Ravi Vanarasi ………………
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రను ‘బర్మన్ పూర్వ యుగం’, ‘బర్మన్ అనంతర యుగం’ అని రెండు స్పష్టమైన భాగాలుగా విభజించవచ్చు. హిందీ సినిమా సంగీతాన్ని కేవలం సంప్రదాయ మెలోడీలకు, రాగాలకు మాత్రమే పరిమితం చేయకుండా, దానికి అంతర్జాతీయ స్థాయి ధ్వని విన్యాసాలను అద్దిన ఘనత రాహుల్ దేవ్ బర్మన్‌ది.
అభిమానులు ఆయనను ప్రేమగా ‘పంచమ్ దా’ అని పిలుచుకుంటారు. ఆయన తన అసాధారణ ప్రతిభతో ఒక తరాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా, మరణించి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ రిమిక్స్‌ల రూపంలో, కవర్ సాంగ్స్ రూపంలో యువతను అలరిస్తూనే ఉన్నారు.
1939 జూన్ 27న కోల్‌కతాలో జన్మించిన రాహుల్ దేవ్ బర్మన్, పుట్టుకతోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆయన తండ్రి, దిగ్గజ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్). తండ్రి నుండి శాస్త్రీయ సంగీత పునాదులను, బెంగాలీ జానపద బాణీలను ఒడిసిపట్టుకున్న రాహుల్, చిన్నతనం నుండే ప్రయోగాలు చేయడం ప్రారంభించారు.
ఆయనను ‘పంచమ్’ అని పిలవడానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఆయన చిన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు అది సంగీతంలోని ఐదవ స్వరం (పంచమ స్వరం – ‘ప’) లాగా వినిపించేదట, అందుకే ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ఆయనకు ఆ పేరు పెట్టారు.1960వ దశకం చివరలో, 70వ దశకం ప్రారంభంలో భారతీయ సినిమా ఒక భారీ మార్పుకు లోనైంది.
అప్పటివరకు ఉన్న సామాజిక చిత్రాల స్థానంలో, రాజేష్ ఖన్నావంటి సూపర్ స్టార్ల రాకతో ‘యూత్ లవ్ స్టోరీస్’ ఊపందుకున్నాయి. అప్పటివరకు ఉన్న శాస్త్రీయ, జానపద బాణీలు యువతకు కొంత పాతవిగా అనిపిస్తున్న తరుణంలో, ఆర్.డి. బర్మన్ ప్రవేశం ఒక పెను తుఫానులా సాగింది.
ఎలక్ట్రానిక్ రాక్, పాప్, జాజ్ సంగీతాన్ని భారతీయ తెరపైకి తెచ్చి, వాటిని భారతీయ ఆత్మ దెబ్బతినకుండా మలచడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆయన ప్రాథమిక ప్రేరణ బెంగాలీ జానపద సంగీతం అయినప్పటికీ, దానిని గ్లోబల్ మ్యూజిక్‌తో అనుసంధానం చేయడంలో ఆయన చూపిన చొరవ అద్వితీయం.
ఆర్.డి. బర్మన్ కేవలం ఒక భారతీయ సంగీత దర్శకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గ్లోబల్ మ్యుజీషియన్. ఆయన సంగీతంలో మనం గమనించదగ్గ ప్రధాన అంశాలు ఎన్నో ఉన్నాయి.. పాశ్చాత్య, లాటిన్ సంగీతం…డిస్కో, రాక్, జాజ్ సంగీత మూలాలను ఆయన తన పాటల్లో అద్భుతంగా ఇమిడ్చారు. ముఖ్యంగా బ్రెజిలియన్ ‘సాంబా’ రిథమ్స్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆయనే.
మధ్యప్రాచ్య దేశాల సంగీత ఛాయలను, ముఖ్యంగా ‘మెహబూబా మెహబూబా’ వంటి పాటల్లో ఆయన ఉపయోగించిన శైలి శ్రోతలకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన బాణీలను ఆధునిక వాయిద్యాలతో కలిపి ఒక సరికొత్త ‘ఫ్యూజన్’ సృష్టించారు.
ప్రముఖ విమర్శకుడు బిస్వరూప్ సేన్ అభిప్రాయం ప్రకారం, బర్మన్ సంగీతం అంటే “వేగవంతమైన గమనం, యవ్వన ఉత్సాహం, ఉత్తేజకరమైన లయల” సమాహారం.బర్మన్ కేవలం వాయిద్యాలతోనే సంగీతం చేయలేదు.. నిత్య జీవితంలో మనం చూసే వస్తువుల నుండి కూడా అద్భుతమైన శబ్దాలను సృష్టించారు.
ఆయన సృజనాత్మకతకు కొన్ని అద్భుత ఉదాహరణలు.. ‘షోలే’ చిత్రంలోని “మెహబూబా మెహబూబా” పాట ప్రారంభంలో వచ్చే విలక్షణమైన గాలి శబ్దం కోసం ఆయన ఖాళీ బీర్ బాటిళ్లలోకి గాలిని ఊది ఆ ధ్వనిని రికార్డ్ చేశారు.
అలాగే ‘యాదోం కి బారాత్’ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ “చురా లియా హై తుమ్నే” లో వచ్చే గలగలమనే శబ్దం కోసం టీ కప్పులను, సాసర్లను స్పూన్‌తో కొడుతూ రికార్డ్ చేశారు. ‘పడోసన్’ చిత్రంలోని “మేరీ సామనే వాలీ ఖిడ్కీ మే” పాటలో ఒక రకమైన ‘వుూష్’ శబ్దాన్ని ఒక గరుకైన ఉపరితలంపై దువ్వెనను వేగంగా రుద్దడం ద్వారా సాధించారు.
