Third Temple of the Panch Kedara Kshetras ………
పంచ కేదార క్షేత్రాల్లో ‘రుద్రనాథ్’ ఆలయం మూడవది.ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో ఉంది. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇది. ఇక్కడ శివుణ్ణి ‘నీలకంఠ్ మహాదేవ్’ అని పిలుస్తారు. తెల్లవారు జామున జరిగే అభిషేక సమయంలో వెండి తొడుగు తొలగిస్తారు.
ఈ నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ అరమోడ్పు కనులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో స్వామి దర్శనమిస్తారు.ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్ .అక్కడ నుండి 5 కిలోమీటర్లు కొండకోనల్లో నడుచుకుంటూ ఆలయానికి చేరుకోవాలి. ఇది కాకుండా మరో రెండు మార్గాలు ఉన్నాయి. అవి కూడా నడుచుకుంటూ వెళ్ళేవి. అందుకే రుద్రనాథుని దర్శనం అంత సులభ సాధ్యం కాదంటారు.
రుద్రనాథ్ ఆలయం ఎల్లప్పుడూ తెరిచి ఉండదు.. ఇది సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు, మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది..భారీ హిమపాతం కారణంగా శీతాకాలంలో ఆలయాన్నిమూసి వేస్తారు. ఆసమయంలో శివుని విగ్రహాన్ని గోపేశ్వర్‌లోని గోపీనాథ్ ఆలయంకు తరలిస్తారు.
ఈ మార్గంలో వెళుతూ నందాదేవి, త్రిశూల్ , నందా ఘంటి శిఖరాలను చూడవచ్చు.చుట్టూ పర్వతాలు .. పచ్చని పచ్చిక దూరంగా కనిపించే ఎత్తైన శిఖరాలు కనువిందు చేస్తాయి. ఆలయం వెనుక వైపు వైతరణి నది ప్రవహిస్తూ కనిపిస్తుంది. భక్తులు తమ పూర్వీకులకు మోక్షం కలిగించమని ఇక్కడ శివుడిని ప్రార్ధిస్తుంటారు.
ఈ కొండలు కోనల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రుద్రనాథ్ కి సమీపంలో నంది కుండ్ సరస్సు ఉంది. చుట్టూ దట్టమైన మంచు శిఖరాలతో ,ఆకుపచ్చని మైదానాలతో ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే సూర్య కుండ్ ,చంద్ర కుండ్ , తర కుండ్ ,మన కుండ్ అని పిలిచే సరస్సులు కూడా ఉన్నాయి.
అలాగే ఇక్కడికి దగ్గర్లో ఉన్న ‘పనార్ బుగియల్ ప్రాంతం చూడదగినది. ఇక్కడ అడవి పూల మైదానం చూపరులను ఆకట్టుకుంటుంది..

డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ లో దిగితే అక్కడనుంచి రుద్రనాథ్ కి వెళ్ళవచ్చు. అలాగే రుషికేశ్ కి రైలు ద్వారా చేరుకుంటే అక్కడనుంచి కూడా బస్ లో రుద్రనాథ్ సమీప గ్రామం గోపేశ్వర్ చేరుకోవచ్చు . గోపేశ్వర్ లో భోజన వసతి సదుపాయాలున్నాయి.
గతంతో పోలిస్తే సదుపాయాలు మెరుగుపడ్డాయి. సాగర్ , పనార్ బుగియల్ ప్రాంతాల్లో వసతి సదుపాయాలున్నాయి. ఉత్తరాఖండ్ టూరిజం వెబ్ సైట్ చూస్తే వసతి విషయాలు తెలుస్తాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలం యాత్రకు అనుకూలంగా ఉంటుంది.
 
				


 
										 
										