Siva Racharla……………………
Destined Prime Minister
రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ,సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” అనటం..
ఈ దేశంలో ఆక్సిడెంటల్ ప్రధానులు మొదట చరణ్ సింగ్, రెండు చంద్రశేఖర్ ,మూడు పీవీ, నాలుగు దేవ గౌడ & ఐదు గుజ్రాల్ .. తొలి కాంగ్రెసేతర ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ రాజీనామా తరువాత బలం లేకున్నా 1979 జూలైలో చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు.. ఆ హోదాలో ఒక్కసారి కూడా లోకసభ సమావేశాలు జరపకుండానే ఆరునెలలలో రాజీనామా చేశారు.
జనతాదళ్ తరుపున 1989లో విపి సింగ్ ప్రధాని అయ్యి ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండానే రాజీనామా చేయటంతో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానయ్యి 223 రోజులు ఆ పదవిలో ఉన్నారు.
1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ 232 సీట్లతో అతిపెద్దపార్టీగా నిలవటం తెలిసిందే. ఆ రోజు ప్రధాని ప్రదవికి తొలి చాయిస్ నాటి ఉప రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ .. ఆరోగ్యరీత్యా ప్రధాని పదవిని తీసుకోలేను అని చెప్పటంతో రెండో ఆప్షన్ గా పీవీ ప్రధాని అయ్యారు.. ఇంకా దేవెగౌడ & గుజ్రాల్ గురించి తెలిసిందే.
చదువే బలం
మన్మోహన్ బలం చదువు.. బాగా చదువుకున్నారు ,వచ్చిన ప్రతి అవకాశంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు.లలిత్ నారాయణ మిశ్రా అని అనేక మంత్రి పదవులు నిర్వహించారు. 1971లో విదేశీ వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో మన్మోహన్ ను విదేశీ వాణిజ్య శాఖ సలహాదారుడిగా నియమించారు.
ఇదే మన్మోహన్ తొలి రాజకీయ నియామకం. అక్కడి నుంచి వాణిజ్యశాఖ ముఖ్య సలహాదారుడిగా,ప్లానింగ్ కమీషన్ కార్యదర్శిగా ,RBI గవర్నర్ గా , ప్లానింగ్ కమీషన్ డెప్యూటీ చైర్మన్ గా ,వాణిజ్య శాఖ సలహాదారుడిగా (ప్రధాని చంద్రశేఖర్ కు ) ,University Grants Commission చైర్మన్ గా పని చేసిన తరువాత ఆర్ధిక మంత్రి అయ్యారు.
1971 నుంచి మొదలు పెట్టి 1991 మధ్య నాటే ఇరవై ఏళ్లలో కేవలం రెండు సంవత్సరాలు (1978-1980 జనతా ప్రభుత్వంలో) తప్ప మన్మోహన్ ఆర్ధిక మరియు వాణిజ్య సంబంధిత రంగాల్లో ఏదో ఒక బాధ్యతల్లో ఉన్నారు.
Accidental finance minister
పీవీ నరసింహారావు ఆర్ధిక మంత్రిగా ఐ.జి .పటేల్ ను తీసుకోవాలనుకున్నారు. పటేల్ గారు మన్మోహన్ కన్నా ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు,రిటైర్ అయిన తరువాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డైరెక్టర్ గ పనిచేశారు.పటేల్ ఆర్ధిక మంత్రి పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్ పేరు రికమెండ్ చేశారు.. మన్మోహన్ ఆర్ధిక శాఖా మంత్రి అయ్యారు.. ఆ పునాదితో 2004- 2014 మధ్య ప్రధాని అయ్యారు.
ప్రధాని మన్మోహన్
2004 ఎన్నికల ఫలితాల ముందు సోనియాగాంధీ నాయకత్వంలో ఒక బృందం అమెరికా పర్యటనకు వెళ్ళింది. అక్కడ ప్రధాని ఎవరు అవుతారు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎవరైనా కావొచ్చు ఈ బృందంలో ఉన్నవారిలో కూడా ఎవరైనా కావొచ్చు అని ఆవిడ సమాధానం ఇచ్చారు.
ఫలితాల తరువాత కాంగ్రెస్లో ఒక వర్గం సోనియాగాంధీని ప్రధాని పదవి తీసుకోమని ఒత్తిడి తెచ్చారు కానీ ఆవిడ మనసులో మాట బయటపెట్టలేదు. ఈ లోపు సోనియా ప్రధాని అయితే నేను గుండు కొట్టించుకుంటాను అని సుష్మా స్వరాజ్ ప్రకటనచేశారు ,ఆ తరువాత కొంత కాలానికి విచారం వ్యక్తం చేశారు.
