Oldest Temple …………………….
వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు.
ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్ ప్రాంతాన దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్న శంకరుడిని వైకోమ్ మహాదేవుడు అని పిలుస్తారు. ఈ స్వామిని స్థానికులు వైకుంఠప్పన్ అని పిలుచుకుంటారు.
స్థలపురాణం ప్రకారం… ఖరుడు అనే రాక్షసుడు చిదంబరంలో శివుణ్ని పూజించి మూడు శివలింగాలను పొందాడట. ఎడమచేతితో ఒకటి, కుడిచేతితో ఒకటి పట్టుకుని, మూడవ లింగాన్ని తన మెడలో తగిలించుకున్నాడు. వైకోమ్ ప్రాంతంలో అతనికి అలసటగా అనిపించింది.
మూడు శివలింగాలను నేలపై ఉంచి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.తర్వాత లింగాలను తీసుకుని వెళదామని ప్రయత్నించగా వాటిని పైకెత్తలేకపోయాడు. తర్వాత అటుగా వచ్చిన వ్యాఘ్రపాదుడికి వాటి విషయం చెప్పి వెళ్ళిపోయాడు.
ఖరాసురుని కుడి చేతిలో ఉన్న శివలింగం వైకోమ్‌లో ప్రతిష్టించబడింది, మెడలో వేలాడదీసిన లింగం కడుత్రుత్తిలో.. ఎడమ చేతితో పట్టుకున్న లింగం ఎట్టుమనూర్ లో ప్రతిష్ఠితమైనాయి. వైకోమ్ కి దగ్గరలోనే ఉన్న ఆ ఊర్లలో శివాలయాలు నిర్మించారు.
తర్వాత కాలంలో పరశురాముడు అక్కడ దక్షిణామూర్తిని దర్శించి పూజావిధానాలనూ ఏర్పరచాడని కూడా అంటారు. ఆనాడు పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ని ఇక్కడ ఉదయాన్నే దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం పూట కిరాత మూర్తి గానూ, సాయంకాలాన సచ్చిదానంద మూర్తి గా కొలుస్తారు.
మరెక్కడా శివుడిని ఇలా మూడు పేర్లతో కొలిచే విధానం లేదు.ఇక పరమ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం స్వామి కి సహస్ర కలశాభిషేకం చేస్తుంటారు. వైకోమ్ మహాదేవుణ్ని అన్నదాన ప్రభువు అని కూడా అంటారు.దూర తీరాలనుంచి మహాదేవుణ్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కడుపునిండా అన్నం పెడతారు.
ఆ ప్రసాదం తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్నిఅనారోగ్యాలూ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి కార్తీకమాసంలో అష్టమి రోజున వైకోమ్ మహాదేవుడికి ప్రత్యేకపూజలు చేస్తారు.ఆ రోజును ‘వైకట్టు అష్టమి’గా వ్యవహరిస్తారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఆలయాన్ని సందర్శించడానికి తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు చొక్కాలు ధరించడానికి అనుమతించరు.
ఈ వైకోమ్ ను దక్షిణ కాశీ అని కూడా అంటారు. వైకోమ్ లో వెంబనాడ్ సరస్సు అందాలను చూడవచ్చు. ఈ లేక్ బీచ్ ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి, ఏడాది పొడవునా ప్రయాణికులు వస్తారు. ఈ బీచ్‌లో వైకోమ్ బోట్ జెట్టీ మరొక ప్రసిద్ధ ఆకర్షణ.
వైకోమ్ చేరుకోవడానికి మార్గం….
విమాన మార్గం – కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 76 కి.మీ దూరంలో ఉన్న వైకోమ్ మహాదేవ ఆలయానికి సమీప విమానాశ్రయం.ఆలయానికి చేరుకోవడానికి టాక్సీ అద్దెకు తీసుకోవచ్చు.
రైలు మార్గం – వైకోమ్ రోడ్ రైల్వే స్టేషన్ 12.5 కి.మీ దూరంలో ఉన్న వైకోమ్ మహాదేవ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్. ఆలయానికి చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సు లో వెళ్ళవచ్చు. కొట్టాయం నుంచి బస్సులో కూడా వెళ్ళవచ్చు.