Trend Setter…………………………………………………..
తెలుగు సినీ పరిశ్రమ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మాత్రమే. చెప్పదల్చుకున్నదేదో నిర్మొహమాటంగా చెప్పే ధైర్య శాలి కూడా కృష్ణే. ప్రముఖ హీరో ఎన్టీఆర్ అభిమాని అని చెప్పి .. ఆయనతోనే పోటీ పడిన నటుడు కూడా కృష్ణే. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు ఆయన. అందులో సందేహమే లేదు. కృష్ణ కోపం తాత్కాలికమే.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు కృష్ణ వైపే మొగ్గు చూపారు. తేనె మనసులు తో హీరో అయిన కృష్ణ అగ్ని పరీక్ష తో నిర్మాత గా మారారు.
ఘట్టమనేని కృష్ణ గా పాపులర్ అయిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964 కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964-65లో తేనెమనసులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైనాడు. మూడవ సినిమా గూఢచారి 116 తో పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.
ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 350 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. 1970లో పద్మాలయా సంస్థ తో నిర్మాతగా మారారు. ఎన్నో హిట్ మూవీస్ తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు. తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి … సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందారు.
కృష్ణ నటించిన సినిమాల్లో కొన్ని ఆణిముత్యాల లాంటి సినిమాలు ఉన్నాయి.. హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమా విడుదలై 51 ఏళ్ళు అవుతోంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు.
నిర్మాతగా మొదటి సినిమా “అగ్నిపరీక్ష ” హిట్ కాకపోవడంతో హీరో కృష్ణ నిరాశపడ్డారు. ఆ నిరాశ లో నుంచి పుట్టిన కసే “మోసగాళ్లకు మోసగాళ్ళు” తీసేందుకు ముందడుగు వేయించింది.సినిమా గురించి చెప్పుకోవాలంటే విశేషాలు చాలానే ఉన్నాయి. భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
కృష్ణ ఈ సినిమాతో స్టార్ హీరో గా ఎదిగారు. ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో కేవలం 28 రోజుల్లో ఈ సినిమా తీయడం ఒక రికార్డు. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. హాలీవుడ్ సినిమా కథల స్ఫూర్తి తో రూపొందిన ఈ సినిమా ఆంగ్లంలోకి అనువాదమై అక్కడి ప్రేక్షకులను అలరించింది.
ట్రెజర్ హంట్ పేరిట 125 కి పైగా దేశాల్లో విడుదలై కనకవర్షం కురిపించింది. అలాగే తమిళ్, హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.ఈ సినిమా స్ఫూర్తి తో మరెన్నో కౌబాయ్ సినిమాలు తెలుగులో రూపొందాయి. హీరో కృష్ణ తోనే 15 సినిమాలు వరకు వచ్చాయి. వాటిలో కొన్ని బాగానే ఆడాయి. మరి కొన్ని అంతగా ఆడలేదు . ఇవన్నీ పూర్తి అయ్యేవరకు కృష్ణ మళ్ళీ సొంత సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు.
కృష్ణ వారసుడు అయిన హీరో మహేష్ కూడా టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమాలో నటించాడు . దీన్ని తమిళ్, హిందీ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేశారు. జయంత్ తీసిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. కృష్ణ అల్లుడు సుధీర్ 2015 లో “మోసగాళ్లకు మోసగాడు” టైటిల్ తో తీసిన సినిమాలో నటించాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్ర కథ మన నేటివిటీ కి దగ్గరగా లేకపోయినా ప్రేక్షకులు అప్పట్లో పట్టించుకోలేదు. కొత్త ట్రెండ్ , బోర్ లేకుండా సాగే కథనం ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఈ సినిమాకు కథ మాటలు సమకూర్చింది ప్రముఖ రచయిత ఆరుద్ర. నిర్మాతలు చెప్పినట్టు ఆయన కథను వండారు. దర్శకుడు కేఎస్ ఆర్ దాస్ దానికి సొబగులు అద్ది ప్రేక్షకులకు వడ్డించారు.
“గుడ్ , బ్యాడ్ అండ్ అగ్లీ” లో కొంత … “మెకన్నాస్ గోల్డ్” లో కొంత … “ఫ్యూ డాలర్స్ మోర్ ” లో కొంత కథను , సన్నివేశాలను తీసుకొచ్చి రోట్లో వేసి బాగా తొక్కి, మసాలా వేసి దంచి కొత్త కథను ఆరుద్ర తయారు చేశారు. అది బాగా నచ్చడం తో ఇక మార్పులు లేకుండా కృష్ణ సినిమా తీశారు.
మొదట్లో ఈ సినిమాను ఆరుద్రనే కృష్ణ డైరెక్ట్ చేయమన్నారట. ఆయన తన వల్ల కాదని తేల్చి చెప్పడంతో KSR దాస్ రంగం లోకి దిగారు. అప్పటికే దాసు తో కృష్ణ కు బాగా పరిచయం ఉండటం, దాస్ యాక్షన్ సినిమాలు తీసి ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. దాస్ కూడా తన సత్తా చాటుకున్నారు.
ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడికి వెళ్లేందుకు సాంకేతిక నిపుణులు ,చిన్నఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక రైలు బుక్ చేశారు. థార్ యెడారికి దగ్గర వూర్లో అందరికి బస ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి యూనిట్ సిమ్లా తరలి వెళ్లి కొన్ని దృశ్యాలు , పాటలు చిత్రీకరించారు. తొలుత ఈ సినిమాకు “అదృష్టరేఖ” అనే టైటిల్ పెడదామనుకున్నారు కానీ చివరకు “మోసగాళ్లకు మోసగాడు” టైటిల్ ఖరారు అయింది.
హీరోను ఎడారిలో వదిలి వెళ్ళినపుడు తాగడానికి నీళ్లులేక , ఎండ వేడిమికి మొహమంతా పొక్కులు వస్తాయి. కృష్ణకు ఆ విధంగా మేకప్ చేసేందుకు మేకప్ మ్యాన్ మాధవరావు చాలా శ్రమపడ్డారు. బఠానీలపై ఉండే తొక్కును మొహంపై అతికించి మేకప్ చేశారు. దాంతో సన్నివేశానికి కావాల్సిన విధంగా కృష్ణ తయారయ్యారు. ఇక వీఎస్ ఆర్ స్వామి కెమెరా పని తనం సినిమాకు వన్నె తెచ్చింది.
నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు ..ఆ క్యారెక్టర్ ఊతపదం ‘అబ్బయ్య’ కూడా బాగా పేలింది. నాగభూషణం పై చిత్రీకరించిన పాట ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’ కూడా సరిగ్గా కథకు సరిపోయింది. ఆదినారాయణరావు సంగీతం కూడా సినిమాకు ఊపు నిచ్చింది. కృష్ణ ఆస్థాన రచయిత అప్పలాచార్య నాగభూషణం పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు.
ఈ సినిమా కథ ఆధారంగా వెండితెర నవల కూడా వచ్చింది. కృష్ణ అభిమాని విజయ్ దీన్ని తీసుకొచ్చారు. కృష్ణ తర్వాత కొందరు కౌబాయ్ పాత్రలు పోషించినా కృష్ణను మరిపించలేకపోయారు. ప్రేక్షకుల మనసుల్లో కృష్ణే తెలుగు సినిమా ఎవర్ గ్రీన్ కౌబాయ్ అని చెప్పుకోవచ్చు.