సోనియా గాంధీ ప్రధాని కావాలి అనుకుంటే ఆపే చట్టం లేదు కానీ ఆవిడ మన్మోహన్ మాత్రమే ప్రధాని కావాలని అనుకున్నారు,ఆయన్నే ప్రధాని చేశారు.2009లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయలని కొందరు ప్రయత్నం చేసినా సోనియా తిరస్కరించారు. 2012లో మన్మోహన్ ను మార్చాలని బలంగా ప్రయత్నం జరిగినా సోనియా అంగీకరించలేదు.
accidental prime ministers అంటే పదేళ్లు ఆ పదవిలో ఉన్న వాళ్ళు కాదు ఒకరు వొద్దు అనుకుంటే ఆ పదవి దక్కిన వాళ్ళు ,ఏదో ఒక పార్టీ మద్దతుతో ఒక సంవత్సరమో రెండేళ్లో ప్రధాని బండి నడుపుకొచ్చిన వాళ్లు.
రాజకీయ వైఫల్యం
మన్మోహన్ ఆర్ధిక వేత్త .దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచిన ఆర్ధిక మంత్రి. 33 సంవత్సరాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ లోక్ సభకు ఒకే ఒకసారి (1999)లో పోటీచేసి ఓడిపోయారు.దేశంలోనే సంపన్నులు ఉండే తొలి మూడు నాలు నియోజకవర్గాలలో ఒకటైన సౌత్ ఢిల్లీ నుంచి 1999 ఎన్నికల్లో మన్మోహన్ బీజేపీ వీకే మల్హోత్రా మీద 29,999 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సౌత్ ఢిల్లీలో పీవీ & మన్మోహన్ ఆర్ధిక విధానాల వలన లబ్ధిపొందిన వాళ్ళే అధికం కానీ వాళ్ళు ఓటింగ్ కు వెళ్లరు,వెళ్లిన వారిలో కూడా వాజ్ పాయ్ ప్రాభవంతో బీజేపీకి ఓటు వేశారు ,మన్మోహన్ ఓడిపోయారు.సహజంగానే ఆయనకు రాజకీయ చాణుక్యత ,రాజకీయ ఎత్తుగడల మీద పట్టు తక్కువ. ఇదే 2009-2014 మధ్య కాంగ్రెస్ ను బాగా దెబ్బ తీసింది.
రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలలో సోనియా గాంధీ నో ప్రణబ్ ముఖర్జీనో మరొకరో కలుగ చేసుకోవలసి వచ్చేది. ముఖ్యంగా అన్నా హజారే ఉద్యమాన్ని సరిగా డీల్ చెయ్యలేదు అనే విమర్శ ఉంది.2012లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేసి మన్మోహన్ ను రాష్ట్రపతి చేసిఉంటే బాగుండేది అని ఇప్పటికీ ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారు.
2012లో ప్రధాని మార్పు జరిగి రాహుల్ గాంధీ లేదా ప్రణబ్ పీఎం అయ్యివుంటే కాంగ్రెస్ 2014లో గెలవలేకపోయినా ఇప్పుడున్నంత దుస్థితిలో మాత్రం ముఖ్యంగా 2019-2024 మధ్య ఉన్న పరిస్థితిల్లో ఉండేది కాదు.Manmohan He is not accidental prime minister he is destined prime minster .. దేశానికి చేయవలసిన మంచి చేశారు .. Privatization జరిగిన తీరులో నాకు అయన విధానాలతో ఏకీభావంలేదు.
History will be kinder to me
తనను బలహీనమైన ప్రధాని అని నాటి ప్రతిపక్షం చేసిన విమర్శలు,సోనియా చేతిలో రిమోట్ ఉంది అంటూ మీడియా రాసిన కథనాలను ఊటంకిస్తూ 2014లో పదవి నుంచి దిగిపోయే ముందు మన్మోహన్ చేసిన ప్రసంగంలో –“I do not believe that I have been a weak Prime Minister. I honestly believe that history will be kinder to me than the contemporary media or for that matter the Opposition in Parliament… Given the political compulsions, I have done the best I could do.” — అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..
ఆయన మాటలు ఐదేళ్లు తిరగక ముందే దేశం గుర్తించింది ,మీడియా కూడా చాలా వరకు స్టాండ్ మార్చుకొని ఆయన పాలనా గురించి వ్యక్తిత్వం గురించి పాజిటీవ్ గా రాయటం మొదలు పెట్టింది.
మన్మోహన్ మీద చాలా పుస్తకాలు వచ్చాయి కానీ ఆయన స్వయంగా ఆత్మకథ రాసివుంటే బాగుండేది. 92 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళి .