ఆర్ధిక విషయాల్లో ఆయనకు ముందు చూపు ఎక్కువే.

Sharing is Caring...

మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు.  సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చు పెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను  పిసినారి అని కూడా విమర్శిస్తారు. ఇక కుటుంబం విషయం లో ఆయన ఏనాడు ఏ లోటు చేయలేదు.

ఆస్తులన్నీ పంచి ఇచ్చిన తర్వాత ఆయనను కుటుంబ సభ్యులే సరిగ్గా పట్టించుకోలేదు. అది వేరే విషయం అనుకోండి. అసలు కథ లో కొస్తే అది 1978 నాటి సంగతి. అప్పటికి ఎన్టీఆర్ ‌ కుమారుల్లో నలుగురికి పెళ్ళయింది. ఆ నలుగురు కోడళ్ళకు (పద్మజాదేవీ జయకృష్ణ, మాధవీమణీ సాయికృష్ణ, లక్ష్మీ హరికృష్ణ, శాంతీ మోహన్ కృష్ణ) ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఒక సినిమా చేశారు.  

‘శ్రీతారకరామా ఫిలిమ్‌ యూనిట్‌’ బ్యానర్ ను స్థాపించి నిర్మించిన సినిమాయే  ‘డ్రైౖవర్‌ రాముడు’.  
కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ పక్కన జయసుధ హీరోయిన్ గా నటించింది. చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని కుమారుడు హరికృష్ణకు ఎన్టీఆర్ అప్పగించారు. అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని హైలెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. రాఘవేంద్రరావు దీన్ని పక్కా మాస్ మసాలా చిత్రంగా రూపొందించారు.

ఎన్టీఆర్ ను అందంగానూ , ఖరీదైన కాస్ట్యూమ్స్ లో చూపారు దర్శకుడు.  ‘ఏమని వర్ణించనూ’ అంటూ ఆత్రేయ రాసిన పాట ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటుంది. ఇక మసాలా పాటలు రాఘవేంద్రుడు తన శైలిలో తీశారు. చక్రవర్తి ఈ సినిమాకు సంగీతం అందించారు. రాఘవేంద్రుడు ఒక లైన్ చెబితే కథ మాటలు జంధ్యాల అందించారు. రాఘవేంద్రుడి పై ఉన్ననమ్మకంతో ఎన్టీఆర్ ఎక్కడ జోక్యం చేసుకోలేదని అంటారు.

1979 ఫ్రిబ్రవరి 2 వ తేదీన విడుదలైన డ్రైవర్ రాముడు సూపర్ డూపర్ హిట్ అయింది. కనకవర్షం కురిపించింది. ఆ లాభాలతోనే ఎన్టీఆర్ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్  దగ్గర స్థలం కొని నలుగురి కొడుకులకు ఇళ్ళు కట్టించి , వాటిని  కోడళ్లకు అప్పగించారు.  

ఇప్పటికి హీరో కల్యాణరామ్, ఇతర వారసులు ఆ ఇళ్లలోనే ఉంటున్నారు. ఆనాటి ఎన్టీఆర్ పెట్టిన పెట్టుబడి విలువ ఇపుడు వందలకోట్లకు చేరుకుందని అంటారు. ఎన్టీఆర్  ఆరోజుల్లోనే మహిళల ఆర్ధిక సామాజిక స్వేచ్ఛ గురించి ఆలోచన చేశారు. తెలుగు దేశం పార్టీ పెట్టి అధికారంలో కొచ్చాక  దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తిలో సమానహక్కు చట్టపరంగా కల్పించింది ఆయనే అని చెప్పుకోవాలి. తన కూతుళ్ళకు ఆస్తులను కొడుకులతో పాటు సమానంగా ఇచ్చారు.

అలా భువనేశ్వరి కిచ్చిన ఆస్తి తరవాత రోజుల్లో చంద్రబాబు కి  ప్లస్ అయింది. నటుడిగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఎన్టీఆర్ పలుచోట్ల భూములను కొన్నారు. ముందు చూపుతో అబిడ్స్ లో థియేటర్స్, శంషాబాద్ వద్ద పొలాలు, బంజారాహిల్స్ స్థలాలు  ముషీరాబాద్ లో, నాచారం లో  స్ధలాలు కొనుగోలు చేశారు.

అవన్నీ వారసులకిచ్చేసారు. ఇపుడు వాటి ధర వందల కోట్లలోనే ఉంటుంది.  ఇక డ్రైవర్ రాముడు అప్పట్లో 2.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి లెక్కలప్రకారమైతే 51 కోట్లకు సమానం. ఎన్టీఆర్ కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది.  

——– KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY October 3, 2020
error: Content is protected !!