిగరెట్ ఏగరవేసే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తెలుగు వెర్షన్ తూర్పు పడమర లో ఈ పాత్రను మోహన్ బాబు చేశారు.1975 లో విడుదలైన ఈ సినిమా వ్యాపార పరంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు మూడు జాతీయ చలన చిత్ర అవార్డుులు వచ్చాయి.తరువాత కాలంలో ఈ సినిమా హిందీలో ‘ఏక్ నయా పెహలీ’ అనే పేరుతో.రీమేక్ అయింది.
రజనీ కాంత్ బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అంతులేని కథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అందులో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ అనే పాటతో ఆయన పాపులారిటీ పెరిగింది. ఆ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. రజనీకాంత్ నటించిన అన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. అవి తమిళ్‌లో ఎంత బాగా ఆడాయో.. అదేరేంజ్ లో తెలుగులో కూడా ఆడాయి..
దీంతో తెలుగు ప్రేక్షకులు రజనీ కాంత్ ను తమ తమ వాడిగా భావించి నీరాజనాలు పట్టారు. అలా నటుడిగా ఒక్కోమెట్టు ఎదుగుతూ వచ్చాడు. తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. రజనీకాంత్ గొప్పనటుడేం కాదు.. అయినప్పటికి ఆయన తన స్టైల్స్ తో ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు.
1990వ దశకానికి వచ్చే సరికి రజనీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ఆ కోవలోవే ‘పనక్కరన్’ … ‘అతిశయ పిరవి’ చిత్రాలు హిట్ కొట్టాయి. ‘అతిశయ పిరవి’ ఇది చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన ‘యముడికి మొగుడు’ చిత్రానికి పునర్నిర్మాణం. అలాగే ‘ధర్మ దొరై’ కూడా హిట్ కొట్టింది.
1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘బాషా’ సినిమా పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయనను మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు, ‘పెదరాయుడు’ సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించాడు.
1995లోనే మలయాళం సినిమా ‘తెన్మవిన్ కొంబత్తు’ను కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో కె.బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ‘ముత్తు’ పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.
భాషా సినిమాలో బాషా ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్టు అనే డైలాగ్ కూడా ఇప్పటికీ జనం నోట్లో నానుతూనే ఉంది. రజనీకాంత్ సిగరెట్ ను నోట్లోకి స్టైల్ గా వేసుకోవడం .. షర్ట్ ను చేతులతో అటూ ఇటూ తిప్పడం.. కళ్ళద్దాలు స్టైల్ గా తీయడం ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశాడు.అలాగే నరసింహ ( పడయప్పా )వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
2002 వరకు వరసగా హిట్లిచ్చిన రజనీకాంత్ కు తరువాత గ్యాప్ వచ్చింది. ఇక రజనీకాంత్ పని ఐపోయింది అనుకున్నారంతా .. అదే సమయంలో ఆయన సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాబా అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశాడు. ఈ సినిమా విపరీతమైన ప్రచారం మధ్య విడుదలైంది.
ఒక గ్యాంగ్‌స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చతికిల పడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. నష్టపోయిన వారికి రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు.
పి.ఎం.కె అధ్యక్షుడు రాందాస్ ఈ సినిమాతో రజినీకాంత్ బీడీలు కాల్చడం వంటి దురలవాట్లతో తమిళ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించాడు. ఆ పార్టీ కార్యకర్తలు సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్ల పై దాడి చేసి ఫిల్ములను తగులబెట్టారు.
రెండేళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా ‘మణిచిత్ర తాళు’ పునర్నిర్మాణం అయిన ‘చంద్రముఖి’ సినిమాలో, పి.వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఇది బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అవడంతో పాటు 2007లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.ఇది టర్కిష్, జర్మన్ భాషల్లోకి కూడా అనువాదం అయింది.
తర్వాత శంకర్ దర్శకత్వంలో ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ‘శివాజీ’ సినిమాలో నటించాడు. రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ, దక్షిణాఫ్రికాలోనూ “టాప్-టెన్ బెస్ట్ ఫిల్మ్స్” జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరుతెచ్చుకుంది. ఈ సినిమాకి రజనీకాంత్ 27 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం.
2015 లో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలై మంచి విజయాన్నిసాధించింది. 2023 లో వచ్చి ఘన విజయం సాధించిన జైలర్ సినిమా సీక్వెల్ 2026 లో విడుదల కావడానికి సిద్ద పడుతోంది.చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది.
ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు తలైవా అందుకున్నాడు.
ఇక రజనీకాంత్ యంజిఆర్, యన్.టి.ఆర్ లాగా రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకుని డేట్ కూడా ప్రకటించాడు. ఐతే అదే సమయంలో బిజేపి అదిష్టానం నుండి తమ పార్టీలో చేరవలసిందిగా ఒత్తిడి రావడంతో దానికి సుముఖంగా లేని రజనీ ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ కు వచ్చి హాస్పిటల్ లో చేరాడు.
అనారోగ్యం కారణంగా పార్టీ ని ప్రకటించలేక పోతున్నానని రజనీకాంత్ ప్రకటించాడు. ఇంటికి వెళ్ళిన తరువాత రజనీకాంత్ తాను రాజకీయ పార్టీని పెట్టడం లేదని ప్రకటించాడు. ఇప్పటికి సినిమాల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ చాలా నిరాడంబరంగా ఉంటాడు.
సినిమా షూటింగ్ లలో మాత్రమే ఆయన సినిమాలోని పాత్రకు తగ్గ విధంగా విగ్గు ధరిస్తాడు.. మేకప్ వేసుకుంటాడు. పబ్లిక్ మీటింగ్‌లకు గానీ …ఏదైనా కార్యక్రమాలకు వెళ్లినా కూడా ఆయన ఎలాంటి మేకప్ లు, హంగులు లేకుండా వెళతాడు.తన నిజమైన గెటప్ తోనే కనిపిస్తాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విధానమే రజనీకాంత్ ను అభిమానులకు మరింత దగ్గర చేసింది .

