మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. నిరసన వెనుక రాజకీయ లక్ష్యం ఏదైనా కావచ్చు.
రాజకీయ నాయకునికి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టె ఉద్దేశం ఎపుడూ ఉంటుంది. దాన్ని సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం లో చంద్రబాబు దిట్ట. పోలీసులతో కాసేపు వాగ్యుద్ధం చేసి గంట తర్వాత లాంజీ లోకి వెళ్లి రిలాక్స్ అయినా .. ఆయనను ఎవరు అడిగే వారు లేరు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. ప్రభుత్వ వైఖరిని జనాల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతోనే అలా అక్కడ భైఠాయించారు. దాంతో ఇటు నాయకులు అటు కార్యకర్తలు అలెర్ట్ అయ్యారు. రావాల్సిన మైలేజ్ వచ్చేసింది. అందులో ఆయన సక్సెస్ అయ్యారు.
ఆ .. ఎవరి కోసం చేస్తారు .. పార్టీ కోసమే కదా అని ఆయన వ్యతిరేకులు విమర్శించవచ్చు. అందులో కూడా తప్పేమి లేదు. పార్టీ ని కాపాడుకోవడం… పార్టీని మరల జనంలోకి తీసుకెళ్లడం పార్టీ అధ్యక్షుని గా ఆయన బాధ్యత. కొంతమంది ఆ బాధ్యతలు నిర్వహించడంలో ఎంత గొప్పగా వ్యవహరిస్తున్నారో తెలియనిదేమి కాదు. ఆ సన్నివేశం లో మరొకరు ఉంటే కథ వేరొక విధంగా ఉండేది. చంద్రబాబుది మొదటినుంచి చిన్న చిన్న విషయాలకు నిరుత్సాహపడే మనస్తత్వం కాదు. 1983 లో చంద్రగిరిలో ఓడిపోయిన వెంటనే ఆయన వ్యూహం మార్చారు.
మొహమాట పడకుండా మామ గారి దగ్గరికి వెళ్లి తెలుగుదేశంలో చేరారు. పార్టీలో తన కెరీర్ ఊపందుకోవడానికి అవసరమైన వ్యూహాల్ని అమలు చేశారు. అవి తప్పా ఒప్పా అన్నది వేరే విషయం. ఓపిగ్గా పనిచేశారు. అవకాశం కలసి వచ్చింది. పదమూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అది వెన్నుపోటా ? అధికార మార్పిడా ? ఆనాటి చారిత్రిక అవసరమా అన్నది కూడా వేరే విషయం.
ఇక పార్టీని ఓన్ చేసుకున్నాక దాన్ని ముందుకు నడపటానికి గట్టి కృషే చేశారు. 2004 లో అధికారం కోల్పోయాక .. పార్టీని మూసి పడేయలేదు. 2009 లో మళ్ళీ ఓడిపోయాక కూడా మరే పార్టీలోనే విలీనం చేయలేదు. పదేళ్లు పార్టీని పట్టుదలగా నడిపారు. కార్యకర్తలు .. నాయకులూ పార్టీకి దూరం కాకుండా చూసుకున్నారు. ఖర్చుకు వెనుకాడలేదు. ఎన్ని కోట్లు ఖర్చయిందో బాబు కి తెల్సు .. పార్టీ నేతలకు తెల్సు. ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టారా అన్నది ప్రధానం కాదు.
అవకాశం … అధికారం కోసం ఎంత ఓపిగ్గా ఎదురు చూసారన్నదే అసలు విషయం. కాబట్టి ఆయన వయసు అయిపొయింది ..ఓపిక తగ్గింది. రాజకీయాలకు పనికి రాడు అని లెక్కలు వేసుకుని సూత్రీకరించడం శుద్ధ దండగ. ఆయన గోల్ అధికారమే. ఆ టార్గెట్ ను సాధించడానికి అలసిపోయే వరకు పోరాడతాడు. అందుకోసం ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటారు. చంద్రబాబు ఏమి మడి కట్టుకుని రాజకీయాలు చేస్తున్నానని చెప్పలేదు. ఆయనే కాదు ఇతరులు చేయడం లేదు. కాబట్టి రాజకీయాల్లోఎత్తులు పై ఎత్తులు సహజమే.
ఇక అసలు ఓపిక .. సహనం అనే పాయింట్ కొస్తే దివంగత నేత వైఎస్ కి కూడా ఓపిక ..సహనం ఎక్కువే. అధికారం లోకి రావాలన్న కాంక్ష ఉన్నప్పటికీ అవకాశం కోసం దాదాపు 25 ఏళ్ళు వేచిచూసారు. రెండు సార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. పాదయాత్ర తో ఆయన కృషి ఫలించింది. ఆయన కుమారుడు ఏపీ సీఎం జగన్ కి కూడా ఓపిక .. సహనం తండ్రి వారసత్వంగా వచ్చాయి. తండ్రి మరణించినప్పటి నుంచి జనం లో తిరిగారు.
2014 లో అధికారం దక్కలేదని పార్టీ ని వదిలేయలేదు. మరో ఐదేళ్లు ఓపిగ్గా పార్టీని నడిపారు. 2019 లో అధికారంలో కొచ్చారు. ఈ ముగ్గురి లో ఎవరి స్టైల్ వారిదే. ఏదో సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టు జింక పిల్లను వేటాడాలంటే పులి ఎంతో ఓపిగ్గా వేచిచూస్తుంది. ఆ లక్షణం కొద్దిమందికే ఉంటుంది. (మరోసారి వైఎస్ ఆర్ … జగన్ గురించి చెప్పుకుందాం )
————K.N.MURTHY