“చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత కోటి సూర్యప్రభ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత పేరు దాసం గోపాలకృష్ణ .
దాసరి నారాయణరావు డైరక్ట్ చేసిన చిత్రాలన్నిటికీ దాదాపు ఆయనే మాటల రచయిత ఒక్క చిల్లరకొట్టు చిట్టెమ్మకు తప్ప. దాసం నాటకం కోసం రాసిన డైలాగ్స్ యధాతథంగా ఉంచేశారు. అందుకే మాటల రచయితగా దాసం పేరే వేసేశారు. జయచిత్ర టైటిల్ రోల్ పోషించిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ మంచి విజయాన్నే అందుకుంది.
దాసం గోపాలకృష్ణ రాసిన చిలకా గోరింక, రాగజ్వాల, పున్నమిదేవి వంటి నాటకాలు కూడా ఆ రోజుల్లో పాపులర్ . హాస్యంతో సాంఘిక సమస్యలపై చురకలు వేయడం దాసం అలవాటు. ఎన్ని రాసినా గోపాలకృష్ణ సంతృప్తి చెందలేదు. ఏది రాసినా నాటక చరిత్రలో ఓ బుక్ లా కాకుండా చరిత్రలో గుర్తుండిపోయేలా రాయాలి అని సంకల్పించారు.
ఆ సంకల్పంలోంచి పుట్టిందే ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ నాటకం. ఇది ఊహలోంచి పుట్టింది కాదు. వాస్తవం లోంచి పుట్టింది. విభిన్న పాత్రలతో, పాత్రకు తగ్గ భాషతో, వృత్తికి ప్రవృత్తికి తగిన యాసతో, మాండలికం తో ఒక పాత్రకు మరొక పాత్రకు పోలిక లేకుండా భాష వాడిన ఏకైక తెలుగు నాటకం ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కోడవల్లి గ్రామంలో 13-2-1930న జన్మించిన గోపాలకృష్ణ బి.ఎ.వరకు చదువుకున్నారు. అడవి బాపిరాజు, నండూరి రామకృష్ణమాచార్యుల శిష్యుడు. స్వీయ దర్శకత్వంలో గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ నిర్మిస్తున్నప్పుడు మద్రాసుతో పరిచయం పెంచుకున్నారు గోపాలకృష్ణ . ఘోస్ట్ రైటర్ గా సర్దుకుపోయారు. ‘పసివాడి పగ’ చిత్రంతో 1972లో పాటల రచయిత అయ్యారు ఆ మూవీలో గోపాలకృష్ణ రాసిన ‘సీసామీద చెయ్యి….’ మంచి ప్రాచుర్యాన్నే సాధించింది.
‘చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాకు డైలాగులతో పాటు ‘చుక్కల్లో పెద చుక్క సందమామా’, ‘సూడు పిన్నమ్మా పాడు పిల్లడు’, ‘సువ్వీ కస్తూరి రంగా’ తది తర పాటలూ రాశారు. అవన్నీ జనం నోళ్లలో నానినవే. ఆ తర్వాత కుడి ఎడమైతే, మంగళ తోరణాలు, ప్రెసిడెంట్ పేరమ్మ’ తదితర చిత్రాలకు కథ, మాటలు రాసారు దాసం గోపాలకృష్ణ.
‘చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, పసుపు పారాణి, తిరుపతి, కళ్యాణి, ప్రణయగీతం, రావణుడే రాముడైతే, దేవదాసు మళ్లీ పుట్టాడు’ వంటి చిత్రాల్లో సుమారు 80 పాటలు రాసారు. ఆయన రాసిన పాటల్లో ఎవర్ గ్రీన్ సాంగ్ “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు ” ఇప్పటికి వినబడుతుంటుంది
ఇక శివరంజని లో దాసం రాసిన ‘జోరుమీదున్నావు తుమ్మెదా ‘ పాట చాలా బిగ్ హిట్. జానపదం రాయాలంటే కొసరాజే రాయాలనే దర్శక నిర్మాతలు చాలామంది దాసం తో కూడా పాటలు రాయించుకున్నారు. 1993 మార్చి 10వ తేదీ కన్నుమూశారు దాసం గోపాలకృష్ణ.
1. పేదలపాలిటి పెన్నిదివమ్మవేదశాలకు వేలుపువమ్మా – ఎల్.ఆర్. ఈశ్వరి బృందం – రచన: దాసం పల్లె పడుచు 2. ఓపలేకున్నాను సెందురూడా…దేవదాసు మళ్లీ పుట్టాడు.. 3. రే రే రేక్కాయలో ఆ రే రే రేక్కాయలో.. సందెకాడ సిన్నోడు – ఎస్. జానకి బృందం – రచన: దాసం కోరికలే గుర్రాలైతే… 4. శివరంజనిలో పాలకొల్లు సంతలోనా…
5. అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా..రావణుడే రాముడైతే… 6. ఉప్పుచేప పప్పుచారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ…రావణుడే రాముడైతే.. 7. గుబులు పుట్టిస్తావు ఓ తుమ్మెదా…కళ్యాణి 8. ప్రణయగీతంలో జట్కా పాట.
9. సూడు పిన్నమ్మా…పాడు పిల్లడు…చిల్లరకొట్టు చిట్టెమ్మ 10. గరం గరం బల్ జోరు గరం ముంతక్రింద పప్పు – ఎస్.పి. బాలు – అల్లుడు పట్టిన భరతం … 11. పసుపు పారాణిలో రేవులోన చిరుగాలి… ఇవి దాసం రాసిన పాటల్లో హిట్టు కొట్టినవి.
—————- Bharadwaja Rangavajhala
Nice story..informative.