‘సత్తే పే సత్తా’ చిత్రంలో ఒక సన్నివేశం కోసం గాయని అన్నెట్ పింటో చేత నీటిని పుక్కిలించి ఆ శబ్దాన్ని నేపథ్య సంగీతంగా వాడారు.పాటల్లో రిథమ్ కోసం రొప్పుతూ గాలి పీల్చడం, చప్పట్లు కొట్టడం వంటివి ఆయన ట్రేడ్ మార్క్ శైలి.బర్మన్ తన ఆర్కెస్ట్రాలో బ్రాస్ సెక్షన్ (ట్రంపెట్స్, సాక్సోఫోన్), ఎలక్ట్రిక్ గిటార్లను వాడిన విధానం అప్పట్లో ఒక సంచలనం.
ఒకే పాటను వేర్వేరు గాయకులతో, వేర్వేరు శైలులలో రికార్డ్ చేయడం బర్మన్ ప్రత్యేకత. దీనికి ఉత్తమ ఉదాహరణ 1981లో వచ్చిన ‘కుద్రత్’ సినిమా. ఈ చిత్రంలోని “హమే తుమ్సే ప్యార్ కిత్నా” పాటను రెండు వెర్షన్లలో రూపొందించారు..ఒకటి కిషోర్ కుమార్ వెర్షన్…దీనిని లైట్ సెమీ-క్లాసికల్, పాప్ శైలిలో రికార్డ్ చేశారు. ఇది సామాన్య ప్రేక్షకులకు త్వరగా చేరువైంది.
రెండోది పర్వీన్ సుల్తానా వెర్షన్…దీనిని పూర్తి స్థాయి శాస్త్రీయ సంగీత బాణీలో రికార్డ్ చేశారు. దీనికి ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఒకే ట్యూన్‌ను ఇద్దరు విరుద్ధమైన శైలి గల గాయకులతో పాడించి, ఆ పాటలోని రెండు వేర్వేరు కోణాలను ఆవిష్కరించడం బర్మన్ లోని సంగీత దర్శకుడి పరిణతిని చూపిస్తుంది.
మహ్మద్ రఫీ యుగం నడుస్తున్న సమయంలో కిషోర్ కుమార్‌లోని అసలైన గాయకుడిని ప్రపంచానికి పరిచయం చేసింది బర్మనే. ‘ఆరాధన’ చిత్రం నుండి ప్రారంభమైన వీరి ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచింది. కిషోర్ కుమార్ వైవిధ్యమైన గొంతును బర్మన్ ఒక మంత్రదండంలా వాడుకున్నారు.
మరోవైపు ఆశా భోంస్లే గొంతులోని మాదకత్వాన్ని, శైలిని గుర్తించి ఆమెతో ‘దమ్ మారో దమ్’ వంటి ఐకానిక్ పాటలను పాడించారు. తరువాతి కాలంలో ఆశా భోంస్లే ఆయన జీవిత భాగస్వామి కూడా అయ్యారు. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ఇప్పటికీ డ్యాన్స్ ఫ్లోర్‌లను ఊపేస్తున్నాయి.
బర్మన్ సంగీతంలో ఒక రకమైన ‘ఆర్కిటెక్చర్’ ఉంటుంది. ఆయన కేవలం ట్యూన్ కట్టడమే కాకుండా, పాటలో ఏ వాయిద్యం ఎక్కడ ఉండాలి, ఏ నిశ్శబ్దం ఎక్కడ ఉండాలి అనే విషయంలో చాలా స్పష్టతతో ఉండేవారు. ఆయన పాటల్లోని మ్యూజిక్ బిట్స్ పాట కంటే కూడా ఎక్కువ పాపులర్ అయ్యేవి. ఉదాహరణకు ‘కరావాన్’ సినిమాలోని పాటల మ్యూజిక్ బిట్స్ నేటికీ డిస్కోల్లో వినబడతాయి.
ఆర్.డి. బర్మన్ అంటే కేవలం ఫాస్ట్ బీట్స్ మాత్రమే కాదు. ‘అమర్ ప్రేమ్’, ‘ఆంధీ’, ‘పరిచయ్’ వంటి సినిమాల్లో ఆయన అందించిన మెలోడీలు గుండెను హత్తుకునేలా ఉంటాయి. “చింగారీ కోయి భడ్కే” లేదా “తేరే బినా జిందగీ సే” వంటి పాటలు ఆయనలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరిస్తాయి.
కొత్త టెక్నాలజీని, సింథసైజర్లను వాడుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 80వ దశకంలో డిస్కో సంగీతం వెల్లువలా రావడం, కొత్త సంగీత దర్శకుల పోటీతో బర్మన్ కొంత కాలం మరుగున పడ్డారు. కానీ, ఆయన తన కెరీర్ ముగింపులో ‘1942: ఎ లవ్ స్టోరీ’ చిత్రంతో అద్భుతమైన పునరాగమనం చేశారు.
“ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” వంటి పాటలు ఆయన ఇంకా ‘కింగ్’ అని నిరూపించాయి. దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదల కాకముందే 1994, జనవరి 4న ఆయన కన్నుమూశారు. సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునికతను ఆహ్వానించడం ఎలాగో ఆయన నిరూపించారు. నేటి తరం సంగీత దర్శకులకు ఆయన ఒక నిఘంటువు వంటి వారు. బెంగాలీ పల్లెటూరి జానపదం నుండి గ్లోబల్ డిస్కో క్లబ్బుల వరకు ఆయన ప్రయాణం అద్భుతం, అనంతం.

