నాటక రంగంలో కృష్ణుడంటే ఆయనే !

Sharing is Caring...

Bhandaru Srinivas Rao …………………………………

కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.

ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో ఓ మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే. తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతో పాటు, నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి ఒక్క పద్మ అవార్డు మినహా. ఓసారి తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి. అందులో కృష్ణ పాత్రధారి పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. ‘మామా సత్యవతీ పౌత్రా! ధాత్రరాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజ లోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం ఓ మధురాతి మధురమైన జ్ఞాపకం.

‘పతితులు కారు నీయెడల భక్తులు, శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది. ‘ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు. ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు. తెలుగు నాటకరంగాన్ని కొన్నేళ్ళ పాటు ఏలిన నటుడు పీసపాటి నరసింహమూర్తి.

పద్య గానం లో పీసపాటి వారు గణనీయమైన మార్పులు తెచ్చారు. నిమిషం పాటు ఉండే పద్యానికి సుదీర్ఘమైన రాగాలు ఆలపించడం అప్పట్లో ఉండేది. ఆ ఒరవడిని పీసపాటి వారు మార్చేశారు. అనవసరమైన సాగదీతను తగ్గించి పద్యానికే ప్రాధాన్యత నిచ్చేవారు. అలాగే కృష్ణుని వేషధారణలో కూడా మార్పులు తెచ్చారు. దేహానికి అంటి పెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కాను ధరించి నిజంగా నీలవర్ణ కృష్ణుడనే భావనను ప్రేక్షకులకు కల్పించేవారు.

సినిమాలలో కృష్ణుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు కూడా పీసపాటి వారు కృష్ణుడు పాత్ర పోషించిన పద్య నాటకాలను చూసే వారట. వేరే పాత్రలు పోషించినప్పటికీ పీసపాటి వారు కృష్ణుడి పాత్రలో జగత్ ప్రసిద్ధి గాంచారు. ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణ పురస్కారం తో గౌరవించింది. జీవిత చరమాంకం వరకు నటించిన పీసపాటి వారు 2007లో ఈ లోకం నుంచి నిష్క్రమించారు.పద్యనాటకాలకు విశేషఖ్యాతి తెచ్చిపెట్టిన పీసపాటి నరసింహమూర్తి తెలుగుపద్యం ఉన్నంతకాలం చిరంజీవిగా ఉంటారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!