సెన్సార్ సర్టిఫికెట్ కోసం దీక్ష చేసిన ఏకైక హీరో !

Sharing is Caring...

సినీ పరిశ్రమలో నటుడు మాదాల రంగారావు గురించి తెలియని వారు లేరు. ఆయన ఉద్యమ స్పూర్తి.. ఆయన నిర్మించిన చిత్రాలే పెద్ద పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. అలాంటి మాదాల రంగారావు ఒక సందర్భంలో సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహార దీక్ష చేసి సంచలనం సృష్టించారు. విప్లవ శంఖం పేరిట మాదాల తనే హీరోగా సినిమా తీశారు.

బీరం మస్తాన్ రావు దానికి దర్శకత్వం వహించారు. సినిమా లో అభ్యంతరకర సంభాషణలు ఉన్నాయని సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ కమిటీ నిరాకరించింది. తర్వాత ఆర్.సి కి పంపారు. ఆర్ సి కూడా కొన్ని డైలాగులు కట్ చేయాల్సిందే అని చెప్పింది.

ఆ డైలాగులన్నీ కట్ చేస్తే సినిమా ఎవరికి అర్థం కాదని మాదాల రంగారావు అధికారులకు వివరించారు. వారు ససేమిరా అన్నారు. దీంతో మాదాల ఎట్టి పరిస్థితుల్లోనూ సర్టిఫికెట్ సంపాదించి సినిమా రిలీజ్ చేయాలని సంకల్పించారు.

అంతే మర్నాడు ఉదయాన్నే వెళ్లి చెన్నైలో సెన్సార్ కార్యాలయం ఉన్న శాస్త్రి భవనం ఆవరణలో నిరాహారదీక్షకు కూర్చున్నారు. మామూలుగా ఆఫీసుకి వచ్చిన అధికారులు దీక్ష కు దిగిన మాదాలను చూసి షాక్ తిన్నారు.

ఈ విషయం పరిశ్రమలో పలువురికి తెలిసి వారు వాచ్చి దీక్షలో కూర్చున్నారు. కమ్యూనిస్ట్ నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. పత్రికలు  ఈ దీక్షకు ప్రాముఖ్యత నివ్వడంతో దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో అలజడి రేగింది.

దీక్ష 15 రోజులపాటు సాగింది. దాంతో మాదాల పేరు మ్రోగిపోయింది. అన్ని రాష్ట్రాల మద్దతు ఆయనకు లభించింది. ప్రధాని ఇందిరా గాంధీ దృష్టికి కూడా వెళ్ళింది. సమాచార శాఖామంత్రి కి ఫోన్ చేసి ఆ ఇష్యూ సెటిల్ చేయండని ఇందిర చెప్పిందని అంటారు.

దాంతో సెన్సార్ అధికారులు దిగొచ్చారు.  చలనచిత్ర పరిశ్రమలో అదొక అరుదైన ఘటన.ముందెన్నడూ జరగలేదు .. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా జరగలేదు. ఆ తర్వాత మాదాల 93 ఆగస్టులో గుంతకల్ లో కోపరేటివ్ స్పిన్నింగ్ మిల్ ను తెరిపించడానికి 15 రోజులు దీక్ష చేసారు.

అంతకు ముందు తమిళ నాడులో కూడా కార్మికుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. మాదాల రంగారావు తీసిన ‘ఎర్ర’ సినిమాలకు ఎలాంటి  ప్రత్యేకత ఉందో ఆయన సినిమాల్లో పాటలకూ అంతే ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. గ్రామసీమల్లో జనాలు పాడుకునే పాటల బాణీలే మాదాల సినిమాలకు మంచి పేరు తెచ్చాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980-90 దశకాల్లో ఆ పాటలు, సినిమాలు బాగా ప్రజాదరణ పొందాయి.1980లో మాదాల రంగారావు నిర్మించిన తొలి సినిమా ‘యువతరం కదిలింది’ అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు ఎక్కువగా ప్రేమ .. పగ-ప్రతీకారాలు వంటి అంశాలే కథావస్తువుగా కొనసాగుతున్న తెలుగు సినిమా పయనాన్ని ఆయనో మలుపు తిప్పారు.ఆ తర్వాత టీ కృష్ణ .. నారాయణమూర్తి వంటి వారు మాదాల బాటలో పయనించారు. మరో పోస్టులో మాదాల తీసిన సినిమాల గురించి చెప్పుకుందాం. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!