అతగాడు నటించడు..పాత్రలో జీవిస్తాడు !!

Sharing is Caring...

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మూడో ప్రయత్నంలో ఆస్కార్ అవార్డును సాధించాడు. స్మిత్ నటించిన తొలి బయోపిక్ ‘అలీ’. ఈ సినిమా ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. విల్ స్మిత్ అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్ కు, గ్లోబల్ గోల్డ్ అవార్డ్ కు ఆయన  నామినేట్ అయ్యాడు.

విల్ స్మిత్  నటించిన రెండో బయోపిక్ ‘ది పర్శుట్  ఆఫ్ హ్యాపీనెస్’. అమెరికన్ బిజినెస్ మ్యాన్, మోటివేషన్ స్పీకర్ క్రిస్ గార్డ్ నర్ జీవితకథతో  ఈ సినిమా రూపొందింది. తండ్రీ కొడుకుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్మిత్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. భావోద్వేగాలను పండించాడు. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాడు.

ఈ సినిమాతో  ఉత్తమ నటుడిగా రెండోసారి ఆస్కార్ నామినేషన్ కు ఎంపికయ్యాడు. నైజీరియన్ – అమెరికన్ ఫిజిషియన్ బెన్నెత్ ఒమలు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కన్ క్యూషన్’ సినిమాకు ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కు నామినేట్ అయ్యాడు.

ఇలా.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అయినప్పటికీ  విజేత కాలేకపోయాడు. అయినా తన పని తాను చేసుకుపోయాడు.నిరాశను దగ్గరకు చేరనీయలేదు. ఆ తర్వాత  కింగ్ రిచర్డ్’  చిత్రంతో అనుకున్నది సాధించాడు. ఉత్తమ నటుడిగా స్మిత్ కు ఆస్కార్ ను అందించిన  ‘కింగ్ రిచర్డ్’ సినిమా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణులు వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి జీవిత కథ ఆధారంగా తీశారు.

వీనస్, సెరీనాలను టెన్నిస్ క్రీడాకారిణులుగా తయారు చేయడంలో రిచర్డ్ ఎలా కృషి చేశారు? అన్న కథాంశాన్ని భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో విల్ స్మిత్ జీవించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.  ప్రపంచమంతా స్మిత్ గురించి  మాట్లాడుకునేలా చేసింది.

స్మిత్ 12 ఏళ్ల వయసులోనే తన స్నేహితుడితో కలిసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ ఇద్దరు స్వరపరిచిన ‘గాల్స్ ఎయింట్ నథింగ్ బట్’ ట్రబుల్’ ఆల్బమ్ సంగీత శ్రోతల్ని ఆకట్టుకుంది.ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. స్మిత్ 1990లో బుల్లితెరపై మెరిశారు. ‘ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్- ఎయిర్’ అనే సిరీస్ ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.

ఉత్తమ నటుడిగా ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్’కు నామినేట్ అయ్యాడు. రెండేళ్ల తర్వాత ‘వేర్ ది డే టేక్స్ యు’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైనాడు. ఇందులో దివ్యాంగుడిగా నటించారు.  తొలి ప్రయత్నంలోనే తనదైన  నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు.

అటు యాక్షన్ చిత్రాలు.. ఇటు బయోపిక్స్ అతడిని ఉత్తమనటుడిగా తీర్చిదిద్దాయి. 1968 సెప్టెంబరు 25న జన్మించిన స్మిత్ అసలు పేరు విల్లర్డ్ క్రిస్టోఫర్ స్మిత్ జూనియర్. ఇంజినీర్ అయిన అతడి తండ్రి పేరు (విల్లర్డ్ క్రిస్టోఫర్ స్మిత్ సీనియర్) ఇదే కావడంతో.. కొన్నాళ్లకు విల్ స్మిత్ గా మారాడు.

తల్లి.. కారోలైన్. వెస్ట్ ఫిలడెల్ఫియాలోని వైన్ ఫీల్డ్ లో స్మిత్ బాల్యం గడిచింది. అతడికి ముగ్గురు తోబుట్టువులున్నారు. స్మిత్ తల్లిదండ్రులు 2000లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.  ఈ ఆస్కార్ విజేత భారతీయ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ (హిందీ)లో  గెస్టుగా కూడా నటించాడు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!