Bharadwaja Rangavajhala ………………
ఎన్టీఆర్ తెలుగువారి దురదృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అతను అద్భుతమైన విలను. అతనిలో విలనీ అద్భుతంగా పలుకుతుంది. కావాలంటే ఎవరేనా సరే ‘భలే తమ్ముడు’ యుట్యూబులో చూడండి.
అందులో తల్లి జైల్లో ఉన్న కొడుకును పలకరించడానికి వచ్చిన సన్నివేశంలోనూ , కె.ఆర్ .విజయ రామ్ ను శ్యామ్ అనుకుని మాట్లాడే సీనులోనూ అన్నగారి ముఖ కవళికలు చూడండి … అంతకంటే విలనీ ఎవరు చేయగలరు అనిపిస్తుంది.
నిర్మాత దర్శకులు హీరో వేషాలు తెస్తుంటే చేసుకుంటూ వెళ్లిపోయాడు గానీ ఆయనకు తెల్సు తనలో హీరో కంటే విలనే బాగా పలుకుతాడని. అందుకే రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు లాంటి పాత్రలను చాలా మక్కువతో చేసేవారు.
సీతారాం కల్యాణంలో రావణుడి గా .. శ్రీకృష్ణ పాండవీయం ,దానవీర శూరకర్ణ చిత్రాల్లో దుర్యోధనుడిగా విలనిజం ఉట్టిపడేలా నటించారు. విలనీకి అద్భుతమైన గ్లామర్ అద్దగల టాలెంటు ఆయన సొంతం.ఆయన విలనీ ముందు ఆనాటి ఏ విలన్ అయినా దిగదుడుపే అనిపిస్తుంది. ‘భలే తమ్ముడు’లో పాల్ కారక్టర్ లో రాజనాలను అదరగొట్టే సీన్స్ చూడండి.
చివరి రోజుల్లో కూడా ‘కె.డి.నంబర్ ఒన్’ , ‘గజదొంగ’ లాంటి కారక్టర్లు ఆయన మీద బాగానే వర్కౌట్ అయ్యాయి. సెట్ లో కెమేరా ఏ మూలపెట్టినా సీనులో ఎన్టీఆర్ విలన్ గెటప్ లో ఉంటే ఆయన కళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మంచి విలన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం అది. కనురెప్పలు పైకెత్తే విషయంలోనూ కంటిచూపులో తీక్షణత విషయంలో గానీయండి … తెలుగు తెర చేజార్చుకున్న విలన్ ఎన్టీఆర్ .
ఆమధ్య ‘జైలవకుశ’లో రావణ్ పాత్రలో జూనియర్ చాలా బాగా చేశాడన్నారు గానీ జనం … పెద్ద రామారావుతో పోలిస్తే ఎంత? ‘దేశోద్దారకులు’లో ‘చాకూ భరోసా’ గా కనిపించినంత సేపూ ఎలా ఉంటాడు మనిషి. నిజంగానే భయపెట్టేస్తాడు. ‘సతీసావిత్రి’లో కానీండి … అంతకు ముందొచ్చిన ‘ఉమ్మడి కుటుంబం’లోగానీయండి … ‘యమధర్మరాజు’గా ఆయన చూపు ఎలా ఉంటుంది?
ఆయన ముఖం మీద స్పష్టంగా కనిపించే గాటు కూడా ఆయన విలనీకి అద్భుతంగా సహకరించేది. ఆయన పోలికలు వచ్చాయని చెప్పుకుని తిరిగే జూనియర్రు విలనీ చేయకపోతే ఎట్లా? చేసి మెప్పించకపోతే ఎలా? నాగేశ్వర్రావు మనవడు ప్రేమకథా చిత్రాలు బాగా చేశాడంటే ఓకే … రామారావు మనవడు విలనీ అంతకన్నా బాగా చేసి తీరాలి. లేకపోతే రామారావు మనవడే కాదు.
‘జై లవకుశ’లో జూనియర్ … ‘భలే తమ్ముడు’ తదితర చిత్రాల్లో సీనియర్ చేసిన విలనీ తో పోలిస్తే నలభై మార్కులు వేయవచ్చనిపించింది. ఓ గ్లామరస్ విలన్ని తెలుగు తెరకు లేకుండా చేసిన నాటి నిర్మాత దర్శకులనూ ప్రేక్షకులనూ మాత్రం క్షమించేది లేదు.